వంటగది
వంటగది
బాగా ముసల్దయింది
కొంచెం కూడా విశ్రాంతి లేదు
పొపు డబ్బా
రంగు వెలిసినా
ఇంకా నలతగా నవ్వుతూనే ఉంది
ఈలపీట
ఓపికను తెచ్చుకుని
మొండిగా పదునవుతూనేవుంది
మసిగుడ్డ
చెమటను తుడుచుకుంటూనే
ఓపికై పారాడుతూనేవుంది
విరామం లేని పొయ్యి
ఆకలికి మందు వేస్తూనే ఉంది
వంటపాత్రల బలం క్షీణిస్తోన్నా
గింజల్ని ఉడికిస్తూనే ఉంది
గంజిబట్ట పిగిలిపోతోన్నా
ఆరాటంగా పోరాడుతూనేవుంది
మెత్తబడ్డ చీపురు
జుట్టు నెరిసినా
సేవ చేస్తూనేవుంది
అన్నీ మొండివి
అచ్చం అమ్మలాగే …
-గురువర్ధన్ రెడ్డి