వరద బాధలు

వరద బాధలు

1) వదలకుండ వాన వరదలై పొంగెను
   వాహనములు తేలె వరదలోన
   బురదచేరి సరుకు పనికి రాకుండాయె
   ధైర్యమిచ్చువారు దరికిరారు

2) ఇంటనీరుచేరి ఇక్కట్లు మొదలాయె
   ఉప్పు పప్పు తడిసి ఊటలూరె
   ధాన్యమున్నయింట తడిసి మొక్కలు వచ్చె
   బిక్కచచ్చిరైతు బిచ్చమెత్తె

3) మురికి వాడలన్ని మూసినదాయెను
   హైద్రబాదు జనులు ఆగమయిరి
   చెరువులయ్యె యింటి సెల్లారులన్నియు
   కార్లు బురదవల్ల కదలవాయె

4) చెరువులు దెగిపోయె చేలన్నిమునిగెను
   బాటలన్నికరిగి బాధ కలిగె
   వాహనములు పోయె వాటితో మనుషులు
   మురికి కాల్వలందు మునిగి చచ్చె

5) లంకలాయె కొంపలన్ని నీటమునిగి
   అడుగు బయట పెట్ట నలవిగాదు
   కూడువండరాదు కుడువ వీలుగాదు
   కారుచీకటి కెటు కదలరాదు

6) పల్లె పట్నమంటు పట్టింపు లేకుండ
   ఊరువాడలన్ని ఒక్కటాయె
   దారులన్నిజలతారు రోడ్లాయెను
   ఎత్తు పల్లములన్ని ఏకమాయె

7) వారము దినములుగ వస్త్రాలు యెండక
   మురిగి కంపుగొట్టి ముప్పు దెచ్చె
   ఎండ ఒక్కరోజు దండిగా గొట్టిన
   బట్టలన్ని ఎండి బాగుపడును

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *