ఉత్తేజిత ఉగాది
వెళ్ళిపోతూ శిశిరం
వసంతానికి అప్పగింతలు చెబుతోంది
ఆశలను పండిస్తావుగా అంటూ
వసంతగాలుల స్వరమాధుర్యాన్ని వెంటబెట్టుకుని
తెలుగు లోగిళ్ళలో ప్రవేశించే ఉగాది
ఈసారి శోభకృతు గా విరియబోతోంది
నిండైన నవ్వుతో దారంతా వేపమాను సంతృప్తిగా దీవిస్తుంటే
గుమ్మానికి పచ్చని తోరణమై విరిసే లేతమామిడి ఆకు సోయగంలా ఉగాది ఊరిస్తోంది
షడ్రుచుల ఉగాది పచ్చడి జీవనమాధుర్యాన్ని వివరిస్తుంటే
ఆదాయ వ్యయాల పట్టికై
పంచాంగ శ్రవణం పాఠాలు నేర్పుతోంది
సంవత్సరాలు గడిచినా
ఋతుశోభ
తరాల వారసత్వమై కొనసాగుతూనే ఉంటుంది
నిన్న నేడు రేపుల సమ్మేళనమై ఉగాది
ప్రకృతి ఉచ్చైస్వరంగా వేడుక చేస్తూనే ఉంటుంది
ఉగాదంటే ఎన్ని అనుభూతుల సంగమం
కోయిల పాట,కవిగొంతుక పోటీపడుతుంటే
కరిగిపోయే కాలం కూడా కాస్త మెత్తబడి చెవి ఒగ్గి వింటుంది
శిశిరం స్తబ్ధతకు వీడుకోలు చెప్పి
ఊరించే ఆశతో
వసంతాన్ని అలంకరించే ఉగాది
ఉత్తేజితంగా పలకరిస్తుంటే
పరవశించి స్వాగతమంటాను
తలవంచి నమస్కరిస్తాను
-సి.యస్.రాంబాబు