జంట శ్వాస
హరి, సుజలది గొప్ప జీవితం. వీరిది ఆదర్శ జంట. మేనరిక వివాహం అవ్వడంతో ఇరుపక్షాల లోని ఉన్నత గుణాలని అచ్చు పోస్తే తయారైన అందమైన విగ్రహాలు ఈ రెండు. వీరిద్దరూ పెద్ద కుటుంబాల్లో జన్మించినప్పటికీ జీవిత ప్రవాహంలో ఈదుకుంటూ అందరికీ దూరంగా వేరే ఒడ్డుకు చేరుకుని స్థిర పడాల్సి వచ్చింది.
సుజది ఇతరులకు చేతనైనంత సహాయం చేసే గుణం. ఇంటికి వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించి, మంచి భోజనం పెట్టేది. ఇక ఆవిడ భర్త హరి గారి గురించి చెప్పక్కర్లేదు.
భార్య నోట్లోంచి మాట వచ్చినది తడవుగా ఓ సంచీ చేతపట్టుకుని భార్య చెప్పినట్లు బంధువులకు ఇష్టమైన కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చేవారు. వీరికి ముగ్గురు పిల్లలు.
వీరు తల్లిదండ్రులుగా ప్రత్యేకించి పిల్లలకు జీవితం నైపుణ్యాలను ఏమి నేర్పలేదు. వీరు కూడా, ‘ యథా రాజా: తథా ప్రజా ‘ అన్న చందంగా అచ్చుపోసిన విగ్రహాలే.
నిరాడంబరతకు నిలువుటద్దం హరి గారు. ఆయన సొంత వాళ్ళ కూడా ఎన్నోసార్లు ఆయన్ని హేళన చేశారు. ‘ నువ్వు ఇలా ఉంటే ఎదుగలేవు ‘ అని..
వారిది చెవిటి వాని ముందు శంఖం మాదిరిగానే ఉండేది. ఈయన అవేమీ పట్టించుకునే వారు కాదు. ఆయన తోటి వారందరూ చింతపండు చారు త్రాగి బంగ్లాలు కట్టారు. కానీ ఆయనది తుది శ్వాస వరకు అదే నిరాడంబరత. అదే చిరునవ్వు.
జీవితంలో ఆయన ఏదీ సమకూర్చు కోలేదు. అలా అని ఏమీ కోల్పోలేదు కూడా.
చివరి రోజుల్లో ఆయన చేతి కర్ర తో నడిచే వారు. వాళ్ళ పెద్దబ్బాయి ఇంటికి క్రమం తప్పకుండా రోజూ వెళ్లేవారు. కానీ మెట్లు ఎక్కి పైకి వస్తున్నప్పుడు, చేతికర్రని మాత్రం కింద గేటు దగ్గర పెట్టే వారు. ఇది ఆయన దినచర్య. ఈ చేతి కర్ర చివర్లో చాలా ప్రత్యేకతని సంతరించుకుంది.
*******
సుజ గారు చాలా హుందా మనిషి. సున్నిత మనస్కులు. ఈవిడకి తన పిల్లలే ప్రాణం. దంపతులిద్దరికీ తలకుమించిన ఎన్నో భారాలను ఆ పిల్లలు తమవై మోశారు.
ఆవిడకి పిల్లలు అంటే గౌరవంతో కూడిన ప్రేమ. ఆవిడ తన చివరి రోజుల్లో ఓపిక తెచ్చుకుని బంధువులతో ఒక విహార యాత్రకు వెళ్ళింది.
అంటే ఎక్కడికో కాదండి, ఒక ప్రముఖ పుణ్య క్షేత్రానికి. చివర్లో ఆవిడ చేసిన ఈ యాత్ర కీ ఓ ప్రత్యేకత ఉంది.
********
హరి గారు చేతికర్రను కింద పెట్టేసి పైకి పెద్ద అబ్బాయి దగ్గరికి వచ్చారు కాసేపటి తర్వాత అబ్బాయి సహాయంతో కిందికి దిగారు. కింద ఆయన చేతి కర్ర మాయం. ఇద్దరూ వెదికారు. అటు ఇటు చూశారు.
ఎవరో, నీటి సంపు మూత ని కొంచెం పైకి లేపి ఉంచడానికి ఆ కర్ర ఆ మూత కిందగా అమర్చారు. ‘ఎవరు పెట్టారు నా కర్ర ని ఇక్కడ?’ అంటూ ఉద్రేకంతో ఆయన ఊగి పోయారు.
ఎప్పుడు జీవితంలో ఆయన పడని ఉద్రేకం ఆరోజు పడ్డారు.’ నా కర్రని అక్కడ ఎవరు పెట్టారు?’, అని శివతాండవం చేశారు. ఆ తర్వాత కాలం చేశారు.
ఇక సుజాత గారు యాత్ర నుంచి వచ్చిన తర్వాత తన లో తన విపరీతంగా కుమిలిపోతున్నారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? ఎవరికీ అర్థం కాలేదు.
ఆవిడ పెద్దబ్బాయి కొంచెం గట్టిగా అడిగాడు, ‘ ఏమైంది చెప్పు’ అని. ‘నన్ను బంధువు ఒకరు వెటకారం చేశారు’, అని చెప్పింది. ‘ ఎవరు?’ అనడిగాడు, ఆవిడ పెద్దబ్బాయి. కానీ ఆవిడ నోరు విప్పలేదు.
‘పోనీ, ఏమన్నారు చెప్పు’ అని అడిగాడు. అప్పుడు చెప్పింది ఇలా, ” నీకు మనవళ్ళు మనవరాళ్ళు పుట్టారు, కానీ నీ బిడ్డలు స్థిరపడలేదు. వారు వృద్ధిలోకి రావాలనని దేవుడికి దండం పెట్టుకో ” అని ఎవరో వెక్కిరించారు అని చెప్పింది. తర్వాత ఆవిడ స్వర్గస్తులైనారు.
*********
ఈ ఇద్దరు భార్యాభర్తలు శ్వాసించారండి. శ్వాస విలువ ఏంటో ఇద్దరికీ బాగా తెలుసు. కలుషితం లేని ప్రాణవాయువును వీరు శ్వాసించారు. వీరు తుదిశ్వాస విడిచే వరకు నాసికం తోనే శ్వాసించారు. అనవసరమైన ఆర్భాటాలకు పోయి నోటి ద్వారా శ్వాసించే దుర్గతిని వీరు తెచ్చుకోలేదు.
– వాసు