మారిన (మారుతున్న) విలువలు
1) పదవి లేనినాడు పస్తులున్న చరిత
కొద్దికాల పదవి.కోటి ఆస్తి
ఆక్రమించి భూమి హత్యలు.దాడులు
విలువ మారుచుండె విశ్వమందు
2) పదవి దక్కుకొరకు పార్టీల వారిగా
ఉచిత మాటలెన్నొ ఉగ్గడించు
కలరు టీవి.రైసు.కరెంటు ఉచితమే
విలువ మారిపోయె విశదముగను
3) మామగార్లవంటి మంత్రి వర్యులయండ
టెండరేసి.పనులనెండజేసి
కోట్లకొలది ధనము కొల్లగొట్టుటె నీతి
విలువ మారిపోయె విశదముగను
4) పెద్ద నేరగాళ్ళు పేదోళ్ళ నిరికించి
నీతిమంతులమని నిక్కి తిరుగు
చట్టమందు లొసుగు.చుట్టాలు వారికి
విలువ మారిపోయె విశదముగను
5) రాజకీయమందు రాణించ బంధువు
నీతి.నియమములను నీటగలుపు
టోలుగేటడిగితె తోలు తీసిరిగదా
రాజకీయమెంత రాక్షసంబు?
6) ఆస్తిపన్ను కట్టు.ఆదాయమింతని
చిన్న బతుకులందు చిచ్చుపెట్టు
పెద్ద నేరగాళ్ళ పేరైన చెప్పరు
రాజకీయమెంత రాక్షసంబు?
– కోట