వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -3)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -3)

తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ బండి దిగాడు ఆనంద్.

వాసు బండి వెనక్కి తిప్పాడు. ఇప్పుడు సీతకి ఎదురుగా వెళ్ళి ఆమెని పలకరించాలని, మనసులో వెయ్యి ఆలోచనలు.

ఆమె బండి ఆపుతుందా లేదా పట్టించుకోనట్టు చేస్తుందా? నేను ఆమె వైపు చూడాలా వద్దా? ఈ ఆలోచనలతో ఆమెని సమీపించాడు వాసు. యధాప్రకారం ఆమెని చూడనట్టుగా ముందుకి వెళ్ళబోయాడు.

కానీ, సీత చెయ్యి తో సంజ్ఞ చేసింది ఆపమని. ఇక, వీడి గుండెలో ఆనందాల రైళ్ల పరుగులు. మళ్లీ వెనక్కి తిప్పాడు బండిని. ఈసారి కాస్త హీరో లెవల్లో తిప్పాడు. ఆమె పక్కగా బండిని ఆపాడు.

“ఏంటి మళ్లీ వచ్చావు వెనక్కి? ఆనంద్ ఏడి?” అని అడిగింది సీత.

ఏమని చెప్పాలి? ఇరుక్కుపోయాడు వాసు. “వాడు చాయ్ తాగుతా అంటే అక్కడే దించాను” అని చెప్పాడు.

“మరి నువ్వు చాయ్ తాగావా?” అడిగింది సీత.

మళ్లీ ఇరకాటం లో పడ్డాడు వాసు. “అబ్బే, అదేం లేదు….! తాగుతాను. కానీ……………!” అంటూ ఏదో చెప్పబోయాడు వాసు.

“నేను పిలవడం విని కూడా స్టైల్ కొడుతూ ముందుకు వెళ్లారు. నాకు తెలుసులే…………! ఎందుకు నా ముందు ఫోజు?” అంది సీత.

“నువ్వు ఇచ్చిన ఉప్మా బావుంది. నేనొక్కడినే తిన్నాను” అన్నాడు వాసు.

“మరి ఆనంద్ ఏంటి అందరం తిన్నాము అని చెప్పాడు.” అడిగింది సీత.

“వీడు, ఈవిడ తో ఎప్పుడు మాట్లాడాడు, అబ్బా? పైగా పూసగుచ్చినట్టు అన్ని చెప్పడమే…! వీడి పని పట్టాలి.” అని మరోసారి లోతుగా ఇరుకున్న వాసు మనసులో అనుకున్నాడు.

“ఏమో గాని, ఇంతకీ, ఏంటి విషయం? ఎందుకు పిలిచావు?” అడిగాడు వాసు.

“కాస్త నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఇంటిదగ్గర దించుతావేమో అని పిలిచా.” చెప్పింది సీత.

సంవత్సరం పొడవునా వచ్చే పండగలన్నింటినీ ఆ క్షణంలో జరుపుకుంటున్న అంత ఆనందం వాసులో…. ముఖ్యంగా, దీపావళి.

“అది, ఏముందిలే……!” కూర్చో అన్నాడు.

రోడ్డు సరిగా లేకపోవడంతో ఎక్కువసార్లు బ్రేక్ వేయాల్సి వస్తోంది వాసుకి.

“పోనీ త్వరగా” అని మాత్రం సీత నోట్లో నుంచి రాలేదు. హాయిగా, గుడిలో అరుగుమీద కూర్చున్నట్టు వాడి సీటు వెనుక ప్రశాంతంగా స్థిరపడింది.

గౌతమీ నగర్ దాటి ఎఫ్సీఐ లోకి ప్రవేశించే ముందు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఈ ట్రాక్ నిత్యం ఎన్టిపిసికి బొగ్గు తీసుకెళ్లే గూడ్సు బళ్ల తో బిజీగా ఉంటుంది.

ఇద్దరూ ఎవరి మనసులో వాళ్ళు గేట్ తీసే ఉండాలి అని ప్రార్ధించుకున్నారు. వీరిద్దరి అదృష్టం బాగుంది. గేటు తీసే ఉంది.. రయ్యి మని గెట్ దాటించాడు బండిని.

“హమ్మయ్య” అన్నాడు వాసు.

“ఎందుకు?” అని అడిగింది సీత.

“గేటు తీసి ఉండాలి అని మనసులో అనుకుంటున్నాను. తీసే ఉంది గా… అందుకు” చెప్పాడు వాసు.

“గేటు మూసి ఉంటే ఏంటి సమస్య?” అని చిలిపిగా అడిగింది సీత.

మళ్లీ ఇరుక్కున్నాడు వాసు. “అమ్మో, ఏం చెప్పినా కష్టమే ఉన్నట్టుంది ఈ పిల్లతో.” అని మనసులో అనుకున్నాడు.

“అంకుల్స్, ఆంటీస్ చూస్తే బాగుండదు కదా……..!” అందుకే అన్నాడు వాసు.

“అబ్బో గొప్ప సంస్కారమే నీది…!” మెచ్చుకోలుగా అంది సీత. సెంట్రల్ స్కూల్ గ్రౌండ్ దగ్గర నన్ను దించు. అక్కడ నుంచి మా ఇల్లు ఓ పది అడుగులు మాత్రమే. నేను వెళ్ళిపోతాను. అక్కడ జన సంచారం ఎక్కువగా ఉండదు.” చెప్పింది సీత.

“మరి అక్కడే ఎందుకు?” అడిగాడు వాసు.

“అంకుల్స్, ఆంటీస్ చూడరు…….” మరో చిలిపి బాణము సంధించింది సీత.

ఈసారి పెద్ద లోయ లోనే ఇరుక్కున్నాడు వాసు. మొత్తానికి ఆమె అడిగిన చోట దించి రాముడు మంచి బాలుడు లా వెనుదిరిగాడు వాసు.

ఎందుకంటే ఇంకో మంచి బాలుడు అక్కడ మూసిన షటర్ గద్దె మీద కూర్చుని ఎదురుచూస్తున్నాడు విడి కోసం.

“ఏరా, ఇంత ఆలస్యం అయ్యింది. నా కళ్ళు పూలు పూసి, కాయలు కాసి పండ్లు అయ్యాయి.” అన్నాడు ఆనంద్ కోపంగా.

“నేను రాల కొడతానులే. కాస్త మెల్లిగా నడిపాను బండిని.” చెప్పాడు వాసు.

“ఇంతకీ ఏమని సంభోదించిందట అప్పుడు?” ఉత్సుకతతో అడిగాడా ఆనంద్ .

“అడగలే………!” పొగరు చూపించాడు వాసు.

“ఆమెది ఎఫ్సీఐ ఆ లేదా గౌతమి నగర్ ఆ?” మరో ప్రశ్న ఆనంద్ ది.

“ఎఫ్సీఐ” సమాధానం ఇచ్చాడు వాసు.

“ఇల్లు చూశావా?” అడిగాడు ఆనంద్.

“లేదు.” తాపీగా సమాధానం చెప్పాడు వాసు.

“ఓరి, బండ నాయాల…..! అక్కడిదాకా వెళ్ళి ఇల్లు చూడలేదా……? నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మూర్ఖుడా…..!” అన్నాడు ఆనంద్.

“ఏమోరా….. నా సంస్కారం నన్ను ఆపేసింది.” చెప్పాడు వాసు.

“లిఫ్ట్ ఎందుకు అడిగిందో కనుక్కున్నావా?” అన్నాడు ఆనంద్.

“ఆ, కనుక్కున్నాను.” సమాధానం ఇచ్చాడు వాసు.

“కమాన్ మై బాబాయ్. ఇప్పుడు గొప్ప వాడివి అనిపించుకున్నారు. చెప్పు, చెప్పు.” ఆతృతగా అడిగాడు ఆనంద్.

“ఉప్మా అందరం తిన్నాము అని చెప్పావట? ఆమెతో నీకు టైం ఎప్పుడు దొరికింది మాట్లాడడానికి? అది చెప్పు ముందు.” అన్నాడు వాసు.

వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *