తీపి కోసం తపించు
హాయిగా కంటికి, పంటికి నచ్చింది తింటూ, తాగుతూ ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్న నరేందర్ కు గత కొన్ని రోజులుగా నీరసంగా, అలసటగా ఉంటోంది.
తిండి తక్కువయిందని ఇంకా బలమైన ఆహారం తింటున్నా కూడా లేవగానే నీరసంగా ఉండటం కొంచం పని చేయగానే అలసిపోవడం జరుగుతుంది.
ఎందుకిలా జరుగుతోంది అనుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక ఆర్ఎంపీ (RMP) డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. అతను చూసి, లక్షణాలన్నీ విని, బలానికి టానిక్ ఇచ్చి, ఇంకా కొన్ని సూదులు గుచ్చాడు.
అవి తీసుకున్న తర్వాత నరేందర్ కి కొంచం నయం అనిపించింది. మామూలుగా పనిలోకి వెళ్తున్నాడు. కూర్చుని చేసే ఉద్యోగం కాబట్టి ఎక్కువ సమయం కూర్చోవడం చేస్తున్నాడు. కొన్ని రోజులు బాగానే అనిపించింది.
తర్వాత మెళ్లిగా మొదలైంది. తల తిరగడం, చెమటలు రావడం, నీరసం ఎక్కువ కావడం జరగడం అలా ఒక రోజు ఆఫీస్ నుండి బయటకు వస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు.
ఆఫీస్ వాళ్లు చూసి పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పటల్ లో అడ్మిట్ చేశారు. ఆ వెంటేనే నరేందర్ భార్య లత కు ఫోన్ చేసి చెప్పడంతో ఆవిడ ఏడుస్తూ వచ్చింది. ఆఫీస్ వాళ్లు ఆమెను ఓదార్చి ఏం కాదని ధైర్యం చెప్పారు.
డాక్టర్ గారు అన్ని టెస్ట్ లు చేయించి రాత్రి యెనిమిది గంటలకు చావు కబురు చల్లగా చెప్పినట్టు మీ వారికి షుగర్ వచ్చింది అందువల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పాడు.
ఆ మాట వినగానే ఓరి దేవుడో ఎవరికీ లేని నాకు ఎక్కడ వచ్చింది అని మనసులో ఏడుస్తూ ఆ డాక్టర్ వేసిన ఫీజు ఏడవలేక నవ్వుతూ కట్టేసి భార్యతో నీరసంగా ఇంటికి బయలుదేరాడు.
వెళ్లేముందు డాక్టర్ గారు కొన్ని చిట్కాలు చెప్పారు. చూడండి నరేందర్ గారు, ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్లు ముట్టుకోకూడదు, అన్నం చాలా తగ్గించాలి, కొర్రలు, సామలు, రాగులు వంటి వాటిని తింటూ ఉండాలి మీరు నోరు ఎంత కట్టేసుకుంటేఅంత మంచిది.
ప్రతినెలా వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉండండి అంటూ నవ్వుతూ చెప్పాడు.
ఓరి నీ జిమ్మడి పోను నన్ను అన్ని మానేసి గడ్డితిను అంటావ్ ఏంట్రా అది కూడా నవ్వుతూ చెప్తావు అంటూ మనసులోనే తిట్టుకున్నాడు డాక్టర్ ని నరేందర్.
ఆఫీసులోని కొలీగ్స్ అందరూ నరేందర్ వైపు జాలిగా చూడడం మొదలుపెట్టారు. ఆ జాలి చూపులు తప్పించుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పి భార్యతో పాటు ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళగానే భార్య నస మొదలయింది. చూశారా, చూశారా నన్ను రాచి రంపాన పెడుతూ రకరకాలుగా ఓడించుకొని తిన్నారు.
దేవుడు ఎక్కడ ఉండడు ఇదిగో ఇలాగే చూపిస్తాడని ఊరికే అనలేదు. నన్ను హింసించిన మీకు తగిన శాస్తి జరిగింది అంది భార్య.
సర్లేవే ఆపు ఇక నీకు చేసే బాధ తప్పింది కదా అన్నాడు నరేందర్ చాలా నీరసంగా… అతడిని అలా చూడగానే భార్యకి పాపం అనిపించింది.
తాను ఎందుకు నోరు జారానో అని బాధపడి అయ్యో అదేం లేదండి ఏదో కోపంలో అనేసాను మీరేమీ పట్టించుకోకండి ఇప్పటినుంచి మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను అని అంది లత ప్రేమగా…
అవునా అయితే వెంటనే షాప్ కి వెళ్లి కొర్రలు తీసుకు వచ్చేసేయ్, దాంట్లో బెల్లం వేసి మంచిగా పాయసం చెయ్ అన్నాడు నరేందర్.
నీ మొహం మండ అసలే డాక్టర్ తీపి వద్దంటే మళ్ళీ బెల్లం పాయసం అంటారు అవన్నీ ఏమి కుదరదు గానీ నాలుగు చపాతీలు చేసి ఇస్తాను తినండి అంటూ త్వరత్వరగా నాలుగు చపాతీలు చేసి ఇచ్చింది భార్యామణి.
రోజూ ఏదో వెరైటీ తినే నరేందర్ కు ఆ నాలుగు చపాతీలు ఏ మూలకి సరిపోలేదు. అయినా ఎలాగో మింగేసి నిద్రకి ఉపక్రమించాడు.
డాక్టరు ఇచ్చిన ఇంజక్షన్ వల్లనో ఏమో గాని నిద్ర బాగానే పట్టింది కాకపోతే సరిగ్గా రెండు గంటలకి మెలకువ వచ్చింది.
కడుపులో పిసుకుతున్నట్లుగా, గోకు తున్నట్టుగా అనిపించసాగింది. ఇక అది భరించలేక మెల్లిగా వంట గదిలోకి వెళ్ళాడు. అన్ని గిన్నెలు మూత తీసి చూశాడు మిగిలిన అన్నం పప్పు కనిపించాయి.
వెంటనే కంచంలో ఇంత అన్నం పప్పు వేసుకుని కలుపుకుని నోట్లో పెట్టుకోబోయాడు. అప్పుడే సడన్ గా వచ్చి అతడి చేయి ని ఆపేసింది.
ఏంటండీ మీరు నా తాళిని పుటుక్కున తెంచేయాలని చూస్తున్నారా ఏంటి? చాలు అక్కడ పెట్టండి అంటూ కంచం తో పాటు మీ చేతిలో ఉన్న ముద్దని కూడా లాగేసి సింకులో వేసి నీళ్ళు పోసి వేసింది.
నరేందర్ బిత్తరపోయాడు. నోటి కాడ కూడు లాగేసినట్టు జాలీగా ముఖం పెట్టాడు మీరు ఎంత జాలిగా చూసినా ఇకనుంచి మీరు అన్నం ముట్టేది లేదు అంటూ అతన్ని వంటింట్లో నుంచి ముందుకు తోసేసి పక్కనే ఉన్న తాళం కప్పు అందుకొని వంట గదికి తాళం వేసి తాళంచెవిని తన కొంగున కట్టేసుకుంది.
నరేందర్ ఇక ఏమీ చేయలేక బెడ్ రూం లోకి వచ్చి నిండా కప్పుకుని పడుకున్నాడు. అడ్డమైన గడ్డి కనిపించిందల్లా నోట్లో వేసుకోవడం వల్ల షుగర్ ని తిట్టిన తిట్టుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోయాడు నరేందర్.
ఆ తర్వాత లత నరేందర్ ని ఏ విధంగా హింసలు పెట్టింది? ఇంతకీ అతని ఆకలి తీరిందా లేదా అనేది మనం రెండోభాగంలో తెలుసుకుందాం….
– భవ్యచారు