ఆ ఇద్దరు
“శేఖర్ గారా? “
“అవునండీ!”
“మీరొకసారి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వస్తారా!”
“దేనికండీ”
“మీరొస్తే చెబుతాం “
“అక్కడ ఎవరిని కలవాలి “
“ఇన్స్పెక్టర్ శంకర్ అని అడగండి.
మా వాళ్ళు గైడ్ చేస్తారు “
“ఓకే.. రేపొస్తానండీ”
ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కానీ శేఖరం ఆలోచనలను డిస్కనెక్ట్ చేయలేకపోయాడు. ఎందుకు రమ్మనుంటాడు.. ఎంత బుర్ర పగలకొట్టుకున్నా క్లూ ఏమీ దొరకలేదు.. భార్యకు ఈ విషయం చెప్పాడు.
“మీకెవరితోనయినా గొడవ పడ్డారా” అనుమానంగా అడిగింది. “నాకంత సీనుందా.. లోపల్లోపల ఉడికిపోవటమే కానీ గట్టిగా అన్నదెక్కడ “
హెల్ప్ లెస్ గా అన్నాడు.
“మీరు తప్పు చేయనప్పుడు భయం దేనికి.. ఏమీ కాదు ధైర్యంగా వెళ్లిరండి” గీతలో కృష్ణుడిలా ఆప్తవచనం పలికింది లక్ష్మి.
అయినా శేఖరం నెర్వస్ గానే ఉన్నాడు. రాత్రంతా నిద్రపట్టలేదు తనకు
******
తెల్లారింది.. రోజూ ఉత్సాహాన్నిచ్చే భానుడు ఆరోజు శేఖరం మూడ్ ని అర్థం చేసుకున్నాడులా ఉంది.. మబ్బు చాటు దాక్కున్నాడు.
“నన్ను కూడా రమ్మంటారా పోనీ” లక్ష్మి అనునయంగా అడిగింది. “అక్కర్లేదులే” బింకంగా అన్నాడు కానీ లోపల భయం అతన్నంటిపెట్టుకునే ఉంది.వస్తే బావుంటుందనిపించింది. అతని సంగతి తెలుసు కాబట్టి భార్య అతన్ననుసరించింది. మొదటిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టాడు శేఖరం.
చిన్నప్పుడు తండ్రితో స్కూల్ కు భయం భయంగా వెళ్ళిన మొదటిరోజు గుర్తుకొచ్చింది శేఖరానికి. ఎందుకొచ్చాడో చెప్పగానే కానిస్టేబుల్ ఇన్ స్పెక్టర్ కేబిన్ కు తీసుకెళ్ళాడు.
“రండి.. రండి.. ఐ యామ్ శంకర్” కరచాలనం చేశాడు ఇన్ స్పెక్టర్. ఇది పోలీస్ స్టేషనేనా అనుమానమొచ్చింది శేఖరానికి.
“మీ అనుమానం నాకర్ధమయింది. అందరితోనూ అలా ఉండంలెండి” బెల్ కొట్టి మంచినీళ్లు తెప్పించాడు ఇన్ స్పెక్టర్ శంకర్
“ఇక మిమ్మల్ని టెన్షన్ లో ఉంచను. విషయం చెప్పేస్తాను. నిన్న ఓ వ్యక్తి వచ్చాడు మా దగ్గరకు.. మీకో లెటర్ ఇవ్వటం కోసం. అతనికి మీ అడ్రస్ తెలీదు. మీరతని నంబర్ బ్లాక్ చేశారుట… ముందర ఒప్పుకోలేదు నేను. అతన్ని వెళ్లిపోమని చెప్పాను.
ఇది కంప్లయింట్ కాదు సర్ అనగానే నాకు ఇంట్రెస్ట్ కలిగింది.. మొత్తం స్టోరీ చెప్పాడు. మిమ్మల్ని కలిసే అవకాశం లేక లెటరిస్తున్నా అన్నాడు. అతని లెటర్ తీసుకుని మీకు కాల్ చేశాను”
వణుకుతున్న చేతులతో కవర్ ఓపెన్ చేశాడు శేఖరం. అక్షరాల వెంట కళ్ళు పరుగెడుతున్నాయి. గుండె వేగం హెచ్చింది. లబ్ డబ్ ల ధ్వని చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.
“శేఖర్ సార్.. ముందుగా మీకు థాంక్స్ తర్వాత సారీ. నేనెవరో పెద్ద తెలియకపోయినా మీ రచనలనభిమానించానని, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని కొవిడ్ కాలంలో చాలా సహాయం చేశారు. నేను ఆ టైం లో మీలాంటి వారి హెల్ప్ తో నాకన్నా అధ్వాన్నంగా ఉన్నవారిని ఆదుకునేందుకు ట్రై చేశాను.
మీ మంచి మనసు నాకు కొత్త వారిని పరిచయం చేసింది. నేను మిమ్మల్ని మళ్లీ మళ్లీ అడిగినప్పుడల్లా నేనబద్ధాలు చెబుతున్నానేమోనని
మీకు అనుమానం వస్తోందని నాకర్ధమయింది.. కొవిడ్ వలన అందరం కిందపడి ఇప్పుడిప్పుడే లేస్తున్నవారమే.. నేనీమధ్య ఎక్కువ సార్లడగుతున్నానని మీకు కోపం కూడా వచ్చింది.
నేను నీ ఏటిఎమ్ నా అని ఒకసారి మీరన్నది నాకు గుర్తుంది. చివరికి నామీద కోపంతో, అనుమానంతోనా నంబర్ బ్లాక్ చేశారు. నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయానని బాధపడ్డాను. మీకెలా చెప్పాలా అనుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇక్కడ కానిస్టేబుల్ కి చెబితే తనే నన్ను ఇన్స్పెక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళాడు.
ఆయన కన్విన్స్ అయ్యారు. ఇప్పటికయినా నేను మిమ్మల్ని చీట్ చేయలేదని మీరు నమ్మితే చాలు. ఉంటాను సర్..
అశోక్
లెటర్ లక్ష్మికి ఇచ్చాడు. ప్రేమగా భుజం తట్టింది.. కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాడు.
“మీరు రచయిత అని తెలిశాక మీమీద గౌరవం పెరిగింది. మీకో సర్ ప్రైజ్..” అంటూ ఆగాడు శంకర్
“అశోక్ రావయ్యా” అన్న పిలుపుకు ఆశ్చర్యంగా చూశాడు శేఖరం.
“వస్తానని అతనడగలేదు. నేనే రమ్మన్నాను. ఏమీ అనుకోకండి ” సన్నగా రివటలా ఉన్న యువకుడు వచ్చి నిలబడ్డాడు..అతనే అశోక్ అని అర్థం అయింది శేఖరానికి.
“గ్రూప్ ఫొటో సర్” ఎవరో అడిగారు.
శేఖరంకిదంతా కలలా అనిపించింది. ఇంకా నమ్మలేకపోతుండగానే ఫొటో క్లిక్ చేశారు. ట్విట్టర్ లోనూ, ఫేస్బుక్ లోనూ పోస్ట్ చేసేశారు.
“కొవిడ్ కలిపింది” అన్న శీర్షికతో జతచేసి హేష్ టాగ్, “కొవిడ్”, “హేట్సాఫ్ కొవిడ్” అని జతచేశారు
**********
మర్నాడు పేపర్ లో ఆ ఫొటో వచ్చిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. వికసించిన స్నేహబంధం దాని కేప్షన్. ఈ కథ ఇక్కడతో ముగియలేదు. శేఖరం, ఇన్ స్పెక్టర్ శంకర్ కలిసి అశోక్ తో ఓ ఎన్జీవో ప్రారంభించే ప్రయత్నం లో ఉన్నారు.
– సి. యస్. రాంబాబు