వైకుంఠ ఏకాదశి విశిష్టత

వైకుంఠ ఏకాదశి విశిష్టత

దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు.

భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు.

నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు.

ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది.

దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం.

దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి.

నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అన్నారు.

దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు – అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట.

అనగా, వారి పగలు ప్రారంభమైందన్నమాట. ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము.

ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు.

అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.

పండుగ ఆచరించు విధానం:

ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు.

ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం.

ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం.

‘లంకణం పరమౌషధ’మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :

1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.
2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
3. అసత్య మాడరాదు.
4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.
5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
7. అన్నదానం చేయాలి.

ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)
కార్తీక శుద్ధ ఏకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)
వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి అఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది.

అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు.

బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు.

ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు.

ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు.

అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.

కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది.

రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు.

చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది.

వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు.

విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు.

దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు.

అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.

ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు.

ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు.

బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది.

వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు.

అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు.

విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు.

అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు.

మన రాష్ట్రంలోని తిరుపతి, భద్రాచలం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.

తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది.

వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి.

భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది.

ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు.

సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *