వందేమాతర ఉద్యమమై!
అదిగో అడుగేస్తున్నది ప్రగతి పథం వైపు
కారుణ్యం చూపని కారణం అందరిని
నడిపించినదై రెపరెపలాడుతు శ్రమను
గెలిచిన వాదంతో శిఖరాగ్రమున పథాకమై
నిలిచిన రంగు రంగుల ముచ్చటైనా జెండా…
ధీరులు వీరులు అలుపెరుగని
స్వాతంత్ర్యపు సమరయోధులు తరతరాల బానిసత్వాన్ని విడనాడుతు…కొనగంటి
కన్నీటితో తనువులు తడువరాదని
అన్నార్తులు అభాగ్యులతో ఈ దేశ
భవితవ్యం చులకన కారాదని…
పలికిన పద పలుకుల స్వచ్ఛత…
వందేమాతర ఉద్యమమై తోడు నడిచిన
వారికి చేతనా సాంగత్యమై నిలిచినా
దేహాలను సాగర ప్రవాహమై కదిలిస్తు…
స్వరాజ్య పోరాటమన్నది కలిసి కట్టుగా చేసిన
ఒక సాహసమని చెప్పిన జెండా…
విరిగిన రెక్కల బడుగు బొందిలో
ప్రాణము మిగిలినదై చిత్తాల వివరణతో
జారవిడువని ధ్యేయమే ప్రజా పరిరక్షణ
కోసం కావాలని…కోణం కొలచిన మబ్బులతో
నిర్ణయం చూపిన గమ్యానికై నడువరాదని…
రాక్షస వాదులను రాచరికపు వ్యవస్థలను
సరిహద్దులు దాటిస్తు సాధించిన ఘణత
సాయుధమై కదులుతు తెలవారుటను
చూచింది మొదలు ప్రతి మనస్సు చేసిన
ఆలాపనలతో దేశగీతమై వినిపించిన జెండా…
సోదరా భావమొక సంఘాన్ని నడిపించే
ఆదేశాల అనుసారమని ఆశ్రయించిన
సమయం తొలిపొద్దు సంబరంగా కదిలింది ఐకమత్యమే మహాబలమని… వెలుగుల
సూర్యోదయంతో పగలనకా రేయనకా
ప్రభాత భేరిని సాగించాలని…
మూడు రంగుల అర్థాలలో మర్మాన్ని
నీతీ నియమాలతో ఎలుగెత్తి చూపుతు
ఖండాంతరాల ఖ్యాతిని పొందాలని…
పాడి పంటలతో సస్యశ్యామలమై
పూర్ణీభవించిన పున్నమితో పుట్టిన
ప్రతివాడిలో దేశ భక్తిని పెంచిన జెండా…
ఆశయ సాధనలో ఒరిగిన వీరుని నినాదమై
తన దేశపు కీర్తి ప్రతిష్టలను బతికించాలని…
చేసినా శాసనాలతో తారకమై నిలబడుతు
ఆంగ్లేయుని పాలన పడగ విప్పిన పాము
వంటిదని ప్రతి నిముషం పహరా కాయాలని…
సమైక్య వాదమై సాధించే సమరంలో
పాదాల చరణదాసి తనాన్ని విడనాడాలని
కొనగోటి ధూళికై కోటి దండాలు పెట్టరాదని
ఏకమైనా మానవత్వంతో మరువని
స్వదేశీ పాలనని పెంపొందించిన జెండా…
రాగధ్వేషాల లాలసనలు భోగభాగ్యాల
నిలయాలు మనకొద్దని మరిచిన నాడే
అసలైన దేశ సౌభాగ్యమని ఎవరో చేసిన
నిరంకుశుల పాలనకు బలి పసువులుగా
నిలబడరాదని రణరంగపు బతుకులతో
రాజ్యాన కౌఠిల్యం రంకెలేయరాదని…
ప్రతి మనిషొక సైనికుడై దేశసేవ చేయాలని
వాస్తవ సంకేతాలతో అభ్యుదయం సాధించిన
దేశంగా వెలివేయని వాడలతో నిరంతరాన్ని
సాగించుకొంటు తల్లిపాల ఋణం త్యాగమై
తొలిచిన ప్రతి సంస్కృతి నమ్మబలికిన
సిద్దాంతమని గూడు కట్టిన గుండెలలో
భావగీతాన్ని పాడించిన జెండా…
-దేరంగుల భైరవ