వలసకూలీలు
ఆటవెలదులు
1) ఉన్న ఊరిలోన ఉద్యోగమేలేక
వలస బాటపట్టి వచ్చినారు
కన్నవారినివిడి కానని దూరాల
బుక్కెడన్నమునకు బుగ్గి యగుచు
2) బతుకు తెరువు మిగుల భారమై తలకెక్క
శాంతి గూర్చు సంతు చంకనెక్కె
నడవరాని కొడుకు నడిచె చేయందించ
భర్త మోసె మిగత భారమంత
3) చేసినంత పనికి చేయిచ్చి యజమాని
మమ్ము బుజ్జగించి మాయజేసె
మరలవచ్చినపుడు మరవకిచ్చెదనని
సగము జీతమిచ్చి సాగనంపె
4) భోజనమ్ము కరువు భుజముపైన బరువు
గమనమాగదాయె గడియయైన
కాళ్ళు కందిపోయె గమ్యము కనరాదు
వలస జీవి బతుకు వంచనాయె
5) చెప్పులు తెగిపోయె చెమటలు ధారలై
కాళ్ళు బొబ్బలెక్కి కదలవాయె
నోరుయెండిపోయె ఊరు చేరువగాదు
వలస జీవితాశ వట్టిపోయె
6) వలస కార్మికులకు వచ్చిన కష్టాలు
అలవిగాదు చెప్ప అజునికైన
మానవత్వమున్న మనుషులున్నందునే
అన్నపానములిడి ఆదుకొనిరి
– కోట