వారసుడు
ఒక్కగానొక్క వారసుడు వాడని అల్లారు ముద్దుగా పెంచాము. అడిగిందల్లా కొనిచ్చాము. నచ్చిన బళ్ళో వేసాము. నచ్చిన కాలేజీలో చేర్పించాము. అప్పటి వరకు చాలా బాగా చదివేవాడు. బాగానే ఉన్నాడు. కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలో కూడా బాగానే చదివాడు. ఇంట్లో చేసిన టిఫిన్ బుద్దిగా తినేసి, లంచ్ బాక్స్ తీసుకుని మరీ వెళ్ళేవాడు. నీట్ గా బట్టలు వేసుకుని బుద్దిగా రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండేవాడు.
అలాంటి వాడి ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. పొద్దున్నే హడావుడిగా లేవడం రకరకాల బట్టలు కొత్తవి కొనడం, ఏ హీరో సినిమా రాగానే ఆ హీరో సినిమాకి మొదటి ఆటకి వెళ్లడం, టిఫిన్, లంచ్ లేకుండా ఇస్తున్నా, పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోవడం చేసేవాడు. సరేలే ఫ్రెండ్స్ ఎక్కువ అయ్యి ఉంటారు. చదువులో మాత్రం బాగానే ఉన్నాడు కదా అనుకున్నాం. మూడో సంవత్సరంలో మెల్లిగా లేట్ గా రావడం, కొద్దిగా తాగి రావడం లాంటివి మాకు అనిపించినా, ఏదో సరదా అనుకున్నాం.
కానీ ఒకానొక రోజు వాడు హడావుడిగా వచ్చి కొన్ని బట్టలు, బ్యాగ్ లో కుక్కుకుని అంతే హడావుడిగా వెళ్ళిపోయాడు. అసలెందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళాడో అర్థంకాలేదు బాగా మాట్లాడేవాడు అసలు మాట్లాడడమే మానేశాడు. ఎక్కడికిరా అని అంటున్నా కూడా వినకుండా హడావుడిగా వెళ్ళడం చూసి కాస్త అనుమానం మొదలైంది. తెల్లారి మూడు గంటలకే ఇంటి తలుపులు డబడబా బాదారు ఎవరో ఈ సమయంలో వచ్చిందేవరో అనుకుంటూ తలుపులు తీసేసరికి పోలీస్ లు, ముచ్చెమటలు పట్టాయి. ఎప్పుడూ దగ్గరగా చూడాలి మాకు అలా పట్టడం సహజమే కదా, అందువల్ల చెమటలు వస్తున్నా ఎం కావాలి అని అడిగాను వాళ్ళు అలా చూసుకుంటూ లోపలికి వచ్చారు.
మీ వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటూ ప్రశ్నించారు. మా వాడు ఎందుకు సార్ అయినా ఏం జరిగింది సార్ అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాను. మీ వాడు ఎంత పెద్ద గాయం చేసాడో మీకు తెలుసా? వాళ్ళ కాలేజీలో ఒక అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ విషయం వివరించాడు. ఏంటి మా వాడు ఒక అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించాడా లేదు సార్ మా వాడు అలాంటివాడు కాదు ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది సార్ అంటూ వేడుకున్నాను. మా ఆవిడ అయితే ఏడుపు ఒకటే తక్కువ లేదు సార్ ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది ఈ ఒక్కసారికి మన్నించండి సార్ అంటూ ప్రాధేయ పడడం మొదలు పెట్టాము.
మా ఇంటి స్థితిగతులు. మేమున్న విధానం చూసిన వారికి ఏమనిపించిందో కానీ మీరు మర్యాదస్తుల్లా కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్పండి వెధవలతో తిరిగితే ఇదిగో ఇలాంటి చిక్కులే వస్తాయి అప్పుడు వారిగా మారిపోతే బాగుంటుంది అంటూ చెప్పి వెళ్ళిపోయారు.
ఆ వెంటనే మా వాడి నుంచి ఫోను వచ్చింది. అమ్మా నేనేం తప్పు చేయలేదు అంటూ, సరే మాకు నిజం తెలిసింది నువ్వు వెంటనే ఇంటికి రా పోలీసులు వచ్చారు విషయం అంతా తెలిసింది నీకు నువ్వుగా మారితే చాలు అన్నారు నువ్వు ఎక్కడ ఉన్నా ఇంటికి వచ్చేయ్ అంటూ చెప్పాము. ఒక గంటలో వాడు తిరిగి ఇంటికి వచ్చాడు.
మాకు మొహాలు చూపించలేక తల దించుకొని నిలబడ్డ వాడిని చూస్తూ నేను, చూడు బాబు మాది చాలా మంచి కుటుంబం చాలా గొప్ప వంశం ఇంతవరకు మేము నలుగురిలో మర్యాదగా బ్రతికాము. కానీ ఇప్పుడు నీవల్ల మా కుటుంభ పరువు పోవడం మాకు ఇష్టం లేదు. ఒక్కగానొక కొడుకు అని అల్లారం ముద్దుగా పెంచడం మా తప్పు. నీకు చెల్లెలు ఉంటే ఆ అమ్మాయి పడే బాధ ఏంటో తెలిసేది. కానీ మేము ఒక్క బిడ్డ చాలు అనుకొని ఇంకో పిల్లని కనలేదు ఇలాంటి ఇంకో వాడు ఎవడో నీ చెల్లిని ఏడిపించేవాడు కావచ్చు అప్పుడు ఒకసారి నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహించుకో….
మా వంశానికి నువ్వే వారసుడివి అనుకున్నాం కానీ ఇకనుంచి మా ఇంటి పేరు నువ్వు వాడకూడదు. నీకు నా ఇంట్లో స్థానం లేదు. ఈ కేస్ అయిపోయింతవరకు మాత్రమే మేము నీకు సపోర్ట్ చేస్తాం. తర్వాత నువ్వు ఎవరో మేమెవరమో… మాకు అసలు పిల్లలే పుట్టలేదు అనుకుంటాం. మహిళలను ఆదర్శంగా దేవతలుగా కొలిచే మన దేశంలో మన వంశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మన ఈ పట్టణంలో జిల్లాలో మన ఇంట్లో నువ్వు ఒక గొంగళి పురుగులా తయారయ్యావు కాబట్టి ఒక ఆడపిల్లని ఏడిపించే వారసుడు నాకు అవసరం లేదు దానికన్నా బిడ్డలు లేని గొడ్రాలుగా ఉండిపోవడం నయం.
నువ్వు పుట్టినప్పుడు ఎంతగా సంతోషించామో ఇప్పుడు ఈ విషయం తెలిసాక అంత కంటే ఎక్కువగా దుఃఖిస్తున్నాం…. అసలు ఎందుకు నిన్ను కన్నాము అని బాధపడేలా చేశావు నువ్వు మా వారసుడివి కాదు ఇక నీకు మాకు ఏ సంబంధం ఉండదు అంటూ చెప్పి ఇద్దరం మా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాము.
ఇంటి వారసుడు అంటే ఇంటి ప్రగతి, వంశం పేరు తెచ్చేలా ఉండాలి తప్ప ఇంటి పరువును తీసేలా వంశాని నాశనం చేసేలా ఉండకూడదు.
– భవ్య చారు