విధి వంచిత విలాప విచిత్రం

విధి వంచిత విలాప విచిత్రం

ప్రేమని గుడ్డిగా నమ్మింది
నమ్మిన వాడి వెంట గుడ్డిగా నడిచింది
కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది
ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య
నీది తక్కువ కులం అందుకే తక్కువ బుద్ధులు అంటూ
చీటికిమాటికి గొడవలు పడుతూ కొడుతూ తిడుతూ
నీతో నాకేమీ లాభం లేదు
నా కులం దాన్ని చేసుకున్నా కట్నం వచ్చేది అంటూ
అటు ఇటు కాని స్థితిలో వదిలేసి వెళ్లాడు
ఏం చేయాలో అర్థం కాక కన్నవారికి
మొహం చూపించలేక బ్రతికే దారి తెలియక
చేసుకుందామన్నా ఏ పనికి దొరకని పరిస్థితిలో
చుట్టూ కాకుండా మృగాలు పొడుస్తుంటే
కానరాని చీకటిలో పరిఎత్తుతున్న తనని
కాపాడింది ఒక దేవత
దేవత అనుకునే లోపు
దయ్యంలా మారి ఆమె జీవితాన్ని
తన చేతుల్లోకి తీసుకుంటూ
ఆమెని నిర్ధాక్షిణ్యంగా అమ్మేసింది
అంగట్లో బొమ్మలా మారింది
ఆ క్షణం ఆమె చచ్చిపోయింది.
వచ్చేవాడు పోయేవాడు
గిల్లే వాడు గిచ్చేవాడు
రక్కేవాడు కొరికేవాడు
వాతలు పెట్టేవాడు కాల్చేవాడు
ఇన్నిటి మధ్య ఆమె
మనసు బండగా మారింది
తనెవరో ఎక్కడి నుంచి
వచ్చిందో అనేది మర్చిపోయింది
అదో ఆ క్షణంలోనే మరో
మగాడు ఆమె దగ్గరికి వచ్చాడు
ఆమెని పరికించి చూశాడు
అప్పుడు అర్థమైంది అతనికి
అది ఎవరో కాదు తన తోడబుట్టిందే అని
అయ్యో అనుకున్నాడో క్షణం
కానీ ఆమె మనసు శరీరం రెండు
ఏవి గుర్తించే స్థితిలో లేవు
ఆమెను తీసుకెళ్లాలని ఆలోచన
అతనికి రాలేదు, ఎందుకంటే
సమాజం సంఘం సంప్రదాయం
కట్టుబాట్లు చుట్టుపక్కల వారి
ఎత్తిపొడుపు మాటలు
అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి.
అంతే ఆమె తనని గుర్తించక ముందే
చల్లగా అక్కడినుంచి జారుకున్నాడు.
కావాలంటే అతను ఆమె జీవితాన్ని మార్చవచ్చు.
తన ఇంటికి కాకపోయినా, అతను ఆమెను
ఆ బంధీఖానా నుంచి కాపాడి, ఏదైనా అనాధ శరణాలయంలో ఉంచవచ్చు, కానీ అతను
ఆ పని నీ చేయలేదు. తనకెందుకులే అని అనుకున్నాడు
ఇవేవీ గుర్తించని ఆమె విధి రాతకు బలైపోయి విచిత్రంగా
విలపించడం మొదలుపెట్టింది.
ఇలాంటివి గంటకి ఎన్నో జరుగుతున్నాయి.
మోసపోతున్న వాళ్లు మోసపోతూనే ఉన్నారు
మోసం చేస్తున్న వాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నారు.
తమకు ఎందుకులే అని అనుకున్న వారు వదిలేస్తున్నారు.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *