తెగువ చూపవే మగువ
ఇంటా బయటా ఒకటే రోత
పసి పాపంటూ ముసలమ్మంటూ
తేడా చూడక, మదమెక్కిన
కామపిసాసుల కర్కశ కోరిక
కాటేస్తుంటే, విషాన్ని మొత్తం
మగువల బతుకున ఒంపేస్తుంటే
బలి అవుతున్న ప్రాణాలెన్నో…
చుట్టం పేరుతో ముచ్చట ముసుగులో
లోకం ఎరుగని చిన్న పిల్లలనీ
తప్పుడు చూపుతో చూసేదోకడు…
గురువు పేరుతో చదువు వంకతో
చేతులు నలిపే నికృష్టుడొకడు…
కళాశాలలో ప్రేమ పేరుతో
యాసిడ్ దాడితో మాయని మచ్చను
మనసులో ముద్రించేదొకడు…
పెళ్ళి పేరుతో బాధ్యత వలలో
ఊపిరికి ఉరి బింగించే
మహానుభావుడు ఒకడు…
క్షణ క్షణము రణము
అడుగడగు భయము
మనసే అయ్యెను శవము
పిరికితనంతో వెర్రి భయంతో
భాదని భరిస్తే,అన్యాయాన్ని సహిస్తే
మారదు లోకం, ఆగదు శోకం
ఉప్పెన నీవై ఉరకలు తియ్
నిప్పులు చిమ్ముతు మసిచేసెయ్
కంటి చూపుతో కత్తై పొడిచెయ్
నీచులందరిని నిలువునా పాతెయ్
– రమ్య పాలెపు