అతివృష్టి – వరదబాధలు
1) నిన్న మొన్న తాగనీరు లేకనుమాడి
జీవరాసులెన్నొ జీవమిడిచె
మిగిలినట్టి పసులు మున్నీట వరదల్లొ
దీనముగ దివిజనె దిక్కు లేక
2) ఉగ్రరూపగంగ ఉరకలెత్తి పొంగె
కంటనీరు నింపి.పంటముంచి
కట్టుకున్న యిండ్ల కనుల ముందే కూల్చి
ప్రాణములను దీసి పాతరేసె
3) నిలువ నీడ లేదు.నీరు తాగనులేము
ఆదుకొనెడి బంధువండ లేరు
మనసు చెదరి పోయె.మార్గాలువెదకగా
దారులన్నిజూడ ధారుణమ్ము
4) ఇండ్లు కూలిపోయె ఇక్కట్లు మొదలాయె
పంటచేలు అన్ని కుంట మునిగె
అడవి జంతువులకు ఆలంబనే లేదు
సాదుజంతువులకు పాదులేదు
5) మంచినీరు లేదు మాత్రలు లేవాయె
రోగమొచ్చెనంటె మూగనోము
ప్రాణమున్న చాలు బతుకు బరోసకు
అన్నపానమేది అందకున్న
6) కాశ్మిరమ్మునుండి కన్యాకుమారికి
వరద వెల్లువెత్తె వరుసగాను
నదులు పొంగిపొర్లి నాశనమొనరించె
ప్రజలు నీట మునిగి ప్రాణమిడిసె
7) కార్లు పరుగు దీసె కాగిత పడవలై
పేకమేడలాయె పాకలన్ని
కోటి రూకలున్న కూటికి కరువాయె
దండివారికైన గుండె పగిలె
8) పంచభూతములిల పగబట్టి ముంచెను
చెట్టుచేమలన్ని మట్టుబెట్టె
నేలదారులన్ని నీటి మార్గములాయె
తారతమ్యములకు తావులేదు
9) నరకమన్న నేమొ ఎరుకాయె యిప్పుడే
ఎంతవారలైన యిచట సమము
తనను తాకినపుడె తండ్లాట తెలియును
మానవత్వమున్న మనిషి యగును
10) పంచభూతములను పాడుచేయుట వల్ల నిగ్రహించలేక ఆగ్రహించె
పంచభూతములను పంచి పోషించినా
భావి కాలమందు భద్రతుండు
– కోట