ప్రయాణంలో భయరస
అవి 2017 సంవత్సరం రోజులు, నేను ఏడో తరగతి లో ఉన్నాను. అక్టోబర్ నెలలో ఒక ఆదివారం రోజు సాయంత్రం టీవీ లో గంగ సినిమా చూస్తూ ఉన్నా సినిమా చాలా భయంకరంగా ఉంది. ముని, కాంచన తర్వాత గంగ… కామేడి ఉంటుంది కదా అని సరదాగా చూస్తున్నా కానీ నాకు చాలా భయం వేస్తుంది.
అయినా కూడా నేను ఆ సినిమాను చూస్తూనే ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది కరెక్ట్ గా అప్పుడే సడన్గా కరెంటు పోయింది. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే అప్పటివరకు చూసి దెయ్యం సినిమా కదా, నిజంగానే ఇంట్లో ఉందేమో అన్నంత భయం వేసింది.
ఇక భయం లో నేను ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను పిలిచారు ఎందుకో అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. నాన్న నాతో నువ్వు ఇప్పటి వరకు గంగ సినిమా చూసావు కదా అది కేవలం సినిమా మాత్రమే రెండు రోజుల్లో నీకు నిజంగా అలా ఉన్న వాళ్ళని చూపించబోతున్న అనే బాంబు పేల్చారు.
వామ్మో ఇలాంటి వాళ్లు నిజంగా కూడా ఉన్నారా? నేను చూడబోతున్నానా? నిజంగా ఇలాంటి వాళ్ళు ఈరోజుల్లో ఉంటారా ఇలా ఎన్నో రకాల అనుమానాలు కలిగాయి దయ్యాలు నిజంగా చూపించడం ఏంట్రా బాబు ఆయనకు అసలు దయ్యాల గురించి తెలియదు భయపెట్టడానికి ఇలా అంటున్నారు.
వామ్మో నాపై ఏదో కుట్ర జరుగుతుంది. ఈయన అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేసినట్టు కరెంటు పోతే ……. పోసుకునే నేను ఇప్పుడు దయ్యాలని ఎలా చూడాలి? ఏమోలే ఏదో సరదాగా అన్నారేమో అనుకున్న నేను రాను అని అనాలనుకున్న కానీ నేను మా నాన్న గారిని అనలేక పోయాను.
ఎందుకంటే నన్ను పిరికివాడు అని అనుకుంటారేమో అని భయం వల్ల కావచ్చు, నా తమ్ముడు నన్ను చూసి నవ్వుతాడెమో అని చిన్న అనుమానంతో ఏమీ అడగలేక పోయాను.
కానీ నాకు ఆ భయం అలాగే ఉండిపోయింది. ఇక మరుసటి రోజు మా నాన్నగారు ఒక కారు బుక్ చేశారు అక్కడికి వెళ్లడానికి. అక్కడికి వెళ్లడానికి మా అమ్మమ్మ వాళ్లు కూడా వచ్చారు.
ఇక ఆ కార్లో నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, మామయ్య, అమ్మమ్మ, డ్రైవర్ అంతా కలిసి బయలుదేరాము. అక్కడికి వెళ్లేసరికి 2:00 అయింది. అక్కడ అంతా అలిసిపోయాము కాబట్టి ఒక హోటల్ గది తీసుకొని అందరం నిద్రపోయాం.
ఇక మరుసటి రోజు అమ్మ నన్ను ఆరు గంటలకే నిద్ర లేపింది. బ్రష్ చేసి నదికి వెళ్లి స్నానాలు చేశాం. అక్కడ కూడా ఎవరో పూజారులు దయ్యలని వదిలిస్తున్నారు. అలా అని వాళ్ళు మoత్రగాళ్ళూ కాదు. దేవుడి సన్నిధిలో వదిలిస్తున్నారు.
అచ్చం సినిమాల్లో చూపించినట్టుగానే అక్కడ దయ్యాన్ని వదిలిస్తుంటే, వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తున్నాయి… తర్వాత దర్శనానికి వెళ్ళాం కాకపోతే అక్కడ లేట్ అవుతుంది అని అనడంతో టిఫిన్ చేసి అందరం అక్కడికి వెళ్లి కూర్చున్నాం. 10 గంటలకు దర్శనం అయిపోయింది.
ఇక నేను దర్శనం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతాము అని అనుకున్నా, కానీ మా నాన్నగారు నన్ను పిలిచి ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది చూడు అని చెప్పారు. అప్పుడు నాకు గుర్తు వచ్చింది అంతకు రెండు రోజుల ముందు మా నాన్నగారు నాతో చెప్పిన విషయం.
అప్పుడే మా అమ్మమ్మ ఒక వాటర్ బాటిల్ తీసుకురమ్మని నాకు డబ్బులు ఇచ్చింది. దొరికిందే ఛాన్స్ అనుకుంటూ నేను బయటకి పరిగెత్తాను. కానీ మళ్లీ బాటిల్ తీసుకొని అక్కడికి వెళ్లాలి కదా, వెళ్లకుండా ఎంతసేపు బయటే ఉండాలి?
పైగా అక్కడ చాలా కుక్కలు కూడా ఉన్నాయి. నాకు కుక్కలంటే చాలా భయం. దాంతో నేను ఎక్కువ సేపు అక్కడ ఉండలేకపోయాను. వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ భయపడుతూనే అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాను.
అది ఏంటో చూద్దామని అనుకున్నాను కానీ నా మనసులో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిగ్గా 12:20 కి మొదలయ్యింది ఒక మంత్రం… “దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా” అనే మంత్రం.. నేను కూడా ఒక రెండు సార్లు విని, నేను ఆ మంత్రం చెప్పడం స్టార్ట్ చేశాను.
ఆ మంత్రం తో పాటు అందరూ చప్పట్లు కొడుతున్నారు.. పోయేదేముంది అని నేను కూడా కొట్టడం స్టార్ట్ చేశా… కాని మెల్లిగా ఎదో అరుపు వినిపించింది. అది విన్న వాళ్ళు భయపడకుండా అలాగే కొడుతూ ఉన్నారు. ఆ ఒక్క అరుపు కాస్తా ఎక్కువై వేరే అరుపులు వినిపిస్తున్నాయి.
అప్పుడే ఎవో డ్రమ్స్ స్టార్ట్ అయ్యాయి. డ్రమ్స్ ఒక్కసారిగా వినిపించగానే నా గుండెల్లో గుబులు బయలుదేరింది. ఏంటని చుట్టూ చూసాను కాని ఏమి కనిపించలేదు. అమ్మ నన్ను చూసిందో ఏమో దగ్గరకి వచ్చి వెనకాల చూపించింది.
అప్పుడు అర్ధం అయ్యింది వెనకాల డ్రమ్స్ కొడుతున్నారు అని. అక్కడినుంచి పారిపోదాం అనుకున్నాను . మెల్లి మెల్లిగా డ్రమ్స్ వేగం పెరుగుతుంది ఆ పెరుగుతున్న డ్రమ్స్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళ చేతులు చప్పట్లతో మారుమోగిపోతున్నాయి.
నేను అమ్మ పక్కనే కూర్చున్నాను. ఇంతలో ఒక్కసారిగా జనాలలో ఉన్న అమ్మాయిలు లేచి ఊగడం మొదలుపెట్టారు. నేను వెంటనే అమ్మ వెనక్కి వెళ్ళాను. అమ్మ వెనకాల నుంచి మెల్లిగా వాళ్ళని చూస్తున్నాను. వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియడం లేదు.
ఒకరు కింద ఉన్నారు. ఒకరు గాల్లో తేలుతున్నారు. మరొకరు అక్కడున్న ఇనుప స్తంభాలకు వేలాడుతున్నారు. ఇంకొకరేమో అక్కడే ఊగుతూ, “వస్తున్నా… వస్తున్నా…” అని అంటున్నారు… అది చూసి నా గుండె ఒక్కసారిగా జారినట్లు కింద పడ్డట్టు అయింది.
అది చూడలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నా. పక్కనే ఉన్న మా అమ్మ కళ్ళు తెరిచి చూడు చూడు అంటూ నన్ను తట్టింది బలవంతంగా కళ్ళు తెరిచాను. నా పక్కనే ఉన్న వాళ్లంతా భజనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఊగుతూనే ఉన్నారు.
నా పక్కన కూర్చున్న వాళ్లు చేస్తూ. చేస్తూ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఊగడం మొదలుపెట్టారు. అంతవరకు నా పక్కనే కూర్చున్న వ్యక్తి అలా సడన్ గా చేయడంతో నాకేం చెయ్యాలో పాలు పోలేదు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అతను మగ ఆయన… కొద్ది సేపటి క్రితమే అతన్ని గుడి బయట చూసాను. అలాగే నాకు స్వీట్ కూడా ఇచ్చారు. అప్పటిదాకా బానే ఉన్నారు కదా. ఎందుకు ఇలా చేస్తున్నారని అనుమానం తో ఇంకా వణికిపోయాను.
ఆ డ్రమ్స్ ఇంకా కొడుతూనే ఉన్నారు అది పతాక స్థాయికి చేరడంతో అక్కడ ఉన్న జనాలలో ముప్పావు భాగం జనాలు ఊగుతూనే ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళ పెద్ద జడను విప్పుతూ కొని స్తంభాలు ఎక్కుతూ తలకిందులుగా వేలాడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే నాకు…… పడినట్టు అయ్యింది.
మా అమ్మ వెనకాల నక్కి నక్కి కూర్చున్నాను. ఇంతలో మా మామయ్య నన్ను తీసుకొని మేమిద్దరం కొంచెం దూరం వెళ్తున్న సమయంలో అక్కడ ఒక ఆవిడని మామయ్య నాకు చూపించారు.
ఆమె ఒక కాలు మడిచి ఒక కాలు పైకి జాపి గాల్లో తేలుతూ వెళుతుంది. అది చూసి నేను మా మామయ్య ని గట్టిగా పట్టుకున్నాను.
ఆ దృశ్యం ఎలా ఉందంటే సినిమాల్లో తాడు కట్టి లాగినట్టు ఎవరో తనని లాక్కొని వెళ్తున్నట్టు ఉంది మా మావయ్య కూడా భయపడుతున్నాడు అనే సంగతి నాకు తర్వాత అర్థమైంది.
ఇద్దరం ఒకే గూటి పక్షులం అని తెలిసి కాస్త నెమ్మదించినా. అదంతా అయ్యేసరికి మూడు గంటలు పట్టింది. ఆ తర్వాత మేము ఒక చోటికి వెళ్లి భోజనం చేశాం.
పక్కనే ఉన్న మరో గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నాం. అక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఈ చుట్టు పక్క ఊర్లలో పూజ చేసాక గంట అస్సలు కొట్టరంట. కొడితే దయ్యం లేచి వస్తుందంట. ఆ మరుసటి రోజు మళ్ళీ మామూలు దర్శనం చేసుకుని రాత్రి వరకు ఇంటికి చేరుకున్నాం.
ఇక రాత్రి మొదలైంది నా బాధ. అందరం అన్నాలు తినేసి పడుకున్న తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు ఒక పెద్ద శివుని ఆలయం కనిపించింది. అది మేము దారుల్లో వస్తూ చూసిన ఆలయమే. అది గుడికి కొంచం దూరంగా ఉన్న గుడి. అక్కడ గంటలు ఉన్నాయి.
అయితే నేను వెళ్లి అక్కడ ఉన్న పెద్ద గంటని కొట్టాను. నేను గంట కొట్టడం వల్ల ఎవరో ఒకరికి, అంటే ఆ గుడి దగ్గర ఉన్న వారికి అలా మొదలైంది. ఆ తర్వాత నేను సున్నం డబ్బా కోసం పరిగెత్తుతున్నాను.
అది చూసి మావాళ్ళు, నాకు కూడా దయ్యం పట్టిందేమో అని అనుకున్నారు, అన్నట్టు కల వచ్చింది. కానీ నాకు అలా అవ్వలేదు .అని ఎంత చెప్తున్నా మా వాళ్ళు వినట్లేదు…
అవే సంఘటనలు పదే పదే గుర్తుకు రాసాగాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఒళ్ళంతా వేడెక్కింది.నిండా చద్దర్ కప్పుకున్న నాకు చెమటలు పట్టడం తో కాస్త గాలి పీల్చుకుందామని కప్పు తీశాను. వెంటనే నా కళ్ళకు ఒక ఆకారం కనిపించింది.
అది చూసి ఇంకా భయపడి నేను పక్కకి తిరిగి చూసేసరికి మా అమ్మమ్మ నన్నే చూస్తుంది. నేను వెంటనే నిండా కప్పు కప్పేసుకుని కళ్ళు మూసుకుని అలా పడుకుండిపోయాను.
ఆ తర్వాత పొద్దున్న లేచి చూస్తె ఆ ఆకారం మా మామయ్యా హ్యాంగర్ కి తగిలించిన ప్యాంట్ అని తెలిసింది. నిజం చెప్పాలంటే ఆ జీన్స్ అచ్చం దయ్యం లాగే ఉంది. వెంట్రుకలు విరబోసుకొని ఉన్నట్టు అనిపించింది.
ఇక పొద్దున లేచిన తర్వాత బ్రష్ చేస్తుంటే నాకు వాంటింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత మోషన్స్ కూడా అయ్యాయి. ఒళ్ళంతా వేడెక్కింది ఏదేదో జరిగింది. మొత్తానికి నాకు జ్వరం వచ్చింది. మా అమ్మ భయపడి వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది డాక్టర్ అది బుగులు జ్వరం అన్నారు.
అంటే భయం వల్ల వచ్చిన జ్వరం. ఆ జ్వరం తో మూడు రోజులు పడుకున్నాను. అయితే ఇలా దయ్యం పట్టిన వాళ్ళు ఊగుతారని, ఇలాంటివి ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదు ఇవన్నీ నేను కేవలం సినిమాల్లో చూడడమే సినిమాలు చూస్తేనే భయపడే మనం ఇలా నిజంగా చూడడంతో తట్టుకోగలమా..
ఇదండీ నా భయరస ప్రయాణ అనుభవం. ఇంతకీ ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారు. గానుగాపూర్ దత్తాత్రేయుని గుడిలో అక్కడ దెయ్యాలు పట్టిన వాళ్లని తీసుకొచ్చి వాళ్లకి దెయ్యం వదిలేస్తూ ఉంటారు.
ప్రతిరోజు 12:20 కి మొదలై మూడు గంటల వరకు సాగుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళు అక్కడే ఉండి బాగా అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారట.
మా నాన్నగారు మళ్లీ నన్ను దగ్గరికి పిలిచి ఎలా ఉంది బాగా ఉందా, సినిమాల్లో చూపించినట్లు ఉందా అంటూ అడిగారు. తర్వాత నన్ను దగ్గరికి తీసుకుని సినిమాలు చూసి భయపడటం కాదు. ఇలాంటివి కూడా చూడాలి.
అప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలవు అంటూ చెప్పారు. కళ్ళతో చూసిన నిజాన్ని నేను తట్టుకోగలనా లేదా అని పరీక్షించారు.
అప్పుడు మా నాన్న ఒక విషయం చెప్పారు, వేరే వాళ్ళని చూసిన నీకే ఇంత భయమేస్తే, మీ అత్త కొడుక్కి అదే గురు బావకి నిజంగా పట్టింది.
నేనే మీకు చెప్పకుండా తీసుకెళ్ళి వదిలించా అని ఇంకో బాంబు పేల్చారు. షాక్ అవ్వడం తప్ప నేనేమి చెయ్యలేక పోయాను.
– ప్రణవ్