తీరం
శిశిరమైతేనేమి
ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి
విప్పుకునే జ్ఞాపకాల వెనకే
తప్పుకునే వ్యాపకాలుంటాయి
తలపులను తడుముతుంటే
మనసు తలుపులు తెరచి
స్వాగతగీతాన్ని పాడుతుంది
గతుకుల గతాన్ని పూడ్చమంటుంది
పరుగులు తీసే కాలం కరవాలం
కనుగొనాలని తాపత్రయపడతాం
వేటుపడక మానదుకదా
కాలంతో వేరుపడే ఆలోచనెందుకు
మట్టిపరిమళం చుట్టేయాలంటే
మట్టితో మమేకమవ్వాలిగా
మమతలన్ని పెనవేస్తేనే
మనుషులంతా అర్థమయ్యేది
సుఖదుఖాలు రాగద్వేషాల
వలయంలో శ్రుతిలయలు
స్థిరంగా తిష్ఠవేసుకుంటే
చీకట్లనుమోసే జీవితం తీరమెన్నడు చేరెనో !
– సి.యస్.రాంబాబు
బాగుంది మాష్టారూ