తను నవ్వింది
హైదరాబాద్:
పాతబస్తీ …ఎప్పటిలాగే రద్దీగా ఉంది…..వచ్చిపోయే జనాలతో…. ఏ ఒక్కరైనా రాకపోరు …అని చూస్తున్నాడు అతను…. చిన్న చెక్కపెట్టే….నీడనిచ్చే చిల్లుల గొడుగు అతని వారసత్వపు ఆస్తి…..
భయ్యా …ఈ బ్యాగ్ కాస్త కుట్టిపెట్టు …మేం షాపింగ్ చేసి వస్తాం అన్నది…వచ్చిన ఇద్దరిలో ఒక అమ్మాయి….
అలాగేనమ్మ …మీరెళ్ళిరండి…నేనిక్కడే ఉంటా….అన్నాడు సైదులు
26 ఏళ్ల వయస్సు …బలిష్టంగా ఉన్న శరీరం చూస్తే…ఒక్కమాటు పోలీస్ లాగా కనిపిస్తాడు ….ఏపుగా పెరిగిన గడ్డం…. పిచ్చుక గూడు లాంటి జుట్టు….వెనక్కి తోస్తూ…ఒక గొడుగు కింద కూచొని చెప్పులు కొట్టుకుంటూ బతుకుతున్నాడు….
ఉండేది మురికివాడలో ….తనని చేరదీసిన అవ్వ తాత లతో..వారి రేకుల షెడ్డులోనే ఉంటున్నాడు….
తన పుట్టుకకి కారణం ఆడ మగ అని మాత్రమే తెలుసు….పుట్టి బుద్ధేరిగాక….తను పడుకునేది రోడ్డు పైన …తినేది పెంటకుప్పలలో …దొరికిందే విందుభోజనం…తన లాంటి వాళ్ళు ఎంత మందో….అక్కడ….
పెళ్లిళ్లు …ఫంక్షన్లు…చివరికి చావు భోజనాలకు పిలవని అతిథులుగా వెళ్ళి దొరికింది తినడం తనకి ఇంకా గుర్తే….
పది సంవత్సరాల ప్రాయంలో…..చీకట్లో ఎవరో తనని వ్యాన్ లో ఎక్కించారు…..అది బెగ్గింగ్ మాఫియా…..అన్ని సక్రమంగా ఉన్న పిల్లలను అవిటివాళ్ళని చేసి….డబ్బులు అడుక్కునేలా చేసేవారూ….ఎదురుతిరిగితే కుక్కని కొట్టినట్లు కొట్టేవారు…..
లేదు నేనిక్కడ ఉండను ….నేను ఏదో ఒక పని చేసుకుంటాను….గట్టి గట్టిగా అరుస్తున్నాడు…
ఛల్ చుప్ అని చాచి పెట్టి కొట్టాడు……ఏందీబె అరుస్తున్నావ్….చంపి పాతేస్తా….కొడకా….చెప్పింది వినడం వరకే మీ పని అర్థం అయ్యిందా…బుద్ధిగా పెట్టింది తినండి……అన్నాడొకడు….
రెండు రోజులు ఇక్కడే ఉంచి వేరే ప్లేస్ కి తీసుకెళ్లి అప్పుడు …కాలో కల్లో తీసేద్దాం….అని మాట్లాడుకుంటున్నారు….
కానీ అప్పటికే స్వేచ్ఛగా …లోకాన్ని చూసిన సైదులు వేగంగా పరిస్థితులు గమనించడం నేర్చుకున్నాడు….
విళ్ళతో వెళ్లడం ఇష్టం లేదు నాకు అన్నాడు…..సైదులు
అది కాకా…కాలు చెయ్యి విరిచేస్తారట…ఏడుస్తూ అన్నాడు ఇంకొక పిల్లవాడు….అందరూ భయం భయం గా ఏడుస్తున్నారు…
ఎలాగైనా బయటపడాలి అని… అక్కడే కూచున్న ఒక రౌడీ తో నాకు ఒంటెలు వస్తుంది అన్నాడు….
తీసుకెళ్లి రాపో అని ఒక్కడికి పురామయించాడు……ఇంకెవరైనా వెళ్తారా అనేసరికి ఇంకో నలుగురు నిలబడ్డారు…. మొత్తం
ఐదు గురిని బయటకు చెట్ల లాంటి ప్రదేశానికి తీస్కుకోని వెళ్ళిండు….
ఆహ్ రౌడీ కళ్ళు కప్పి సైదులు వేగంగా పరుగు తీయడం మొదలు పెట్టిండు….ముళ్ళు రాళ్లు ఏవి లెక్క చేయకుండా అక్కడ నుండి తప్పించుకోవాలని పరిగెత్తుతూ వెళ్తున్నా సైదులిని ఒక కార్ ఢీకొట్టింది….
★★★★★★★
ప్రస్తుతం
భయ్యా నా బ్యాగ్….? ఇదిగో అమ్మా…..పైసలు ఇచ్చి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది….
అప్పటికే మిట్టామధ్యానం…. సద్ధి డబ్బా…నీళ్ల బాటిల్ తీసి తినడం మొదలుపెట్టిండు….తన లాగే చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు…తింటున్నారు….
దూరంగా చూస్తూ….ఎప్పటినుండో అనుకుంటున్నా….ఆహ్ బోగడ చెట్టు కింద కూచుని ఉంటే గొడుగు అవసరం ఎక్కువ ఉండదు అని….
అనుకున్నట్లుగానే….బోగడ చెట్టుకింద ఉన్న ఉస్మాన్ …పళ్ళ దుకాణం ఒక షెట్లర్ కి మారుస్తున్నారు …అది దూరం నుండే చూసిన సైదులు…తినే డబ్బా మూసేసి ….తన సామాను పట్టుకొని వీలైనంత వేగంగా వెళ్ళిపోయి…చెట్టు మొదట్లో బెంచి దగ్గర కూలబడ్డాడు…ఆయాసంతో …..
తను పరిగెత్తడం చూసి …అక్కడ జరిగేది అర్థం అయ్యి తనలాగే పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు నా జాగా అంటూ పొట్లాట పెట్టుకుంటూ…పాలిథిన్ సంచులు పరుచుకుంటున్నారు…అప్పటికే సైదులు తన దగ్గరకు వచ్చేవారు నిలబడేందుకు వీలుపడేంత జాగా వరకు పాలిథిన్ సంచి పరుచుకున్నాడు….
అన్ని ముందుకుముందే ఆలోసించుకుంటావు….ఉస్మాన్ దుకాణం తీసేత్తడని నీకెట్ల తెలుసు ???అడిగింది…పక్కనున్న గాజులు అమ్మే అత్త…… సైదులిని అల్లుడు అని పిలుస్తాది
ఎం లే అత్త…మొన్న మాట్లాడుకొంగా విన్నా…కాకుంటే ఇయ్యల నా రేపా అన్నది తెల్వది…అందుకే ముందుకు ముందు సమాన్లు సర్దుకొని చూసిన అన్నాడు…..మారాజావ్…అని మేటికలు విరిసింది…..
రోజులాట్ల గడిచిపోతున్నాయి…….
అప్పుడొచ్చింది తను……
★★★★★★★★
గతం:
చిమ్మచీకట్లో…..పరిగేడుతున్న సైదులు…తన వెనకే తరుముకుంటూ వస్తున్న రౌడీ ని తప్పించుకోవాలని …చాకచక్యంగా పరిగెడుతున్నాడు….. రౌడీ కండ ఉన్న శరీరం …అంత వేగంగా పరిగెత్తడం లేదు …..సైదులు మాత్రం …చిచ్చర పిడుగుల పరిగెత్తుతూ రోడ్డు మీదకు వచ్చేసరికి…..
ఎదురుగా వస్తున్న కార్ గుద్దేసి వెళ్ళిపోయింది……ఏ కుక్కపిల్లో అడ్డం వచ్చింది అనుకోని ఆపకుండా వెళ్ళిపోయారు కార్ లో ఉన్న మనుషులు…..
రోడ్డు పైన అచేతనంగా….రక్తమోడుతూ…గాయాలతో ఉన్న సైదులుని …అటుగా వెళ్తున్నా రాములు తాత….దగ్గరలోని దవాఖాన లోకి తీస్కెళ్ళిపోయాడు …..
గాయాలకు కట్లు కట్టి….సెలైన్ పెట్టారు…ఆరోజు రాత్రి అక్కడే పడుకున్నాడు రాములు….
ఉదయం లేచాక సైదులిని చూసి….తాతతో మాట్లాడాలి అని పిలిచాడు డాక్టర్….
ఏమవుతాడు….? ఆ పిల్లాడు…..
మనువడు సారు….ఎట్లా ఉన్నది….ఏమైనా పెద్దగా తాకినయా దెబ్బలు ???
ప్రాణం కి ఎం ప్రమాదం లేదు గాని …కాలు కి దెబ్బ బలంగా తాకింది….ఏముక ముక్కలుగా విరిగింది… దగ్గరకి చేర్చి కుట్లు వేసాము కానీ… అతుకుంటే నడుస్తాడు లేదంటే….నడవలేకపోవచ్చు….చిన్నపిల్లవాడు కదా….పెరిగేకొద్దీ అతుకుంటాయి…చూద్దాం మళ్ళీ 5 రోజుల తరువాత తీసుకొని రండి …అన్నాడు
అలాగే సారు…అని వాళ్ళిచ్చిన మందులు తీసుకొని ….ఉన్న పైసలతో రిక్షాలో నిద్రలో ఉన్న సైదులిని తీసుకొని మురికివాడా లోని ఇంటికి తీస్కెళ్ళిపోయాడు……
నిద్రలోనుండి లేచిన తనకి కాలుకి ఉన్న కట్టు చూసి నిజంగానే కాలు విరిచేశారు అనుకోని ఎడవడం మొదలు పెట్టాడు సైదులు….
అయ్యయో బిడ్డ ఎందుకు ఎడుస్తున్నావు…నీకేం కాలేదు…అంటూ వచ్చింది లచ్చిమవ్వ….
మీరోళ్ళు….నేనెడా ఉన్న?
నిన్న రోడ్డు మీద నీకు టక్కర్ (ఆక్సిడెంట్) అయితే తాత నిన్ను ధవాఖాన్ ల చూపిచ్చి తీస్కచిండు….మీ అవ్వ బాపు ఏడ ఉంటారో చెప్తే అడా దించేసి వస్తాడు…..
నాకు ఒళ్ళు లేరు…నన్ను నిన్న వ్యాన్ ల ఎత్తుకపోతుంటే తప్పించుకొని ఉరుకుంటా వచ్చేసిన…రోడ్డుమీద ఏమో గుద్ధింది….
అయ్యో బిడ్డే ఒళ్ళు లేరా….తాత వచ్చినంక సూదాం గాని…బువ్వ తినవేట్త …ఉండు….అని
అన్నం తినిపించి…మందులు వేసి పడుకోపెట్టింది…..
రాములు వచ్చాక….పిల్లాడు కి ఒళ్ళు లేరట ఎట్లా…మనకా తిందానికే బువ్వ దిక్కులేదు ఇప్పుడేం జేత్తం…?…..
బువ్వదేమున్నదే దొరికిన్నాడు తింటాం లేన్నాడు ఉపాసం ఉంటాం…అడు కూడా అసుంటాడే కదా తెల్వన్ది ఏముంటాది….రేపు నీకో నాకో అక్కెరకు రాడా…. గిప్పుడు పంపించిన నడని పొరడు ఎటు వొతాడు…ఉండని ఇన్నే….
గట్లగదు బావ…నేనెద్ధాంటలే….గాని చూసుకునుడు మనతోనే ఐతదా అంటున్న..మనకా పిల్లలు లేకపోయే…. విడన్నా దిక్కు అయితే మంచిదే గద అన్నది… చిన్న బ్రాందీ సీసాలో కిరోసిన్ పోసి…వత్తి వేసి దీపం పెట్టి…..అన్నది….
రేప్ ఆడు లేసినంక అడగుదాం …ఉంటా అంటే ఉండని …లేదంటే లేదు….
★★★★★★★★
ప్రస్తుతం:
ఏయ్….అని అదిలించేసాడు సైదులు….బోగడ చెట్టు బెంచి మీద పడుకున్న తనని…..
లేచి కూర్చుంది…. పిలిచిన సైదులు ని చూసి….. తను నవ్వింది……
తనని చూసి నవ్వేసరికి ఒకసారి వెనక్కి పక్కకి చూసాడు…నన్నెనా అన్నట్లు…..అతను అలా వెర్రిగా దిక్కులు చూస్తుంటే….కిలకిలా నవ్వేసింది….
దుమ్ముకొట్టుకపోయిన నైటీ మీద చీరచుట్టుకొని…చినిగిపోయిన స్వేటర్ వేసుకుని ఉంది…ఇదేదో పిచ్చిది అనుకోని ….
చుప్…ముందు ఇక్కడ కెళ్ళి లెవ్ పో…అని బయపెట్టేసరికి….బోగడ చెట్టు అటు పక్కన ఖాళీగా ఉన్న బండ మీద కూచుంది….వచ్చిపోయేవాళ్ళని చూస్తూ…..
సైదులు తన మట్టుకు తాను….సమాన్లు తీసి కింద పెట్టి ….బెంచి మీద దుమ్ము దులిపేసాడు… వచ్చేవారు కూర్చుంటారు అని……
తనపక్కన… గాజులాత్త …బండ మీద కూసున్న
తనని చూసి…. ఎం అల్లుడు ఎవర్తిది….నీ పక్కన ఉంది….పిల్ల దోర్కకుంటే నన్ను అడ్గాల గద ఇట్లా పిచ్చి దాన్ని పట్టుకున్నావ్….
నీ…అని నాలుక మడతెట్టి….అదేదో ఖాళీగా ఉన్నది అని వచ్చి కూసుంటే నాకు అంటగడతావ్ ఎందే….ఉకో…మూసుకొని పనిజుస్కో అని కసురుకున్నాడు ….. మళ్ళీ నవ్వింది అతను అలా మాట్లాడుతుంటే….
అల్లుడు నిన్ను చూసే నవ్వుతున్నది చూడు ….తమలపాకుకు సున్నం రాస్తూ అంది…
నీయమ్మ మల్ల నవ్వినవ్ అంటే సంపేస్తా….అని భయపెట్టేసారికి…. భయపడి మొకం తిప్పేసింది….
అయ్ అట్లా బెదిరిస్తావ్…పిల్ల జుస్తే మంచిగా ఉంది యాడికెళ్లి…వచ్చినవే….? నైటీ మీద గీ చీరేంది….
దేనికి నోరిప్పలేదు….
గిరాకీ చేసుకుంటూనే మధ్యమధ్యలో తనని చూస్తున్నాడు సైదులు ….ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది కానీ ఎక్కడ…. అనుకున్నాడు ….
ఇంతలో….తను లేచి అటు ఇటు చూస్తుంది….దినికేం అయింది అని గాజులత్త ఒక కంట చూస్తూనే…గిరాకీ చేసుకుంటుంది….కడుపు నొక్కుకుంటూ కనిపించే సరికి …తన బాధ అర్థం అయ్యి….. పాపం బిడ్డే ….అనుకోని
అల్లుడు గొంత ఇటు చూడు…నేను అవతలకు పోయి వస్తా..అని చెప్పి వెళ్ళింది …చెప్పులు కుడుతున్న సైదులు తల ఎత్తకుండానే అలాగే అన్నాడు….మధ్యమధ్యలో ఆడవాళ్లు అలా బయటకి పోవడం తెలిసే…..
అటు ఇటు దిక్కులు చూస్తున్నా తన చేతిని పట్టుకొని….మరుగుదొడ్డి అని రాసున్న గదిలోకి తీసుకెళ్లింది అక్కడ బెంచి వేసుకుని కూచున్న వాడికి పది రూపాయలు ఇచ్చి ఇద్దరు అని చెప్పి తనని లాక్కెళ్ళింది…వేరే వాళ్ళు తనని చూస్తే లోపలికి వెళ్ళనివ్వరు అని……. చేయి విడిచి గది చూపించి పో అనేసరికి లోపలకి పోయింది….
తన పని కానిచ్చి వచ్చే సరికి …ఇది పట్టుకో నేను పోయి వస్తా …బొడ్లో సంచి చేతికిచ్చి లోపలికి పోయి వచ్చింది …….
ఇటు రా….అని స్వేట్టర్ తీసేసి చీర విప్పింది……
…నైటీ తీసి పక్కన పెట్టేసి…. లంగా జాకెట్ పైన చీర మంచిగా కట్టింది….పక్కన కిటికీ నుండి నైటీ పడేసి….కాస్త జడ చక్కదిద్ది…మొహం కడుక్కోమని అక్కడున్న సబ్బు ఇచ్చింది….తనకు తెలుసు అన్నట్లుగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని…. చీర కొంగుతో తుడుచుకుంది పద పోదాం అన్నది….స్వేట్టర్ మట్టుకు ఏసుకో అని చెప్పి…..
వచ్చేటప్పుడు ఎంత సేపు….స్నానాలు చేస్తున్నారా అని అరుస్తున్న వాడి మాటలు పట్టించుకోకుండా తీసుకొచ్చేసింది….తనని….
మళ్ళీ వచ్చి అదే బండ మీద కూచుంది….ఇంత సేపా…? అని అడుగుతున్న సైదులుకి బదులివ్వలేదు….దగ్గరున్న బొట్టుబిళ్ళలో ఒకటి తీసి తన మొహానికి పెట్టింది.. అమ్ముడుపోని పచ్చగాజులు తొడిగింది ……..
ఇటు మాట్లాడుతుంటే ఎం చేస్తున్నావ్ అత్త…. అని అడ్డుగా ఉన్న పెట్టెని పక్కకి జరిపిండు……
ఛామంచాయలో బొట్టు బిళ్ళతో ….దగ్గరగా వేసిన జడ ….సిత్తుగా కట్టిన చీరకి …ఇంతకు ముందు కూచున్న పిసదేనా అనిపించింది సైదులుకి….
అలానే చూస్తే మళ్ళీ నవ్వింది తను …….
ఏమత్తా..న మీద పగపట్టి….దీన్ని నాకిద్దాం అని ఐడియాలు వేసుకున్నావ్ కాదే అన్నాడు …
మాట్లాడలేదు…… అత్తో నిన్నే ఆదిలించిండు…ఆహ్ ఎం లేదు….పిల్ల ని చూస్తే బాగుందని రెడి చేసిన అన్నది…ఎర్రబడిన కళ్ళతో……కానీ సైదులు గమనించలేదు….
హ్మ్ నీ ఇష్టం…అన్నాడు….కానీ తన మనసులో తిరుగుతున్నా ప్రశ్నకి జవాబు దొరకడం లేదు…ఎక్కడో చూసాను దీన్ని…ఎక్కడ ????
అన్న అన్నం తెచ్చుకోలేదా…లేక వదినని చూసి కడుపు నిండిందా….అన్నాడు టెంకి….తననే చూస్తూ ఆలోచిస్తున్న సైదులు ని చూసి…..
నెత్తి మీద కొట్టి ముందు నువ్ తిన్పో అనేసాడు ….అలాగే దా నువ్ కూడా అన్నాడు….
సాయంత్రం అన్నీ సర్దుకుంటూ…. గలగల మాట్లాడే గాజుల పెద్ది సప్పుడు చేస్తాలే ఏమైంది…. ? అన్నాడు టెంకి
అవును ఇంతవరకు తేడా రాలేదు నాకు….అవు మల్ల….పిల్ల రోకుల ఉన్నావ్ గా అని పారిపోయాడు టెంకి….. నీ అయ్యా రా…దొరికవంటే ఉతికేస్తా…. వేలు చూయించి అన్నాడు..
మాకది మాములే అన్నట్లు నవ్వుతున్నారు…కానీ గాజులత్త …ఏదో ఆలోచిస్తున్నట్లు కూచుంది….
ఏమైంది అత్త…అట్లున్నావ్….? అల్లుడు దీన్ని చూస్తే చిన్నపుడు మతిలేక ఏటో పోయిన నా బిడ్డే లెక్క కొట్టుతుంది..అందుకే రెడి చేసిన…కానీ ఇంటికి తీసుకపోదాం అంటే …మీ మామా తాగి వచ్చి నన్నే కొట్టుతాడు…నేనున్నా జాగల…గాలి పోరాగండ్లు మన్వడతారు… నీ కాడ ఇయ్యల ఉంచుకో…. రేపు నేను మా చెల్లె ని అడిగి దానీంట్ల ఉంచుతా అన్నది….
ఏ ఉకో అత్త…. దారిల పోయేటి దాన్ని పట్టుకుంటావ్ ఏంది …. వద్దు వదిలేయ్ అదే పోతాది ఎటొక్క దిక్కు అన్నాడు….
అట్లగాదు నువ్ అటు చూడు…. వాడు దాన్ని అప్పటికెళ్లి చూస్తున్నాడు…మనం ఇడకెళ్లి పోతిమాన్కో దాన్ని ఎత్తుకపోతారు…నీ కన్నా చిన్నది… ఇరవై ఏండ్లు ఉంటాయి…ఇసుమంటి దాన్ని వొదులుతారా ….బిచ్చాపుదాన్నే కరాబ్ చేసి చంపింరు…నీకు తెలంది గాదు… ఇదంతా కాదు చెప్పు ఇయ్యల తీసుకపోతావా లేదా…ఒకటే చెప్పు ఇంకేం చెప్పకు నాకు…..
నిజమే….ఎవరు వదలరు….అన్న….నియ్యతి ఉన్నోడు ఎవరు లేరు…. ఇయ్యల తీస్కొని పోదాం రేపు పెద్ది తీసుకపోతా అంటుంది గద అన్నాడు ….
సరే…లచ్చిమాయి ఏమంటాదో …. పెట్టె చేతులోకి తీసుకుంటూ అన్నాడు….
ఏమంటాది….పోరిని లగ్గం చేసుకచ్చిండు అని గదిలోకి పంపిస్తాది ….. అనేసరికి మెడ దొరకపట్టిండు…సైదులు
నువ్ ఉకోరా టెంకి ….వాడ్ని ఈడిసెయ్…ఇగో దా….సైదులు తీసుకపోతాడు పోతావా…. అన్నది తనని సైదులు ముందుకి తీసుకొచ్చి….
పోతా అన్నది…. అబ్బా ఇది మాట్లాడిందా ఆన్నట్లు చూసాడు…..ఇంతకీ నీ పేరేంది…. ?
పేరు ఏమో…. అన్నది….దినికి పేరు లేదంట అత్త…నీ బిడ్డే కి పెరు పెట్టు అన్నాడు …. సిల్కా తిర్ల నవ్వుతున్నది గద…ఎం పెడతావ్ ఏంది….
నువ్వే అన్నావ్ గా సిల్కా అని….అట్లనే పిలు…. అన్నది గాజులత్త….
తలకొట్టుకుంటు …ఇయ్యల నా మీద పడ్డారు అందరూ….అనుకుంటూ పదమ్మా సీలకమ్మ అన్నాడు…. గొడుగు చేతిలోకి తీసుకొని నడుచుకుంటూ వెళ్ళింది సైదులుతో…..
★★★★★★★★
గతం:
ఏమిరా మాతోనే ఉంటావా….నీకు పని కూడా ఇస్తా నా కాడ….నువ్వేం పనిజేస్తావ్….. చెప్పులు బ్యాగ్లు కుట్టుతాను……. ఏదో ఆలోచిస్తున్నట్లుగా మొకం పెట్టి చూస్తుంటే…..
అప్పటికే లచ్చిమాయి కి వాడు నచ్చి…. బయటకి పోతే నిన్ను ఎత్తుకపోతారు …బయపెట్టుతునట్లుగా అన్నది….
దానికి సైదులు…ఆ నేనెళ్లను వాళ్ళతోని…ఇడనే ఉంటా అన్నాడు….వాడ్ని చూసి ఇద్దరు నవ్వుకున్నారు…..
ఐదు రోజుల తర్వాత ….
డాక్టర్…..కుట్లు విప్పి…. మళ్ళీ బ్యాండేజ్ వేసాడు…3 నెలలు నడవద్దు కానీ …కాలిని కాస్త మడుస్తూ ఉండండి….ఏదైనా నొప్పి గాని చీము గాని పడితే రండి మళ్ళీ…అని మందులు రాసిచ్చి పంపాడు……
అలాగే సారు అని వాడిని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు…రాములు తాత….
మూడు నెలల తరువాత….. మెల్లిమెల్లిగా నడవడం మొదలు పెట్టిండు …..నిజానికి డాక్టర్ నడవడు అని చెప్తే బాధపడ్డాడు
రాములు…..సైదులు నేను నడుస్తానా అని అడిగిన ప్రతిసారి తగ్గిపోతాది కొన్నోద్దులకి…నడచ్చు….అని తాత చెప్తే అదే నిజమని నమ్మి ….నడవడం మొదలు పెట్టిండు …మొదట్లో కట్టే పట్టుకొని నడుస్తూ…తరవాత తనంతట తానే నడిచేలా చేసాడు……
ఒకరోజు విపరీతమైన నొప్పితో ఏడుస్తుంటే …. మళ్ళీ డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లిండు…..
సైదులు నువ్వు నడుస్తుంటే నొప్పి వచ్చిందా….?
లేదు ….నడుస్తుంటే…నన్ను కుంటోడు వాడికి ఉరకడం రాదు అన్నారు…నాకు కోపం వచ్చి….నేను పరుగెత్తిన….. అప్పటి నుండే నోస్తుంది అన్నాడు…..
ఎక్స్ రే తీయించుకొని రా…తనని తీస్కుకెళ్లు అన్నట్లు సైగ చేసాడు నర్స్ తో….సైదులిని తీస్కొని ….వెళ్ళిపోయింది…..
నడవడు అనుకున్నా కానీ నడుస్తున్నాడు….ఎముకలు అతుక్కోని ఉండచ్చు……
ఎక్స్ రే తీసుకొచ్చాకా లోపలికి వచ్చారు…. చూసాక…. నడుస్తాడు గాని పరిగెత్తితే ఎముకలు రాసుకొని నొప్పి వస్తుంది…అసలు పరిగెత్తద్దు అని చెప్పిండు డాక్టర్…..
ఇప్పుడు నీకు కాలు తీసేయనా…?
ఆ వద్దు…అన్నాడు సైదులు….
నువ్వు మళ్ళీ పరిగెత్తితే నొప్పి వస్తుంది ….నొప్పికి కాలు మొత్తం కరాబ్ అయిపోయి ….కాలు తీసేసేదాకా వస్తాది…మళ్ళీ ఉరుకుతావా….?
ఉహు ఉరకను….అన్నాడు….
ఇంటికొచ్చాక….సైదులుని ఏడిపించిన వాళ్ళని తిట్టి వచ్చాడు….ఆ వాడాలో రాములే పెద్ద అవ్వడంతో పిల్లలకు భయం చూయించి సైదులిని ఎం అనకుండా చేసేసారు…..
పరిగెత్తలేకపోవడమే…తన జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తుందని తెలియలేదు సైదులుకి …..
★★★★★★★★★
ప్రస్తుతం
సైదులుతో పాటు ఇంట్లోకి వచ్చిన పిల్లని చూసి ….ఎవర్రా ఈ పిల్ల….?
ఏమైందే….అంటూ రెండో గది నుండి బయటకు వచ్చాడు రాములు….70 సంవత్సరాలు కావడంతో పనికి వెళ్లడం లేదు ……
కింద నుండి మీద వరకు చూసి …దగ్గరకు వెళ్లి మెడ మీద చేతులేసి తడిమింది…అక్కడ ఏమి తగలక పోవడంతో….
తీరిందా …అన్నాడు సైదులు…. నెత్తి మీద ఒక దెబ్బ వేసాడు తాత….
మరి చూడు నేనేమో లగ్గం చేసుకచ్చినట్లు మెడ మీద లెంకుతుంది …అన్నాడు
ఉకోయే….లచ్చిమీ….అసలు ఒళ్ళు ఈ పిల్ల అనడిగితే….మొత్తం చెప్పిండు….
సరేసరే ఉండని….తలుపు దగ్గరే నిలబడ్డ పిల్లని లోపలకి తీస్కుకచ్చింది….
ఆరోజు ఉన్నదంట్లో తినేసి పడుకున్నారు అందరూ….
ఒకరోజు అని చెప్పి ….పంపిన గాజులాత్త…. ఐదు రోజులు అయిన తీస్కుకెళ్లలేదు….
వాడాలో గుసగుసలు తన దాకా వచ్చేశాయి… కోపమొచ్చిన సైదులు….నా మరదలు మీకేం బాధ అనేసరికి సైలెంట్ అయిపోయారు….వారికి తెలుసు సైదులుకి కోపమొస్తే ఏమవుతుందో…..
★★★★★★★
పద్దెనిమిది ఏళ్ళ వయసు నుండి తనకు అడుక్కుంటూ కనిపించే పిల్లలని మాయ చేస్తూ….అనాథ శరణాలయాల్లో చేర్పిస్తూ…తన గురించి తెలియకుండా జాగ్రత్త పడేవాడు….
ఏ ఒక్కరోజు కూడా బెగ్గింగ్ ముఠా కి ఎదురుకాకుండా తన పని తాను చేసుకుంటూ…పోతున్నాడు….
ఒకనాడు రాత్రుల్లో బెగ్గిగ్ ముఠా స్థావరం ఏదో తెలుసుకోవడానికి వాళ్ళని ఎంబడిస్తూ వెళ్లిన తనని …. అక్కడే తిరుగుతున్న రౌడీలు చూసి ఎవడ్రా వాడు అనేసరికి కాస్త వేగంగా నడుస్తూ తప్పించుకోవాలని
చీకటిగా ఉన్న సందులోకి వెళ్లి దాక్కున్నాడు ….
ఇక్కడే ఎక్కడో ఉంటాది దాన్ని వెతకండి రా అని మాటలు వినిపిస్తున్నాయి… ఆడపిల్లలను కూడా ఎత్తుకెళ్తున్నారని అప్పుడే అర్థం అయ్యింది…
అటుగా పరిగెత్తుతూ వస్తున్న అమ్మాయిని …. ఒక్కసారిగా లాగేసి శబ్దం రాకుండా నోరు మూసేసాడు…కొంచెం సేపు పెనుగులడిన…చప్పుడు కాకుండా చూసుకున్నాడు ఇద్దరు అలానే నిలబడ్డారు…. గుడ్డి వెలుతురులో తన మెడ మీద పుట్టుమచ్చ తప్ప మొహం కనపడలేదు……
రౌడీలు వెళ్లిపోగానే….తనని తోసేసి వెళ్ళిపోయింది ఆ పిల్ల…. తన వెనకే వెళుతుంటే లైట్ల వెలుతురులో కనిపించింది తను…..
ఉలిక్కిపడి లేచాడు….సైదులు…..
అవును తను తను …అంటే… సీలక నే….అప్పుడు పారిపోయి ఇక్కడ దొరికింది…అని లోపలి రూమ్ లో పడుకున్న…సిల్కా దగ్గరకు వెళ్ళాడు…..
మెడ మీద పుట్టుమచ్చ కనపడటంతో ….తనే అని నిర్ణయంకి వచ్చాడు….. అలాగే గోడకి అనుకోని ఆలోచిస్తున్నాడు…..
ఆరోజు…..
చటుక్కున లాగేసరికి…. భయపడిపోయిన తన నోటిని నొక్కేసి గోడకి అదిమి పెట్టితే….కళ్ళు పెద్దవి చేసి చూడటం…..తనను తోసేయ్యాలని ఛాతి పైన చేతులేసి నెట్టడం..మొదటిసారి అంత దగ్గరగా ఒక అడపిల్లని చూడటం…ఊపిరి బరువుగా తీసుకుంటూ చూసాడు….కానీ తన మెడ మీద పడిన మసక వెలుతురులో పుట్టుమచ్చే కనపడింది …. పట్టు విడవగానే పులి నుండి విడివడిన జింక పిల్లలా పారిపోయింది అదంతా గుర్తొచ్చి తనలో తాను నవ్వుకున్నాడు……
మనసు మాసెడ్డది….సైదులు దానితో కుస్తీ పడద్దు…వచ్చి పడుకో అన్నాడు రాములు తాత…
కళ్ళు తెరవకుండానే……
గుటకలు మింగి….చప్పుడు కాకుండా వచ్చి పడుకున్నాడు 😂……
తెల్లారి…..గాజులాత్త….. సైదులు ఇంటికి వచ్చింది….సైదులు అక్కడ లేకపోవడం తో ….రాములు లచ్చిమవ్వ తో కలిసి ఆహ్ పిల్ల గురించి మాట్లాడి వెళ్ళిపోయింది….
ఒరే సైదులు….గాజులాత్త వచ్చింది రా…. పిల్లని తీసుకపోతాదట రేపు…..మొహంలోకి చూస్తూ అన్నది…..
తీసుకెళ్లమను…ఇంకెన్ని దినాలు ఇక్కడ… అన్నాడు…..
లచ్చిమాయి…ఒక క్షణం రాములుకేసి చూసింది….
మీ అయి ఇక్కడే ఉంచుకుందాం అంటుందిరా …నువ్వేం అంటావ్…మీ ఇష్టం నాకు సంబంధం లేదు …అనేసి పెట్టె తీసుకొని బోగడ చెట్టు దగ్గరకు వెళ్ళిపోయాడు….
…………………
సీలక…… మతిస్థిమితం లేని అమ్మాయి….. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా వారిలాంటి పిల్లలను చూసుకునే భవనంలో పెరిగింది……తమను చూసుకునే ఆయమ్మ….సావిత్రి
………………..
చూడు సావిత్రి….. ఎందుకు రాదంతం చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు…. వాళ్ళని ఎక్కడ దాచిపెట్టవో చెప్పు ….నీ కన్నబిడ్డలు కాదు…..ముందు ఉన్న వారు నోరుకూడా మెదపలేరు….ఇచ్చిన డబ్బు తీసుకో…ఎక్కువ చేస్తే మా సంగతి తెలుసు కదా….అన్నాడు దామోదర్…..అమ్మాయిలను వేరే వేరే చోట్లకు …సెక్స్ బానిసలుగా పంపే ముఠా లోని సభ్యుడు….
లేదు…ఇక్కడ నుండి ఒక్క అమ్మాయిని నా కంఠంలో ప్రాణం ఉండగా తీసుకెళ్ళనివ్వను అన్నది….
నీ కర్మ…..అనేసి చైర్ కట్టేసిన తన కట్లు విప్పేసి…..వెళ్ళిపోయాడు…..బయట ఉన్నవారు….
…ఏమైంది ఒప్పుకుందా….
మధ్యలో కూర్చున్నా తమ బాస్ ని చూస్తూ….లేదన్నట్లుగా తల ఊపాడు….
పని కానిచ్చేయండి.. నవ్వుతూ …వెళ్ళిపోయాడు….
ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ వస్తున్నారు…. తనకంటే వయసులో చిన్నవారు కూడా …రాక్షసంగా తనని మానభంగం చేస్తున్నా పంటిబిగువున బాధని తట్టుకుంటూనే… సృహలేకుండా పడిపోయింది…..సావిత్రి…..
అది నోరు విప్పకుంటే….దాని ఇంటికి వెళ్లి అయిన వెతకండి అందులోని అమ్మాయిలు మనకి ముఖ్యం….దుబాయ్ సెట్ కి నచ్చిన వాళ్ళు …..దీనివల్ల లేట్ అవుతుంది….ఛ …
ఎన్ని చిత్ర హింసలు పెట్టిన తట్టుకొని అక్కడ తప్పించుకుంది …. వారిని దాచిపెట్టిన చోటు నుండి తీసుకుని వెళ్ళిపోయింది
అలా తీసుకెళుతున్న సమయంలోనే ….తప్పించుకుంటూ వెళ్లబోయి సీలక సైదులు కంట పడింది…..అప్పుడే చూసాడు తనని…. తనకి తెలియని విషయం ఏంటంటే….. సిల్క కూడా తనని చూసింది….. మళ్ళీ తొందరగా సావిత్రి వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది
ఇలా అందరిని తీసుకొని….ట్రైన్ ఎక్కే క్రమంలో….సిల్క కనిపించలేదు …అప్పటికి రౌడీలు తనని వెతుకుతుండడం తో మిగిలిన అమ్మాయిలతో ట్రైన్ ఎక్కేసింది … సిల్కా చాలా సేపు స్టేషన్ లొనే చాలా సేపు తిరుగుతూ సావిత్రి కోసం చూసి……అక్కడ నుండి ఎటు వెళ్ళాలో తెలియక ….. ఎవరిని నమ్మకుండా…..రౌడీల భయంతో సైదులు చెప్పులు కుట్టే స్థలం లోని బోగడ చెట్టు దగ్గరకి వచ్చింది……
★★★★★★★
పని చేస్తున్నాడన్న మాటే గాని…..తన చుట్టే తిరుగుతున్నాయి ఆలోచనలు…..
ఎం అమ్మి ఎం చేస్తున్నావ్ ? …..తల అటు తిప్పేసింది ……అట్ట మూతి ముడుస్తావ్ ఎందే….నేనడిగితే మాటలు రావా ??? ఆహ్
అని గద్దించేసరికి….బేలాగా చూసింది…..
హుఫ్ ఏడుస్తాడేమో ఇంకా ఏమైనా అంటే….అని మనసులో అనుకోని…..
ఆరోజు నన్ను చూసావా చీకట్లో….? అవును అన్నట్లు తల ఊపింది….నీతో ఎవరున్నారు ….
అమ్మా….
మిమ్మల్ని రౌడీలు ఎందుకు వెతికారు….. ఏమో…
ఏమో నా 😑…… మరి మీ అమ్మ ఎక్కడ ???
వాళ్ళు వెళ్లిపోయారు….అని ఎడవడం మొదలెట్టింది….. ఎక్కడికి? …..తెలియదు
సరే సరే ఉకో…నేను వెతుకుతాను మీ అమ్మ ని ….
అలాగే అని మళ్ళి గలగల నవ్వింది ……
నవ్వకే బాబు…. ఏమి తెలియని నవ్వుకే పడుతున్న …..అనుకున్నాడు గుండె మీద చేయి వేసుకొని మనసులో…..
………………….
అన్న ….అన్న….. ఆహ్ ఏమైంది రా…..ఏమాలోచిస్తున్నావ్ ? ….అది ఎం లేదు….
లేదు అంటే ఉందనే కదా …..
సిల్కా తో ఉండే సావిత్రమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తున్న….
అంటే…అన్న సావిత్రమ్మ కనిపించడం లేదా ?
****
– కవనవల్లి