తప్పిపోయిన ఆకాశం
ఏదో ఆలోచనలో మునిగి ఉన్నపుడు
ఆకాశం నా మీంచి పరిగెత్తుకుని పోతుంది
తేరుకుని చూసేసరికి
నా నెత్తి మీద చీకటిలా పరుచుకుని ఉంటుంది
పెదవుల మీద పరుచుకున్న వెలుతురు
ఆ చీకట్లోకి జారుకోనివ్వకుండా
నవ్వులా సాగదీసి ఉంచినపుడు..
ముందుకి జారిన అడుగు
చేజారిన ఆకాశాన్ని వెతుకుతూ
మనసులో వెడల్పాటి గాయాన్ని
కలగా తెస్తుంది
రోజుకో ప్రశ్న వేసే
ఆకాశం నీ నుండి పారిపోయిందని సంబరపడకు
అది ఎక్కడో దాగుని ఉంటుంది నీలోనే
జీవిత క్షణాలు విచ్ఛిన్నమై
మరో జీవితంలోకి వలస పోతున్నపుడు కూడా
నువ్వు తప్పిపోయిన ఆకాశాన్నే వెతుకుతావు
నువ్వే ఆకాశం అని ఎప్పటికీ తెలుసుకోవు..
-గురువర్ధన్ రెడ్డి