వెన్నెల దీపం – వేకువ గీతం

వెన్నెల దీపం – వేకువ గీతం

 

అక్షరం నాలో ఉదయించే మార్పు
అక్షరం నన్ను నేను దర్శించే చూపు
అక్షరం నాలో చిగురించే ఆశ
అక్షరo నేను నేనుగా జీవించే శ్వాస.

అక్షరం నన్ను నడిపించే శక్తి
అక్షరం తను వెలిగించే యుక్తి
అక్షరం మనో మాలిన్యాలను తొలగించే విముక్తి.
అక్షరం నాలో ప్రవహించే వెన్నెల
అక్షరం నాలో పల్లవించే కోకిల
నాలో పురుడు పోసుకున్న సంకల్పం
నాలో జ్వలించే చైతన్యం…
నిత్య నూతనమై, సత్య సూత్రమై,
నా ధైర్యమై నను పరిరక్షించే ఆయుధమై
విశ్వమంతా పరివ్యాప్తమయ్యే
ఆకాశ స్వప్నం
చినుకై చిగురించే నేల సత్యం.
నన్ను చేయిపెట్టి నడిపించే నాన్న చిటికెన వేలు అక్షరం
మనల్ని ఎత్తుకుని ముద్దాడే
అమ్మ ప్రేమ జాలు అక్షరం.
అక్షరం అది ప్రపంచానికే చూపుడువేలు.
అక్షరం నా ఆనందం
అక్షరం నా అనుబంధం
నాలోని మమత సమత
నాలోని మానవతా కవితా
అక్షరమే.
విశ్వ వేదిక మీద పరిమళించే సూర్యపుష్పం అక్షరమే.
ప్రపంచ ప్రగతికి దారులు వేసే
జ్ఞాన ఖడ్గం అక్షరమే.
ఆమనికి స్వాగతం పలికే
ప్రకృతి పాట అక్షరం
నా కృతికి
జన జాగృతికి ఆధారం.
సృష్టికి ప్రతి సృష్టి
సృష్టికి నిజమైన దృష్టి
అక్షరం.
అక్షరమా వందనం.
అక్షరమాభివందనం.

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *