టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ

టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ

నేను ఎదురుచూస్తున్న తన కోసం.. బస్ రానే వచ్చింది.. తనకోసం ఎక్కువ ఎదురుచూడలేకపోయాను.. బస్ దగ్గరకి వెళ్ళి నిల్చున్న.. అందరూ బస్ దిగుతున్నారు.. అందులో మా వాసు సర్ కూడా ఉన్నారు.. తెలుగు పండితులు.. పాఠాలని కథలులా మాకు చెప్పి నాకు తెలుగు పైన అంత మమకారం పెంచారు… ఈరోజు నేను ఇన్ని కథలు, కవితలు రాస్తున్నా అంటే దానికి కారణం మా గురువు గారు మా వాసు సర్..

అలా అందరూ బస్ దిగారు ఒక్క మానస తప్ప..

బాధ వేసింది… ఎంత ఎదురు చూసాను తనని చూడాలని.. కానీ ఇలా నిరాశే మిగులుతుంది అనుకోలేదు… దిగాలుగా క్లాస్ రూమ్ కి వెళ్లి నా బ్యాగ్ అక్కడ పడేసి… యధావిధిగా అసెంబ్లీకి మైక్ సెట్ సిద్ధం చేద్దాం అని స్టేజి పైన ఉన్న… నా చూపులు ఎప్పుడు తనని వెతుకుతూ ఉంటాయి.. తన ఊపిరిని నేను పసిగట్టగలను.. ఎంత దూరం ఉన్న తన నవ్వు నాకు వినిపిస్తుంది.. స్టేజి మీద ఉన్న నాకు మెరుపొచ్చి తాకినట్టు తన రాకని నేను పసిగట్టాను…

వాళ్ళ నాన్నగారి స్కూటర్ మీద వచ్చింది ఆరోజు.. వెంటనే వెళ్లి మాట్లాడాలి అనుకున్నా.. కానీ వాళ్ళ నాన్నగారు వెళ్లేంత వరకు ఆగి…

“హాయ్, ఎలా ఉన్నావ్?? ఎంత మిస్ అయ్యానో నిన్ను తెలుసా??” అన్నట్టు ఉన్నాయి నా సైగలు తనకి..

ఐనా చూసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది తన క్లాస్ కి.. మొఖంలో కనీశం పలకరిద్దాం అన్న ఆలోచన కూడా తనకి వున్నట్టు నాకు అనిపించలేదు.. ఇంత ఎదురుచూపుకి నాకు జరిగిన అనుభవం అది.. అసెంబ్లీలో ఐ కాంటాక్ట్ కూడా లేదు.. ఏంటి ఈ మార్పు.. నాకు అడగాలి అనిపించింది..

ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు మొగుతుందో అని ఎదురుచూసా చాలా.. మోగిందో లేదో తన క్లాస్ దగ్గరకి చేరుకున్న.. వెతుకుతున్నాను.. కానీ కనిపించట్లేదు.. అడిగితే ‘ముట్టుకున్నాట’ ఆడుతుంది అని చెప్పారు తన స్నేహితులు… చిన్న పిల్ల కదా నాకన్నా అందులో ఆడపిల్ల… స్కూల్ లో ఇంకేం ఆడతారు వీళ్ళు.. ఇవి తప్ప.. అనుకుని వెతికాను…

ఇంతలో తనే ప్రత్యక్షమైంది నా ముందు.. “హేయ్!! కదలొద్దు.. అలానే నిల్చో” అంటూ నా షర్ట్ కాలర్ ని పట్టుకుని నా కాళ్ళ పైన నిల్చుని ఎవరికి కనపడకుండా నన్ను తనని దాచేయమంది.. అక్కడ కదా నాకు ఊపిరి ఆడలేదు… మౌనంతో పోరాడను ఆరోజు.. మాటలు ఇంకేం వస్తాయి తను అంత దగ్గరగా నన్ను అల్లెస్తే…

బ్రేక్ పూర్తయ్యి ఎవరి తరగతి గదికి వాళ్ళు వెళ్ళిపోయాము..

లంచ్ టైం లో కలిసినప్పుడు అడిగాను.. ఎందుకు పొద్దున్న చూసిచూడనట్టు వెళ్లిపోయావ్ అని..”మా నాన్నగారు అక్కడే వున్నారు.. చూస్తున్నారు.. నువ్వేమో నోరు తెరచి కప్పలా హాయ్ అంటున్నావ్.. నాకు భయం వేసింది.. అందుకే నిన్ను పలకరించలేదు అని చెప్పింది ఆరోజు.. ఆరోజు నుంచి మళ్ళీ తనకోసం ప్రేమ గేట్లు తెరుచుకున్నాయి.. వరదల పారుతుంది నా ప్రేమ…

“మీకనిపించిందా ఇలా??? రోజు మీకు నచ్చిన అమ్మాయితో గడిపిన క్షణాలు తలచుకుని నవ్వుకోవడం.. రాత్రైతే సరిగ్గా నిద్ర పట్టకపోవడం.. తనకోసమే ఆలోచించడం ఏం చేస్తున్నా…” నాకు అనిపించింది…తన నవ్వు.. తన చూపులు.. తను నాతో మాట్లాడుతున్నప్పుడు కలిగే ఆనందం ఇవన్నీ ఈరోజుకి నాకు తియ్యని జ్ఞాపకాలే..

రోజు పొద్దున తను నాకు ఇచ్చే హైఫైతో మొదలవుతుంది నా రోజు.. ప్రేయర్ టైంలో తనతో వుండే ఐ కాంటాక్ట్, నేనే వేసే కుళ్లు జోకులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు తన నవ్వు…ఇద్దరం కలిసే రెగులర్ స్పాట్ … తిరిగి తను ఇంటికి వెళ్తున్నప్పడు తనని జాగ్రత్తగా బస్ ఎక్కించడం.. తనకి సీట్ ఇప్పించాలని నా తపన.. ఇవన్నీ చూసి ఎవరి దిష్టి పడిందో తనని నన్ను కొన్ని రోజులు వేరు చేసాయి…

అర్ధం కాలేదు.. స్కూల్ అంత ఒకటే టాపిక్ తనకి నాకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని.. ఏం చెప్పినా అర్ధం కావడం లేదు వాళ్ళకి.. మా ఇద్దరి మధ్యలో గోడ కట్టేశారు.. తను నాతో మాట్లాడటం మానేసింది… రోజూ ఎదురుచూసే నా చేయి తన హైఫై కోసం మూగబోయింది కొన్ని రోజులు.. నేను ఎదురుపడితే తల తిప్పుకోవడం.. మాట్లాడాలని ప్రయత్నిస్తే తప్పించుకోవడం ఏదో ఒక కారణం చెప్పి… ఇలా నన్ను పూర్తిగా అవాయిడ్ చేసింది..

నాకు కోపం వచ్చింది..ఎంత చెప్పినా వినకపోతే.. నేను మాత్రం ఏం చెయ్యాలి.. అసలే 10థ్ క్లాస్.. అశ్రద్ధ వహిస్తున్నా అన్న అనుమానం కలిగింది.. అన్ని పక్కన పెట్టి చదవడం మొదలుపెట్టాను.. ప్రేయర్ టైంలో ఐ కాంటాక్ట్ ఇవ్వడం కూడా మానేశా.. కాకపోతే ఈ క్రమంలో అందరితో ఇలానే ప్రవర్తించేవాడ్ని… చాలా మంది నన్ను తిట్టే వారు కారణం చెప్పమని.. టీచర్ లతో సహా..

వనిత సిస్టర్ నాకు మునుపటిలా హుషారుగా ఉండమని చాలానే ప్రయత్నం చేశారు.. మరి తనకి ఎలా తెలిసిందో తెలీదు, ఏ కాకి కబురు తనకి అందిందో.. పిలుపు వచ్చింది తన నుంచి.. స్కూల్ కి అటువైపు హాస్టల్ ఉంటుంది.. అక్కడికి రమ్మని

ఎంత ఆటిట్యూడ్ చూపిద్దాం అనుకున్నాను.. నేనే కాదు ప్రతి అబ్బాయి అలానే అనుకుంటాడు.. కానీ మనం వెన్నపూస, అమ్మాయిలు అగ్గి మనల్ని కరిగించేస్తారు… పిలుపు వచ్చిందో లేదో తనకోసం వెళ్లి అక్కడ నిల్చున్న. ఎదురుచూస్తున్న తనకోసం.. ఏం మాట్లాడాలి.. ఎన్ని రోజులు తరువాత కలవబోతున్నాం.. ఇలా ఆలోచిస్తూ అక్కడ నిల్చున్న..

తను రావట్లేదు ఎంతకీ.. మెల్లగా కోపం వస్తుంది.. తను కనిపించింది ఇంతలో తన స్నేహితులతో అటు వైపుగా వెళ్తూ… నన్ను చూసింది.. .నా కళ్ళు ఒక పక్క కోపం తో, మరో పక్క బాధ తో ఎర్రబడ్డాయి.. లంచ్ టైం పూర్తయ్యింది అప్పుడే.. నలబై నిమిషాలు సరిగ్గా తిండి కూడా తినకుండా ఆరోజు తనకోసం ఎదురు చూసాను.. కానీ తను రాలేదు…

బాధ తో క్లాస్ కి వచ్చేసాను. విషయం తెలిసిన వాళ్ళు నచ్చజెప్పారు.. కొందరు ఎగతాళి చేసారు.. అన్ని భరించాను… కొన్ని రోజులు తను కనపడితే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకున్నా.. తన ఆలోచనలని చంపేసుకున్నా.. ఆ క్రమంలో చాలా మంది దగ్గరయ్యారు కూడా.. ఇక ఇలానే కొనసాగిపోవాలి అనుకున్నా.. విధి విచిత్రమైనది జనులారా!!! ఆరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు.. స్కూల్ కి సెలవు ఇచ్చి అందరి విద్యార్థులుని త్వరగా ఇంటికి పంపించాలని నాతో కబురు పంపించారు..

అలా నేను అన్ని తరగతి గదులకి తిరిగి సందేశం ఇచ్చాను.. బస్ లోకి చిన్నపిల్లల్ని ఎక్కిస్తూ సాయం చేస్తున్నా…

అప్పుడు చేయి పడింది నా భుజం మీద.. ఎవరు అని వెనక్కి తిరిగాను.. “సారి!!” అంటూ తను చెప్పి బస్ ఎక్కింది.. నాకు మాటలు లేవు ఇంకా… కలా!! నిజమా!!! అన్నట్టే వున్నాను నేను.. బస్ కదిలింది.. నవ్వుతూ బై చెప్పింది.. నేను ఆశ్చర్యం లొనే చేతిని ఊపాను…

అప్పటివరకు నవ్వుని కమ్మేసిన మబ్బులు వదిలిపెట్టాయి నన్ను.. అప్పుడే డిసైడ్ అయ్యాను.. ఇక్కడ ఇదే ఊర్లో వుంటే పని కాదు.. స్కూల్ లో కలవలేను, మాట్లాడలేను.. ట్యూషన్ పేరు చెప్పి దూరం వున్నా పర్లేదు తనని కలవాలి అని అక్కడ చేరాను.. రోజు స్కూల్ అవ్వగానే త్వరగా తయారయ్యి అక్కడ తనని చూసేవాడ్ని..

కానీ నేను గమనించనే లేదు.. స్కూల్ లో టీచర్లు వుంటే, అక్కడ వాళ్ళ పేరెంట్స్ వుండేవారు.. పోనీలే ఏదైనా అవకాశం దొరుకుతుంది అనుకుని రోజు తనకోసం తిరిగే వాడ్ని అక్కడే… చలికాలం అది.. రాత్రి అదే ట్యూషన్ లో పడుకునే వాళ్ళం నేను నా స్నేహితులు.. తను అదే వీధిలో వేరే ట్యూషన్ లో చదివేది…

పొద్దున్నే మంచు పూర్తిగా ఇంకా వదిలేది కాదు.. తను ట్యూషన్ కోసం ఆ చలిలో చిన్న గౌనులో, ఒక స్వేటెర్ వేసుకుని వస్తుంటే తన వెంటపడేవాడ్ని.. తను నవ్వుతూ నడుస్తుంటే తన ముందు నేను నడుస్తూ తననే చూసే వాడ్ని.. సిగ్గుతో నన్ను తోసి ట్యూషన్ లోపలికి పరిగెత్తేది… తిరిగి మళ్ళీ ట్యూషన్ కి వచ్చి నాలో నేనే మురిసిపోయేవాడ్ని…

అలా ఇదే విధంగా కొన్నాళ్ళు గడిచింది.. అప్పటికే నా పరీక్షలు దగ్గరకి వచ్చేసాయి.. దృష్టి కొంచెం అక్కడినుంచి మలిచాను. చదువు మీద శ్రద్ధ పెట్టాను… అడగాలని అనిపించేది చాలా సార్లు తనని… “నేనంటే ఇష్టమా” అని…

ఎందుకు అంటే తను అంటే నాకు ఇష్టం అని వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్ప నేను ఎప్పుడు తనతో చెప్పలేదు.. అడగాలని అనిపించింది.. పరీక్షలు అయిపోయాయి… తనకోసం అదే ట్యూషన్ దగ్గర ఎదురు చూస్తున్న.. ఎలా ఐనా నా ప్రేమ విషయం చెప్పాలని… ఎలా స్టార్ట్ చెయ్యాలి… ఏం చెప్తుంది తిరిగి.. ఇలా ఆలోచిస్తూ వున్నాను.. నా ఫ్రెండ్ ఆశిష్ ని ధైర్యం కోసం తోడు తీసుకు వెళ్ళాను..

రానే వచ్చింది అటు నుంచి.. ఎగ్జామ్స్ ఎలా రాసావు?? అని అడిగింది.. మునుపటిలా తన కళ్ళలో నేను కనపడితే వచ్చే ఆ మెరుపు కనిపించట్లేదు… ఏదో సాదారణ వ్యక్తి లా నన్ను చూస్తుంది.. ఐనా చెప్పాలని వచ్చాను.. చెప్పే వెళ్ళాలి అని మనసులో మాటని తనతో చెప్పేసాను.. కానీ తన మౌనం నేనంటే తనకి ఆ భావన లేదనే అర్ధం అయ్యింది.. తనని ఎక్కువ విసిగించాలని నాకు అనిపించలేదు.. తనకి దారిని ఇచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి..

ఫస్ట్ లవ్ సక్సెస్ అవ్వాలని లేదు.. ఇలా ఒక మంచి జ్ఞాపకంగా కూడా మిగిలిపోవచ్చు.. తరువాత తనతో మాట్లాడటానికి చాలా సార్లు ప్రయత్నించా.. వెతికాను తనకోసం ఎక్కడుందో ఏం చేస్తోందో అని.. నేను నెవెర్ గివప్ తనమీద ఎప్పుడు కూడా… అలా తనని విడిచిపెట్టని గమ్ లా ఎప్పుడు హత్తుకునే వున్నాను.. ఇప్పటికి కూడా.. ఇది చదివినప్పుడు ఎంత నవ్వుకుంటుందో

అలా నా ప్రేమ పరిచయమై కొన్నాళ్ళు నాతో స్నేహంగా వుండి.. తరువాత దూరం అయ్యి మళ్ళీ దగ్గరయ్యి ఇప్పటికి నాతోనే వుంది… మీకు ఉంటాయి కదా!!! ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ అలా గుర్తు చేసుకోండి.. నాలా చెప్పమని కాదు కాని… గుర్తు చేసుకోండి

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *