విజ్ఞాన భాండాగారం
అసలు మనం
పురోగమిస్తున్నామా?
తిరోగమిస్తున్నామా?
నాకు అర్థం కాని విషయం ఏంటంటే!
అభివృద్ధి పేరుతో
ఆచారాలను అటకెక్కిస్తున్నాం
విజ్ఞానం అంటూ విర్రవీగి
వివేచనను కోల్పోతున్నాం
ఆచారాలకు మూఢనమ్మకాల
ముసుగు వేసి మూలన కూర్చోబెట్టాం
చాణక్యుని శాస్త్ర సారానికి
చరమగీతం పాడేసాం
నీతి శాస్త్రాల నియమాలకు
ఎప్పుడో నీళ్లొదిలేసాం
మన విజ్ఞాన సంపదకు
విదేశీయులు సైతం
ముక్కున వేలేసుకుని మరీ
ముచ్చట పడిన ముడుపును
మురికి కాలువలో కలిపేశాం.
మన ఋషి శాస్త్రవేత్తలు నింపిన
విజ్ఞాన బాండాగారం
నిలువునా పాతి పెట్టేసాం
ఆధ్యాత్మికతకు విజ్ఞానాన్ని విడదీసి
ఎప్పుడో విడాకులు ఇప్పించేసాం
సారమంతా పారబోసి వట్టి పిప్పి తిన్నట్టు
వి’గ్రహాల’ చుట్టూ కట్టకట్టుకు తిరుగుతున్నాం
తోరణాలను తుంగలో తొక్కేసాం
గడపలకు రంగు ముడుపు కట్టేసాం
ఆయురారోగ్యాలను ఇచ్చే
ఆయుర్వేదాలను
అమ్మమ్మలకంటగట్టి
పాత చింతకాయ పచ్చడి ముద్రతో
పాతి పెట్టేసాం
ఆగస్త్య సంహితను
గాలిలో విసిరేసాం
భరద్వాజ బుద్ధిని
బూడిదలో కలిపేసాం
విజ్ఞానం పేరు చెప్పి
వెర్రిపుంతలు తొక్కి
వింత పోకడలు పోతున్నాం
వివేకం విడమరిచాం
శాస్త్రం నుంచి పుట్టిన సైన్స్
నిన్ను పట్టి నడిపిస్తుందని
గ్రహించని ఓ వివేకుడా!
ఆచారం వెనుక నిక్షిప్తమైన
నిగూఢ ఆరోగ్య రహస్యం
మానవకళ్యాణ నిగమసూత్రం
అదే భావితరాలకు
మనం చూపే నిజమైన మార్గదర్శం
– భాగ్యలక్ష్మి