యోధ ఎపిసోడ్ 5

యోధ ఎపిసోడ్ 5

తెల్లారి మంగళవారం. పొద్దుకూగింది, అప్పటికే దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది. అప్పుడే నిద్ర లేచిన ప్రియ… మూసిన కళ్ళు తెరవకుండానే, అదే బెడ్ పై నుండి

“లక్ష్మి కాఫీ… లక్ష్మి కాఫీ…” అంటూ పెద్దగా అరుస్తుంది.

ఆ అరుపులకి లక్ష్మి నుంచి ఏ స్పందనా రాలేదు. కానీ, ఆ అరుపులకి ఉలిక్కి పడి లేచిన పార్ధు, విశాల్ వాళ్ల వాళ్ళ గదుల నుండి తలుపులు తీసుకుంటూ బయటకి వచ్చి చూసారు.

ఇంకా ప్రియ

“లక్ష్మి కాఫీ… లక్ష్మి కాఫీ…”

అంటూ అలా అరుస్తూనే ఉంది. ఆ శబ్ధం వస్తున్న గది వైపు చూసిన వాళ్ళిద్దరూ (పార్ధు, విశాల్) ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ శబ్ధం వస్తుంది అవేశ్ కి కేటాయించిన గది నుండి.. వాయిస్ మాత్రం ప్రియ ది.

తను అంతగా అరుస్తున్నా, లక్ష్మి నుండి అసలు ఉలుకు పలుకు లేదు. పైన ఆ కారిడార్ నుండి కిందనున్న వీరయ్య- లక్ష్మి ల గది వైపుకు చూస్తున్న వాళ్ళిద్దరికీ (పార్ధు, విశాల్) వాళ్లిద్దరూ (వీరయ్య, లక్ష్మి) అసలు కనిపించడం లేదు. పైగా ఆ గది తలుపులు కూడా ఇంకా మూసే ఉన్నాయి.

ఒక పక్క ఇవేం పట్టని ప్రియ మాత్రం.. ఇంకా అలానే లక్ష్మిని పిలుస్తూ కాఫీ కోసం అరుస్తూనే ఉంది. దీంతో ఆ గది వైపుగా వెళ్తున్న పార్ధుతో విశాల్ కూడా తోడయ్యి… ఆ రూం డోర్ తట్టడానికి ప్రయత్నిస్తుంటే, అప్పటికే లాక్ చేసి లేని ఆ డోర్ కాస్తా, మెల్లగా తెరుచుకుంది.

బెడ్ పై ప్రియ (ఇంకా దుప్పట్టి ముసుగు కూడా తీయలేదు)

“కాఫీ… కాఫీ… కాఫీ…” అని అరుస్తూనే ఉంది.

దగ్గరకి వెళ్ళిన పార్ధు… ప్రియని తడుతూ.. తనపై ఉన్న ముసుగు తీసాడు. సరిగ్గా అప్పుడు కళ్ళు తెరిచిన ప్రియ.. తన చుట్టూ ఉన్న పార్ధు, విశాల్ నీ చూస్తూ…

“మీరొచ్చారేంటి..! లక్ష్మి ఏమైంది ? నాకు కాఫీ కావాలి.” అంటూ నిద్ర మత్తులోనున్న ప్రియ పార్ధు వంక చూసి అడుగుతూ…

మళ్ళీ బెడ్ పై పడుకోబోతుంటే..

“నీ కాఫీ సంగతి తర్వాత… అసలు నువ్విక్కడున్నావేంటి..?” అంటూ ప్రియని ప్రశ్నిస్తాడు విశాల్ కొంచెం ఆశ్చర్యవంతమైన మొహ కవలికలతో… దాంతో,

“రాత్రి ఏమైనా తాగావా..? పార్ధు.. ఆ హ్యాంగోవర్ వీడికింకా దిగినట్టు లేదు రా..?”

అంటూ పార్ధు వైపుగా చూస్తూ ప్రియ అంటుంటే,

“ఏంటి వెటకారంగా ఉందా నీకు..?” అంటూ విశాల్ కోపంగా ప్రియని కసురుకున్నాడు.

“వెటకారం నాది కాదు… నీది!, పొద్దు పొద్దునే నీ వేళాకోలాలకి కి టైం అయ్యిందా..? నా గదిలో నేను కాకపోతే, మరి ఇంకెవరుంటారు..?” అంటూ ప్రియ కూడా కొంచెం సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది, విశాల్ అన్న మాటలకు.

“అవును ప్రియ.. విశాల్ చెప్తుంది నిజం! ఇది అవేశ్ రూం.. నువ్విక్కడున్నావ్ ఏంటి..? అంటూ మధ్యలో కలగజేసుకున్నాడు పార్ధు.

“వీడితో పాటు నువ్వుకూడా ఏంటి పార్ధు, పొద్దున్నే ఆటపట్టించడానికి మీకు నేనే దొరికానా..? ఇది అవేశ్ రూం అయితే, మరి అవేశ్ ఎక్కడ ..? ఏడి ఎక్కడా కనిపించడే..? అవేశ్.. అవేశ్…” అంటూ చుట్టూ చూస్తూ అరుస్తూ,

పార్ధు వంక చూస్తూ “ఏడి ఎక్కడా..?” అంటూ పార్ధుని ప్రశ్నిస్తుంది ప్రియ.

“అయ్యో ..! ప్రియా… మేం చెప్పేది, నీకర్ధమవుతుందా ..! ఇది నీ రూం కాదు, అవేశ్ రూమే..! మేము కూడా అదే అడుగుతున్నాం..? అవేశ్ రూం లో నువ్వెందుకున్నావ్, మరి అవేశ్ ఎక్కడ..?” అంటూ తన స్వరం కొంచెం పెద్దది చేసి, గట్టిగా ప్రియని నిలదీస్తాడు పార్ధు.

ప్రియ, అవేశ్ నైట్ ఇంటిమేటయ్యి ఉంటారని, ఇలా సడెన్ గా తాము వచ్చేసరికి, ప్రియ జాగ్రత్త పడడానికి ఇలా నాటకమాడుతుందని భావించిన పార్ధు… ఆ గదంతా అవేశ్ కోసం వెతుకుతాడు. తనతో పాటే, విశాల్ కూడా… కానీ, వారికి అవేశ్ ఎక్కడా కనిపించలేదు.

ఇంతలో తేరుకున్న ప్రియ.. బయట గుమ్మం దగ్గర తన రూం కి, అవేశ్ రూంకి తేడా గుర్తించి, తన తప్పు తెలుసుకుని,

“మీరు చెప్తున్నది నిజమా…? మరి ఈ గదిలోకి నేనెలా వచ్చాను..? అంటూ వాళ్లిద్దరి వంక చూస్తూ అమాయకంగా వాళ్ళని అడుగుతుంది.

పార్ధు కొంచెం సీరియస్ గా ఆ గది నుండి బయటకి వచ్చేస్తాడు.

“ఏమో అది నీకే తెలియాలి.. నైట్ అంతా మీరేమేం చేశారో..? సారీ..మీరేం చేసుకున్నారో..?” అంటూ విశాల్ కూడా ప్రియ అడిగిన దానికి సమాధానమిస్తూ అక్కడి నుండి వచ్చేశాడు.

పిచ్చి పిచ్చి గా వాగకు విశాల్ అంటూ ప్రియ కూడా.. పార్ధు, విశాల్ వెనుకే ఆ గదిలో నుండి బయటకి వచ్చేస్తుంది.

“అబ్బబ్బా.. పొద్దు పొద్దున్నే … ఏంటే మీ గోల ..!” అంటూ తన గదిలో నుండి బయటకి వస్తుంది గౌతమి.

తన మాటలేమీ పట్టించుకోకుండా పార్ధు, ప్రియ రూం వైపు వెళ్తాడు.

విశాల్, ప్రియ కూడా… అలానే గౌతమిని పట్టించుకోకుండా పార్ధుని వెంబడిస్తారు… అలా తనకి కనీసం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్న వాళ్ళని చూస్తున్న గౌతమి తో పాటు, మరొకపక్క అప్పటికే ఇదంతా గమనిస్తున్న గోపాల్ మరియు కృతి కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యి… అసలేం జరిగిందో తీసుకుందామని, వాళ్ళు కూడా ప్రియ రూం వైపు ఒకేసారిగ వెళ్తారు.

ప్రియ రూం డోర్ కూడా లాక్ చేసి లేదు. పార్ధు ఆ డోర్ ని కొంచెం తట్టగానే ఆ రూం డోర్ మెల్లగా తెరుచుకుంది. లోపలికి వెళ్ళిన పార్థుకీ, అక్కడ కూడా అవేశ్ కనిపించలేదు. ఆ బెడ్ కాళిగా ఉంది. ఆ రూం అంతా పార్ధు, విశాల్, ప్రియ …

“అవేశ్… అవేశ్…” అంటూ పిలుస్తూ అతన్ని వెతుకుతున్నారు. కానీ, లాభం లేదు. ఒక చిన్న ప్రతి స్పందన కూడా వాళ్ళకి తిరిగి రాలేదు.

ఈ లోపు..

“అసలేం జరిగిందంటూ…?” వాళ్ళని నిలదీస్తాడు గోపాల్ దాంతో అప్పటివరకూ జరిగింది చెప్తాడు విశాల్ వాళ్ళకి.

“ఎక్కడా లేకపోతే, అవేశ్ ఏమైనట్టు అలా మార్నింగ్ ఎక్కడికైనా బయటకి, జాగింగ్ కి ఏమైనా వెళ్లాడేమో..? ఎందుకంత కంగారు..?” అంటుంది కృతి.

“లేదు.. తనకసలు పొద్దున్నే జాగింగ్ చేసే అలవాటు లేదు. పైగా చుట్టూ అడివి, ఎటు చూసినా చెట్లు చేమలు. దారి మర్చిపోతే మళ్ళీ గుర్తుపట్టడం కూడా కష్టం ఇలాంటి చోట. పైగా అవేశ్ అలాంటి సాహసాలు చెయ్యడు. అసలే చాలా భయస్తుడు.” అంటూ బదులిస్తాడు పార్ధు.

దానికి ప్రియ కూడా అవును అన్నట్టుగానే తలాడిస్తుంది.

“ఇంతకీ, అసలు ఈ వీరయ్య… ఇంకా ఈ లక్ష్మి… ఏమైనట్టు?” అంటూ వాళ్ల గురించి అడుగుతాడు గోపాల్.

“వాళ్ళని రూంని కూడా చూసాము. వాల్లింకా నిద్ర లేచినట్టు లేరు. వాళ్ల రూం డోర్ కూడా మూసే ఉంది.” అంటూ బదులిస్తాడు విశాల్.

“ఇక్కడింత జరుగుతుంటే, వాళ్ళింకా నిద్ర లేకపోవడం ఏంటి..?

పదండి, ఒక వేళ నైట్ ఏమైనా ఈ అవేశ్ వాళ్ళతో పాటు అక్కడ రూం లో పడుకున్నాడేమో?” అంటూ తనకున్న సందేహంతో అక్కడి నుండి అందరినీ తీసుకెళ్తుంది గౌతమి.

అలా అవేశ్….., వీరయ్య….., లక్ష్మి….., అంటూ ఒక్కొక్కరిని ఒక్కరుగా (పార్ధు, గోపాల్, గౌతమి, విశాల్, కృతి, ప్రియ) వాళ్ళని పిలుచుకుంటూ అందరూ కిందనున్న వీరయ్య, లక్ష్మి ల రూం వైపు వెళ్తారు. వాళ్ల రూం డోర్ గోపాల్ తడుతుంటే, అది కూడా ఇంతకముందు రూం డోర్స్ లాగానే మెల్లగా తెరుచుకుంటుంది. అంటే అది కూడా క్లోజ్ చేసి లేదన్నమాట!

లోపలికి వెళ్ళిన వాళ్ళకి అక్కడ కూడా ఎవరూ కనిపించరు. ఆ రూం, వీళ్ళ గదులంత విశాలమైనది కాకపోయినా, వాళ్ల గదితో పాటు, కిందనున్న హల్, డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్, స్టోర్ రూం అంతా వెతుకుతారు. కానీ, ఎక్కడా వాళ్ల ముగ్గురి జాడ కనిపించదు. అలా చాలా సేపు వెతికి వెతికి అలసిపోయిన వాళ్ళతో..

“బయటకేమైనా వెళ్ళారేమో..? ఒకసారి బయటకి వెళ్లి చూద్దాం..!” అంటూ కృతి బయటకి వెళ్లబోతుంటే తనతో పాటే బయటకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు వారంతా కూడా… మూసున్న ఆ ముఖ ద్వారాపు గుమ్మపు తలుపును కృతి తీయడానికి ప్రయత్నిస్తుంటే, అవి ఎంతకీ రావడం లేదు. తన బలం సరిపోక, అవి రావడం లేదనుకుని, గోపాల్ కూడా ట్రై చేసాడు. అయినా అవి తెరుచుకోలేదు.

దాంతో తనకి పార్ధు.. విశాల్… కూడా తోడయ్యారు అయినా అవి ఎంతకీ తెరుచుకోలేదు. గౌతమి, ప్రియ, కృతి కూడా వాళ్లకి తొడయ్యి, తమ శక్తినంతా కూడగట్టి దానిని తెరిచే ప్రయత్నం చేశారు. అయినా అది ఎంతకీ తెరుచుకోలేదు. ఏదో బయట గడియ పెట్టినంత బలంగా ఆ డోర్స్ క్లోజ్ చేసున్నాయి. ఆ చుట్టూ ఉన్న కిటికీలు కూడా గట్టిగా మూసే ఉన్నాయి. పైనున్న బాల్కనీల నుండి తప్పించుకుందాం అంటే అవి కూడా చాలా ఎత్తులో ఉన్నాయి.

చేసేదేమీ లేక, చుట్టూ అంతా చూసారు. బయటకి వెళ్ళడానికి అదొక్కటే మార్గం. దానిని విడిపించే ఎలాంటి ఆయుధాలు కూడా కంటికి కనిపించలేదు. మరెలాంటి మార్గాలు వాళ్ళకి దొరకలేదు. అలా ప్రయత్నించి.. ప్రయతించి… చివరికి తమ శక్తినంతా కోల్పోయి, బలహీనమై అక్కడే హాల్లో ఉన్న సోఫాలో చతికిలపడ్డారు వాళ్లంతా. మరొకపక్క భయంతో తల్లడిల్లిపోతున్నారు.

“అసలేం జరుగుతోంది..? ఏంటి ఇదంతా …?” అంటూ గౌతమి తనలో ఉన్న భయాన్ని బయట పెడుతుంది.

“ఇదంతా విక్కి ఆడుతున్న నాటకమేమో..? వాళ్ళ (లక్ష్మి, వీరయ్య) తో బయట డోర్ క్లోజ్ చేయించి, మనల్ని భయపెట్టీ, ఎలాగోలా ఇక్కడి నుండి బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నాడేమో? అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాడు గోపాల్.

“లేదు .. ఈ సారి అలా అనుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు. వాళ్లిద్దరూ (లక్ష్మి, వీరయ్య) మాత్రమే కనిపించకుండ మనతో ఇలా ఆడుకుంటున్నారనుకుంటే, నువ్వు చెప్పింది నిజమనుకోవచ్చు? కానీ, మరి అవేశ్ సంగతేంటి! తను వాళ్ళతో కలిసి ఇలాంటివి చెయ్యడు కదా!” అంటూ విశాల్ అభిప్రాయానికి అడ్డు తగులుతాడు.

ఈలోపే, పక్కనున్న స్మశానం నుండి నక్కల అరుపులు చాలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వినిపిస్తున్నాయి. అప్పటికే, భయం గుప్పిట్లోనున్న వారంతా పైకి పరుగు పరుగున వెళ్ళి, వాళ్ల రూమ్స్ వెనుక వైపు నున్న బాల్కనీ నుండి ఆ స్మశానంలోకి చూసారు. అక్కడ కాలుతున్న ఓ శవం, ఆ కాలుతున్న చితి నుండి పైకి వెళ్తున్న పొగ (ఆ శవాన్ని విడిచి ఆత్మ పైకి పోతున్నట్టు) ను చూస్తూ ఆ నక్కలు పైకి తల్లెత్తి గట్టిగా అరుస్తున్నాయి.

మార్నింగ్ నుండి అవేశ్ నీ, లక్ష్మి, వీరయ్య లను వెతకడం లో బిజీగా ఉన్నా వాళ్లంతా… ఆ స్మశానంలో కాలుతున్న శవాన్ని అప్పటివరకూ పెద్దగా పట్టించుకోలేదు. అంతకముందు, వీరయ్య చెప్పినట్టు అది అనాధ శవం లాగానో, లేక ఎవరో అక్కడికి వచ్చి దాన్ని తగులబెడుతున్నట్టు లాంటి సూచనలేవి వాళ్ళకి ఆ చుట్టు పక్కల కనిపించడం లేదు కూడా.

ఆ క్షణం వాళ్ళలో మరింత భయం పెరిగింది. మరొకవైపు, వాళ్ల రూం డోర్స్ ఒక్కటే కొట్టుకుంటున్నాయి. అలా ఎందుకు కొట్టుకుంటున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకంటే, బయట నుండి గట్టిగా గాలి కూడా పెద్దగా వీయడం లేదు. దానికి కారణం ఏంటోనని, బాల్కనీ నుండి వస్తుంటే వాళ్ళకి ముందు ఎదురయ్యే పార్ధు రూం లోకి వెళ్ళారు. అక్కడ అంతా రకరకాల వెరైటీలతో మంచి విందు భోజనం ఏర్పాటు చేసి ఉంది వాళ్ల కోసమే, అది ఎవరో తెచ్చి పెట్టినట్టుగా…

అది చూసి, పార్ధు మరియు వాళ్ల స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. అలా అవన్నీ వాళ్ళకి ఎవరు తెచ్చి పెట్టారో అర్థం కావడం లేదు. అప్పటికే హల్లోనున్న గోడ గడియారం కూడా సరిగ్గా అదే టైం కి మధ్యాహ్నం ఒంటగంట అయినట్టు గంట కొట్టింది. ఆ గంట కూడా సరిగ్గా అప్పుడే మ్రోగింది. అప్పటివరకూ అది ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది.

వాళ్లు కూడా అసలు అనుకోలేదు, అప్పటికే అంత టైం అయ్యిందని. అసలు అది పనిచేస్తుందని. వాళ్ల చుట్టూ జరుగుతున్నది చూస్తూ వాళ్ల భయబ్రాంతులకు లోనవుతున్నారు. మిగిలిన రూం డోర్స్ కూడా అలాగే డబా.. డబా.. మంటూ ఒకటే శబ్దాలు చేస్తూ కొట్టుకోవడంతో, ఆ తక్కిన గదుల్లోకి కూడా వెళ్లి చూసారు పార్ధు తో పాటు వాళ్ల స్నేహితులు కూడా.

అక్కడ కూడా రకరకాల వెరైటీలు మంచి మంచి విందు భోజనాలు ఏర్పాటు చేసేసున్నాయి అలా ప్రతి ఒక్కరి రూంలో. ఇంతలో ఉన్నపాటుగా, ఒక్కసారిగా అక్కడినుండి అవేశ్ రూం వైపు వెళ్ళాడు పార్ధు. పార్ధు నీ అనుసరిస్తూ అతని స్నేహితులు కూడా… అక్కడ మాత్రం, వాళ్ళకి ఎలాంటి తిను పదార్థాలు, భోజనాలు వాళ్ళకి కనిపించలేదు. కిందికి వెళ్లి, వీరయ్య రూం లో చూడగానే అక్కడ ఆ భోజనాలు తయారు చేయడానికి ఉపయోగించిన పాత్రలన్నీ అప్పుడే కడిగి, ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఒక్కొక్కటి పెర్చేసి ఉన్నాయి.

ఇంతకుముందు వాళ్ళు అలా వచ్చినప్పుడు మాత్రం, ఆ పాత్రలు అలా లేవు. ఈ మధ్యలో ఏం జరిగింది? సారీ.. ఏం జరుగుంటుంది..? వాళ్ళలో భయం తారా స్థాయికి చేరుకుంది. ఎప్పుడూ వాళ్ళకి దైర్యం చెప్పే పార్ధు మాట కూడా మూగబోయింది. అదంతా చూస్తున్న అతనికి కూడా ఇప్పుడు ఏం మాట్లాడాలో, వాల్లకెలా సర్ది చెప్పాలో కూడా అర్థం కావడం లేదు ఆ సంఘటనలతో… దీర్ఘంగా ఆలోచిస్తూ అలా బయటకి వచ్చిన పార్ధు, అందరితో…

“అవేశ్, లక్ష్మి, వీరయ్య కనిపించకపోవడం… ఈ గెస్ట్ హౌజ్ ముఖ ద్వారం ఇప్పటికిప్పుడు మూసుకుపోవడం… చుట్టూ ఎవరూ లేకున్నా ఆ శవం అలా కాలడం.. రూం తలుపులు గాలి వీయకపోయినా వాటికవే కొట్టుకోవడం.. ఎవరో తయారు చేసి పెట్టినట్టు, ఆ ఫుడ్ అలా మన మన గదుల్లో ఉండడం (ఒక్క అవేశ్ గదిలో తప్ప)… కింద కిచెన్ లో వంట పాత్రలన్నీ శుభ్రం చేసినట్టు ఉండడం… ఇక్కడేదో జరుగుతుంది…

పోనీ, ఇవన్నీ మనకి తెలియకుండా మనతో ఎవరో దోబూచులాడుతున్నారనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఇంత తక్కువ టైంలో, పైగా ఇంత తక్కువ ప్లేస్ లో ఎవరు.. ఎలా చేసినా… మనకు తెలిసిపోతుంది. అయినా, అలా ఏమీ జరుగుండదు. కానీ, ఇదంతా చూస్తుంటే, అవును ఇక్కడ ఇంకేదో జరగబోతుందనిపిస్తుంది… ” అని అంటుండగా అలా పార్ధు మాటల్లో…

అవేశ్ కి ఏదో జరుగుంటుందనే భయంతో… ప్రియ ఒక్కసారిగా భోరున ఏడవడం మొదలుపెడుతుంది. పక్కనున్న కృతి, గౌతమి ఏడుస్తున్న తనని ఓదారుస్తుంటే…

“అసలు అవేశ్ ప్రాణాలతో ఉన్నాడా ..?” అంటూ గోపాల్ తనకున్న సందేహాన్ని బయటపెట్టి, అప్పటికే బాధపడుతున్న ప్రియని మరింత బాధపెడతాడు. అక్కడున్న వారిలో మరింత భయాన్ని రేకెత్తిస్తాడు. వాటిని నిజం చేస్తూ…

“హా.. హహాహ్హ…హాహ్హహ్హ…”

అంటూ పెద్దగా నవ్వుతున్న ఒక ఆడ స్వరం వాళ్ళకి అప్పటికప్పుడు ఉన్నపాటుగా వినిపిస్తుంది. ఆ హౌజ్ అంతా క్లోజ్ చేసుండడంతో, దాని గోడలకు ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ… ఆ నవ్వు మరింత భీకరంగా… అసలే భయపడుతున్న వాళ్ళను మరింత భయపెట్టేలా ఉంది.

“హేయ్..! ఎవరు నువ్వు..? ఎందుకు మాతో ఆడుకుంటున్నావ్…? అసలు ఎవరు నిన్ను పంపించారు..?” అంటూ ఆ అజ్ఞాత నవ్వును అధిగమించేలా మరింత గట్టిగా అరుస్తాడు పార్ధు.

దానికి

“ఏడుగురొచ్చారు…! ఇప్పుడు ఆరుగురయ్యారు..! వెల్లెలోపు ఇంకెంత మంది మిగులుతారో..! హా.. హహాహ్హ…హాహ్హహ్హ…”

అంటూ మరింత బిగ్గరగా నవ్వుతూ ఆ అజ్ఞాత స్వరం బదులిస్తూ పై ఫ్లోర్ నుండి కింది ఫ్లోర్ కున్న మెట్ల వెంబడి ఇలా ఆత్మ రూపంలో కిందికి దిగుతూ వాళ్ళకి కనిపిస్తూ మాయమవుతుంది. దాంతో ప్రియతో పాటు అక్కడున్న వారంతా ఖంగితింటారు.

“యూ ఇడియట్ ” యూ ఇడియట్ అంటూ గట్టిగా అరుస్తూ, మరింత కుమిలి కుమిలి ఏడుస్తూ పిచ్చిదానిలా పక్కనే ఫ్లవర్ వాజ్ లను తీసుకుని ఆ అజ్ఞాత వ్యక్తి చేసే శబ్దం వైపు, ఆ ఆత్మ వచ్చే వైపు వాటిని విసిరికొడుతుంది ప్రియ. పక్కనే ఉన్న గౌతమి, కృతి, తనని ఆపే ప్రయత్నం చేయబోతుండగా… కాసేపటికి ప్రియ సొమ్మసిల్లి కిందపడిపోతుంది. ఒకపక్క ప్రియని స్పృహలోకి తీసుకురావడానికి తన స్నేహితురాలందరూ తనకి సపర్యలు చేస్తారు.

మరొకపక్క పార్ధు, గోపాల్, విశాల్.. ఆ అజ్ఞాత వ్యక్తి కోసం ఆ ఇంట్లోనే అన్ని చోట్ల గాలిస్తారు. ఆ ముఖ ద్వారం తెరవడానికి ఎక్కడలేని విఫలయత్నాలు చేస్తారు. కానీ, అవేమీ వర్కౌట్ అవ్వవు. ఇంతలోనే రాత్రి ఏడు గంటలవుతుంది.

“ప్రియ స్పృహలోకి వచ్చిందా..?

ఆ అజ్ఞాత స్వరం, అదే ఆ ఆత్మ ఎవరిది..?

అసలా ఇంట్లో నిజంగా దెయ్యాలున్నయా..?

లేక అదంతా ఎవరైనా ఆడుతున్న నాటకమా..?

అనూహ్యంగా జరుగుతున్నా ఆ పరిణామాలకు కారకులెవరు?

అసలు లక్ష్మి, వీరయ్య ఏమైనట్టు..?

నిజంగా అవేశ్ చనిపోయాడా..?

బ్రతికుంటే అతను ఏమైనట్టు..?

ఒకవేళ నిజంగా అవేశ్ చనిపోతే, మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

లాంటి మీ మదిని వీడని మరెన్నో ప్రశ్నలకు సమాధానం.. తర్వాతి భాగాలలో… “యోధ (ఓ ఆత్మ ఘోష) – 6” తెలుసుకుందాం అసలేం జరగబోతుందో..?

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *