ఉత్తరం
ముల్లు పోయే కత్తి వచ్చె ఢాం ఢాం అన్నట్లు పావురాల సందేశాలు,చిలుక సందేశాలు పోయి తపాలా శాఖ వచ్చింది. కొన్నేళ్లు తపాలా పెట్టె రాజ్యమేలింది.
ఉత్తరం కోసం ఎదురు చూపులు, ఉత్తరం వ్రాసేటప్పుడు కవిత్వం, ఉత్తరపు మాటల్లో ప్రేమ,దానిని చూసి కన్నీరునింపుకోవటం, రోజూ తపాలా బంట్రోతు కోసం ఎదురు చూపులు, అతను ఇచ్చిన ఉత్తరాన్ని నేను చదువుతానంటే,నేను చదువుతాను అని పిల్లలమధ్య కొట్లాటలు.
చదువు రాని వారు ఆ ఉత్తరం పుచ్చుకుని మా మాష్టారు దగ్గరకు వచ్చి చదివి సంగతులు చెప్పండయ్యా
అని వ్యాకుల పడటం, క్రొత్తగా పెళ్ళైన వారు ఒకరికొకరు కవర్లు వ్రాసుకోవటం,అందులోనిప్రేమ మాటలకి ఉబ్బితబ్బిబ్బవటం,
ఏమే మీ ఆయన దగ్గర నుండిఉత్తరం వచ్చినట్లుందిగాఏమిటే కబుర్లు అన్న అమ్మతో మెలికలు తిరిగిపోతూ ,ఏమీ లేవమ్మా అని చెప్పిన కూతురు బుగ్గలు పుచ్చుకుని తల్లి ముద్దాడి,
ఆ అన్యోన్యతకు ఆనందపడటం,ఇవన్నీతీయని అనుభూతులు తపాలా శాఖ మనకు అందిoచినవి.
-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి