ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష అంటే ఉప అంటే సగం దీక్ష అంటే దీక్షగా చేసేది. అంటే మనం చేసే ఉపవాస దీక్షను దీక్షగా సంకల్పం చెప్పుకుని చేయాలి. సంకల్పం అంటే మనం ఏ దేవతకు చేస్తున్నామో వారికి తల్లి నా కోరిక ఇది అందుకు నేను ఈ దీక్షను చేస్తున్నాను. నా కోరిక నెరవేర్చు అంటూ చేయాలి. ఇక ఇలా దీక్ష చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల ఉన్న మలినం అంతా చెమట రూపంలో పోయి శరీరం, ఆత్మ శుద్ది అవుతుంది. ఇది మామూలు భక్తులకు ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వారికి.

మరి పేదల మాటేమిటి?

రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో సగం రోజు లేదా ఒక రోజు అంత కూడా అసలేమీ తినకుండా పస్తులు ఉంటున్న ఆ పేదల కోరికలను భగవంతుడు తీరుస్తాడా? తిర్చడా? తీరిస్తే మరి వారింకా పేదలుగా ఎందుకు ఉన్నారు? ఒక్క పూట దీక్ష చేస్తేనే కోరికలు తీర్చే దేవుడు కొన్ని రోజులుగా పస్తులు ఉన్న పేదవారి కోరికలు ఎందుకు తీర్చడు?

సమాధానం లేని ప్రశ్నే అయినా వీర భక్తులకు ఒక ప్రశ్న ప్రతి పండక్కీ అభిషేకాలు, అర్చనలు చేస్తూ విగ్రహాలపై పాలు, పెరుగు, తేనె నెయ్యి అంటూ పంచామృతాలు పోసి తమ భక్తిని తామే గొప్ప భక్తులం అన్నట్టుగా భావించే వారు అదే గుడి బయట ఉన్న పేద వారికి ఎందుకు దానం చేయరు. అవే పాలు పెరుగు వారికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అని ఎందుకు ఆలోచించరు.

ఇక మరొక భక్తులు వీరు దేవుణ్ణి అమితంగా ఇష్టపడతారు దీక్ష పేరుతో పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా రోజులు నెలలు ఉపవాసాలు ఉంటారు. అది తమ భక్తి అని నలుగురికి తెలియాలి అని గొప్పగా చాటుకుంటారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

చివరగా నేనూ దేవుణ్ణి నమ్ముతాను. అంటే మనల్ని ఏదో శక్తి నడిపిస్తోందని అనుకుంటాను. ఇది వరకు నేను సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం సుబ్రమణ్యస్వామి, గురువారం రాఘవేంద్ర స్వామి, శుక్రవారం సంతోషిమాత, శనివారం వేంకటేశ్వరుడు అంటూ ఉపవాసాలు ఉండి, ఒక్క ఆదివారం మాత్రమే తినేదాన్ని.

కానీ రానూ రానూ అర్థం అయ్యింది ఏంటంటే మన సంకల్పం గొప్పది అయితే తిన్నా తినకపోయినా ఆ పంచభూతాలు మనకు తోడుగా ఉంటాయి అని. తినకుండా ఏ దేవుడు ఉపవాసం చేయమని చెప్పలేదు. అదొక నమ్మకం అంతే నేను దానికి అతీతురాలిని కాదు. కానీ మార్పు కూడా సహజం. మనం నిజాన్ని గ్రహించాలి. కడుపులు మాడ్చుకొని ప్రాణాల పైకి తెచ్చుకునే బదులు దేవుడా నువ్వే దిక్కు అని ఒక్క నమస్కారం పెట్టుకుంటే ఆ దేవుడు కరుణించడా చెప్పండి. మనసులో భక్తి ఉండాలి కానీ అతి భక్తి ఉండకూడదు. అనేది నా అభిప్రాయం. నా రచన కొందరికి కోపాన్ని తెప్పించవచ్చు కానీ నిజాన్ని గ్రహిస్తే అర్దం అవుతుంది..

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *