తీపి జ్ఞాపకo
మధురమైన పిలుపు నాని అంటూ, అలానన్ను పిలిచేది నాన్నమ్మ ఒక్కరే, నాన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం,నాన్నకు అమ్మ అయినందుకు కాదు.నాకు అమ్మై నన్ను ప్రేమగా చూసుకున్నందుకి కాదు,మరెందుకు నాకు నానమ్మ అంటే ఎక్కువ ఇష్టం అంటే నేనంటే నాన్నమ్మ కు అసలు ఇష్టం ఉండేది కాదు,తొలిచూలు ఆడపిల్ల గా పుట్టినందుకు,నాని అని ప్రేమగా పిలిచేది అంటే నాశనమవ్వు అని ఎప్పుడూ దీవించేది, అందుకే నాని అనేది అయినా నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నన్ను దగ్గరికి రానివ్వకపోయినా, నాతో సరిగా మాట్లాడకపోయినా మా బాబాయి పిల్లలతో సరదాగా గడిపేది వారికి ఎన్నెన్నో కథలు చెప్పేది. వారితో పాటు నేను ఆ కథలను వింటూ సంతోషించేదాన్ని, వారికి వెన్నెల్లో ఆవకాయ అన్నం ముద్దలు కలిపి పెడుతూ కథలు చెప్తుంటే ఒంటరిగా నాకు నేనుగా ఆవకాయ అన్నం తింటూ ఆ కథలన్నీ వినేదాన్ని, అవన్నీ నా ఊహల్లో నేను ఊహించుకుంటూ రాత్రి కలలు కంటూ నిద్రపోయేదాన్ని, నానమ్మ చెప్పే కథలు ఒక్కో కథ ఎన్నో రోజులు సాగేది. మహారాజు కథలు బూచాడు కథలు విక్రమార్కుని కథలు ఇలా ఎన్నో చెప్తూ మధ్యలో ఆపేసి ఊరింస్తూ ఉండేది. అన్నన్ని కథలు విన్న నానమ్మ చేతి గోరుముద్దలు తిన్నా కూడా బాబాయి పిల్లలు పెద్దయ్యాక ఆమె దగ్గరికి రావడం మానేశారు. నానమ్మ వయసు అయిపోయి మంచాన ఉన్నప్పుడు సేవలు చేయడానికి ఎవరూ రాలేదు. అప్పుడు నేనే వెళ్లి తనకు సేవలు చేశాను. అప్పుడు నాని అంటూ నానమ్మ పిలిచిన పిలుపు ఇప్పటికీ ఒక తీయని జ్ఞాపకంలా మిగిలిపోయింది.
.
-భవ్యచారు