విశ్వరూపం

విశ్వరూపం”
*******

భరతజాతి లో పుట్టిన పడతిని నేను
ఆదిశక్తి అవతారాన్ని జనులందరూ
కొలిచే కొంగుబంగారాన్ని నేను
ఈ సృష్టి కి మూలాన్ని !!

త్రిశూల ధారి అయిన రుద్రదేవునికి
అర్ధభాగమైన పార్వతీదేవిని
జనుల భవిష్యత్తు రాసే బ్రహ్మకు
చేయుత నందించు సరస్వతిని!!

ఆదిశేషుని పై పవలిస్తూ
బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న మహా విష్ణువు
ముద్దుల ఇంతిని నేను
పతి సేవయే పరమావదిగా భావిస్తూ
ఆయన పాదాల చెంతనే పడి ఉన్నాను !!

కానీ నేడు ఈ భూ మండలం పై జరుగుతున్న
అమానుషాలను చూస్తుంటే నా రక్తం మరిగిపోతుంది
కష్ట జీవుల శ్రమ ఫలితం దోపిడీ దళారులు
అందుకుంటే వారిని త్రిశూలం తో పొడవాలనిపిస్తుంది!!

అమ్మా అక్కా చెల్లీ వదినా బామ్మా
అన్న వావీ వరుసలు మరిచి
సంకరజాతి జంతువులా
ఆడవాల్లని చిన్న పిల్లలనీ
తన చేతుల్లో నలిపేస్తున్న
మృగాల ప్రేగులు చీల్చి
మెడలో వేసుకోవాలనిపిస్తోంది!!

భవిష్యత్తులో ఏ గొప్ప శాస్త్రవేత్తగానో
టీచర్ గానో ఇంజనీరు గానో అయ్యి
తమ పేరుని చరిత్ర పుటల్లో చిరస్థాయిగా
నిలిచిపోయేలా స్వర్ణాక్షరాలతో
లిఖించాల్సిన చిన్నారులను ఎత్తుకెళ్లి
వారి అవయవాలతో వ్యాపారం చేసే
దుర్మార్గుల శిరస్సుని ఒక్క వేటుకే
ఖండిచాలని ఉంది !!

పొద్దుపొద్దున నిద్ర లేచి
హలం చేతబుని
పొలానికి పోయి రోజంతా కష్టపడి పంటలు పండించి
మనందరికీ అన్నంపెట్టే
రైతన్న కి దర్శనం ఇచ్చి
కోటివరాలు కోరుకో నాయనా అని అడగాలని!!

కానీ !!
అదేదీ జరగదే !!
ఎందుకంటే ఇది కలికాలం!!
మనుషులకే కాదు దేవునికీ రక్షణ కరువైన కాలం!!
దేవాలయాల్లో దూరి దొంగతనాలు చేస్తుంటే
గమ్మున ఉంది అమ్మవారు
తన మహిమ చూపించడం లేదని
మరీ విర్రవీగకండి!!

కృష్ణవేణమ్మ వెళ్లి దుర్గమ్మ ముక్కు పుడకని తాకే
కలి యుగాంతం కోసం వేచి చూస్తున్నా
అది జరిగిన మరుక్షణం
ఈ అమ్మవారి విశ్వరూపం చూపిస్తాను
నరరూప రాక్షసులను
నా ఖడ్గానికి బలి ఇస్తాను
మానవ మృగాల శిరస్సులను తుంచి
నా మెడలో హారం గా వేసుకుంటా
ముక్కంటి లా మూడో కన్ను తెరిచి
దోపిడీదారులను మాడ్చి మసి చేస్తాను !!

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *