తిమిరంతో సమరం
గర్భ స్థావరంలోని కటిక చీకట్లో అండము నుంచి పిండముగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ తాను యాతన పడుతూ తనను మోసేవారికి వేదనను కలిగిస్తూ ఒకరోజు మావి అనే చీకట్లను ఛేదించుకొని విశ్వంలోని వెలుగు కిరణాలను ఆస్వాదించాక ఆజన్మాంతం అవే కావాలని అవే ఉంటాయి అని భ్రమలో కొట్టుకుపోతాడు మనిషి. అది మానవజన్మ నైజం కూడా..
చీకటి స్థావరంగా ఊపిరి పోసుకున్న ప్రాణి విశ్వ దర్శనం కాగానే వన్నె చిన్నెల వెలుగు జిలుగులను ఆనందానికి, అభివృద్ధికి సంకేతంగా అదే జీవిత గమ్యంగా భావిస్తాడు. వెలుగును అంతగా ప్రశంసించడానికి కారణం మనం చూడడానికి ఉపయోగించే కళ్ళగుణం అలా ఉంది కాబట్టి.
కానీ నిరంతరం ఉండేది చీకటి మాత్రమే.. వెలుగు అనేది ఒక తాత్కాలికమైన సంఘటనే అవుతుంది. ఈ వెలుగుకు మూలం ఏదైనా సరే కాలంతోపాటు కరిగిపోవాల్సిందే. వెలుగు శాశ్వతమైనది కాదు. అది ఒక పరిమితమైన తాత్కాలికమైన ఘటన. వాస్తవానికి వెలుగు కంటే చీకటిలోనే ఒక గొప్ప సాధికారికత దాగుంది. చీకటి మాత్రమే అంతర్గతంగా ఉన్న సామర్థ్యాలను అభివ్యక్తీకరించేలా చేయగలదు. నిగూఢమైన జీవిత సత్యాలను అవగతంలోకి తీసుకురాగలదు.
ప్రతి జీవి పుట్టుక నుంచి మరణం వరకు తిమిరంతో సమరం సాధించాల్సిందే…
గర్భస్థ చీకట్ల నుంచి మొదలై ప్రాణం అనంత వాయువుల్లోని అంధకారంలో కలిసిపోయే వరకు అంతా చీకటే.. అందుకే చీకటే సత్యం. అదే నిత్యం…
– మామిడాల శైలజ