విధి వంచితులు

విధి వంచితులు

బాలానగర్ బస్ కోసం నర్సాపూర్ బస్ స్టాండ్ లో ఎదురుచూస్తున్న నాకు చాలా చిరాకుగా ఉంది. గంట సేపటి నుండి చూస్తున్న బస్ కోసం ఇంకా రాలేదు అనే ఆలోచన నాకు చిరాకు తెప్పించిన మాట నిజం. ఆ పక్కనే బస్ స్టాండ్ లో ఉన్న కొట్టులో అప్పటికే రెండు సోడాలు తాగాను. మరి అప్పటికి కూడా దాహం తీరడం లేదు.

అసలే ఎండాకాలం దాంతో పాటు నేను తెచ్చుకున్న నీళ్లు కూడా అయిపోవడం వల్ల సోడాతో అయినా దప్పిక తీర్చుకుందామని సోడా తాగితే అది ఇంకా దాహాన్ని పెంచింది తప్పితే తగ్గించలేదు. ఎప్పుడెప్పుడు ఇంట్లో పడదామా చల్లని ఫ్యాన్ వేసుకుని కాసేపు నిద్రపోదామా అనిపిస్తుంటే బస్ రాకపోవడం వల్ల చిరాకు వస్తుంది కదా మీరే చెప్పండి….

మరో రెండు బస్ లు వచ్చాయి కానీ అవి మెదక్ వెళ్ళేవి. ఇక బస్ రాదని నిర్ధారించుకుని వెళ్లి ఒక బల్ల పై కూర్చున్నా… జనాలు ఎక్కువే ఉన్నారు. హైదరాబాద్ బస్ వస్తె సీటు దొరుకుతుందొ లేదో అనుకుంటూ చుట్టూ ఉన్న వారి వైపు దృష్టి సారించాను. అనుకోకుండా బే బే బే అంటూ ఓ శబ్దం వినిపించింది నా పక్కనే… ఒక్కసారిగా ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసాను.

బే బే బే బే అంటూ మళ్ళీ అనసాగింది. నేను ఒకసారి తనను తేరిపార చూసాను. అక్కడక్కడా చిరిగిన చీర, అతుకులు వేసి కుట్టిన జాకెట్, బొట్టు లేని నల్లని మొహం లో తెల్లగా చిరునవ్వు మాత్రమే కనిపిస్తుంది. చేతిలో చంటి బిడ్డ తో మళ్ళీ బే బే బే అనగానే నా చూపులు అపేసి జేబులో చెయ్యి పెట్టాను. చెయ్యి లోకి వంద నోటు రాగానే తప్పు లేదు ఇలాంటి వారికి ఒక పూట అన్నం అయినా కడుపు నిండా తింటారు అని అనుకుంటూ వేయబోయాను.

ఏం సార్ మిమల్ని కూడా బోల్తా కొట్టించిందా ఇది….! ఈమె నంగనాచి సర్, ఇలాగే మాటలు రానట్టు నటిస్తూ అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటుంది. ఇలాంటి వారి వల్లే నిజమైన అడుక్కునే వారికి విలువ లేకుండా పోయింది వారి నోటి కాడ కూడు లాక్కుని ఇది తింటూ మిత్తిలకు డబ్బులు ఇస్తుంది. నేను కూడా తీసుకోక తప్పలేదు మరి ఇదిగొమ్మా నీ మిత్తి డబ్బులు. అసలు వచ్చే నెల ఇస్తాను అంటూ అంతకు ముందు నేను సోడా కొన్నా షాప్ యజమాని డబ్బులు ఇచ్చాడు.

నీ జిమ్మడ… దొంగ సచ్చినోడ… నాకొచ్చే వంద పోగొట్టావు కదరా ఏర్రి సచ్చినోడ నా పైసలు నాకు రేపటికల్లా ఇయ్యాల లేదంటే నీ మీన కేస్ పెట్టెత్తా అంటూ ఆమె గొంతు చించుకుని బండ బూతులు మాట్లాడుతుంటే వినలేక నేను చెవులు ముసుకోవల్సి వచ్చింది. ఆశ్చర్యంగా ఆమెని చూస్తున్న నాతో సర్ ఆమె అలాగే తిడుతుంది కాసేపు ఆగితే ఆమె ఊరుకుంటుంది లెండి. మీ బస్ వచ్చింది ఎక్కండి అన్నాడు షాప్ యజమాని.

నేను తేరుకుంటూ బస్ చూసాను ఇంతలో సర్ అంటూ ఇంకో చిన్న పిల్లాడు వచ్చాడు అక్కడికి చిరిగిపోయిన అంగి, నిక్కరు తో చింపిరి జుట్టు తో దుమ్ము, ధూళి నిండిన నల్లని మొహన్ని జుట్టంతా కప్పెస్తుంటే వెనక్కి తోస్తూ నా ముందు నిలబడ్డడు. సార్ ఆ వంద ఈ బుడ్డోడికి ఇవ్వండి. వీడికి అమ్మా నాన్న లేరు. ఇక్కడే బిచ్చం ఎత్తుకునే వారు. ఒకరి తర్వాత ఒకరు రోగం తో సచ్చిపోయారు. పాపం దవాఖానాన సుపిచ్చుకునే స్థోమత లేక సచ్చిపోతే మేమే కొన్ని పైసలు ఎస్కొని కార్యం చేయిచ్చినం.

అప్పటి సంది ఇడనే ఉంటడు, రోజూ నా టిఫిన్ తో పాటు వినికి కూడా ఒక డబ్బా తెస్త మీరిచ్చే వంద రూపాయల తో వానికి ఒక ఆంగి, చెడ్డి అస్తది సారు అన్నాడు నవ్వుతూ… నేను ఇంకొక బస్ రావడం చూసి, ఆ అబ్బాయి చేతిలో వంద రూపాయల నోటు పెట్టేసి బస్ వైపు అడుగులు వేసాను. ఆ అబ్బాయి నన్ను చూస్తూ దన్నం పెట్టడం నా చూపుల నుండి తప్పించుకోలేదు.

బస్ ఎక్కి సీటులో కూర్చున్నా తర్వాత అనిపించింది నాకు ఇలాంటి మోసగత్తెల వల్లనే కదా అసలైన విధి వంచితులకు సరైన న్యాయం జరగడం లేదని. అయినా కళ్ళు చూసేది నిజం కాదని కాస్త మన సమయస్పూర్తి కూడా అవసరమే అనిపించింది. బస్ బయలు దేరుతుంటే ఆవిడ ఇంకో కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్లి బే బే బే అనడం, అతను జేబులో చెయ్యి పెట్టడం దాన్ని చూస్తున్న నాకు బస్టాండ్ గోడ అడ్డు రావడం తో కనుమరుగు అయ్యింది.

ఇలా ప్రతి బస్ స్టాండ్ లో ఎవరో ఒకరు ఉంటారు. కానీ వారికి దానం చేయాలో లేదో అనేది ఆలోచించే తీరక ఉండదు. కాబట్టి మనం వేసేసి వెళ్తాము. అదే కాసేపు అగి ఆలోచిస్తే అసలైన వారికి దానం చేస్తే కాస్త పుణ్యం అయినా వస్తుంది అనుకుంటూ కళ్ళు మూసుకున్నా…

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *