ఉదయాలు
జననం మరణం
మధ్య జరిగేదే జీవితమన్నాడో కవి
రెప్పపాటు క్షణం మహాగడుసరి
పడేస్తుంది
పైకిలేపుతుంది!
రేపటి బెంగలో భయముంటుంది
వర్తమానం నీడలో చల్లదనముంటుంది
చికాకుల వడగాలులు తాత్కాలికమే
శిశిరం వెనకే చివురించే వసంతమున్నట్టు
వర్తమానంలోనే చవులూరించే క్షణాలుంటాయి
కాస్త ఓడిసిపట్టవోయంటూ ఉదయాలు భుజం తడుతుంటాయి
కొంచెం భుజం తడుముకోక తప్పదు
నువ్వయినా, నేనయినా
– సి.యస్.రాంబాబు