ఏ రాయైతేనేం.!
మా తాతకి ఒక నమ్మకం ఉండేది.. నేను మందులు తీసుకెళ్లి ఇవ్వగానే.. ఎంతరా.. అనే వాడు.. ఖరీదు చెప్పగానే.. ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేది తేల్చేసేవాడు.. నేనప్పుడు ఆశ్చర్యంగా చూసేవాడిని.. ఈయనేదో పెద్ద డాక్టర్ అయినట్టు.. అన్నీ తెలిసినట్టు చెప్పేస్తాడేంటో.. నన్ను ఆడుకోనివ్వకుండా.. అని తిట్టుకున్న సందర్బాలు కూడా చాలానే ఉన్నాయి.. డెబ్బై ఏళ్ల వయసులో ఆయన మా నుంచి దూరమై ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలతో ఏడిపిస్తూనే ఉంటారు.
కొద్దిరోజుల క్రితమే మా సోదరి ఆడపడుచుకి అనారోగ్యం అంటే.. రిపోర్టులు తెప్పించుకుని తెలిసిన వైద్యులకు చూపించాను.. నాలుగు పదుల వయసు దాటిన ఆమెకు వచ్చింది ప్రాణాంతక వ్యాధిలా ఉందని సందేహపడి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురమ్మారు..
అక్కడైతే ఆధునిక సామాగ్రి ఉందని, వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేస్తారని.. మనం మాట్లాడి మరింత మెరుగైన వైద్యం అందించేలా చూడవచ్చని వారు చెప్పింది యథాతథంగా మా బావకు, ఆయన కుటుంబ సభ్యులకు చెప్పాను.. కానీ “గవర్నమెంట్ ఆసుపత్రిలో పడేశారంట” అని ఊళ్లోవాళ్లు అనుకుంటారేమోనని వారు నా మాట వినలేదు..
విశాఖలో మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.. కానీ దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు దక్కలేదు.. పరీక్షల రిపోర్ట్ కూడా రాకుండానే కన్నుమూశారు.. కుటుంబ సభ్యులకు మాత్రం నాలుగు రోజులకే ఐదారు లక్షలు ఖర్చయ్యాయి.
ఈ రెండు సంఘటనలకు ఎన్నో ఏళ్ల వ్యత్యాసం ఉంది.. కానీ మనుషులు ఏం మారారు.. మార్పు ఎక్కడొచ్చింది.. డబ్బులు ఖర్చుపెడితేనే మెరుగైన వైద్యం అనే భావం అందరిలోనూ బలంగా నాటుకు పోయింది.. అదే కార్పొరేట్ ఆసుపత్రులకు కాసులు కురిపిస్తోంది.. ఫార్మా (మందులు) కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతోంది.
ఆయుర్వేద మందులనేవి కూడా ఈ భావనతోనే వాడటం లేదు.. ఇంగ్లీషు మందులే వాడుతూ.. అదో స్టేటస్ సింబల్ గా భావించేవారూ ఉన్నారు.. కానీ అనారోగ్యమంటూ వచ్చాక ఏ మందైనా ఒకటే.. వాటిలో మంచి, చెడూ అంటూ ఏమీ ఉండదు.. పని చేయడం.. చేయకపోవడం తేలడానికి సమయం కాస్త అటూ ఇటూ అవుతుందంతే.!
– ది పెన్