వెన్నెల మాయ
చంద్రుడి నయనంతో
చీకటిలో పయనించామా
నీరసమింక పలాయనం
వెన్నెల రసఝరిలో
ఎన్ని వన్నెల లాహిరిలో
ఏకాంతాన్ని వెంటేసుకుని
జ్ఞాపకాల మంటేసుకున్న
మనసంతా అలజడి
కలల నావలో జీవితానికావలి
తీరాన్ని వెతకాలని బయల్దేరాను
నిండునదిలా వైశాఖ పున్నమి
కొత్త ఊపిరితో స్వరాలు కడుతుంటే
కొన ఊపిరి ప్రాణానికి
సంజీవిని అద్దినట్టు ప్రయాణం పాటయింది..లోనంతా రహస్యవాన
నిధిదొరికిన అన్వేషి
గాలివాన బతుకును గాటలో పెట్టినట్టు..వెన్నెల మాయే అంత
రాత్రిని మధువుని చేసిన
నవవధువులా ముసిముసిగా నవ్వుతుంది
– సి.యస్.రాంబాబు