తల్లితండ్రులే ప్రత్యక్ష దైవాలు
అది ఒకానొక రోజు, అర్ధరాత్రి అప్పుడే పట్టక, పట్టక కనులకు కునుకు పట్టినవేళ.. వృద్ధాప్యంలో అవయవాలు పట్టుత్వం లేని అమ్మ, నేనూ నిద్రలోకి జారుకున్నాం… కనులు మూసానో లేదో? అప్పుడే అమ్మ ఎదో ఇబ్బందితో మెల్లిగా పిలుస్తూ తట్టి నన్ను నిద్ర లేపుతుంది… బాబు…. బాబు… లే నాన్నా.. లే నాన్న అంటుంది, నేనూ కోపంగా కళ్ళు తెరచి ఏం.. చెప్పు.. పొద్దస్తామానం నిద్ర లేపుతుంటావ్, రాత్రిళ్ళు అస్సలు నిద్ర పోనియ్యవు, ఏం చెప్పు అని కసురుకున్నాను…
వృద్ధాప్య సమయంలో శక్తి లేక, అవయవాలు చలికి వణుకుతున్న ఆవేదనలో అమ్మ నాతో అన్నది ఆ ఫ్యాన్స్ ఆఫ్ చేయరా చలి చంపేస్తుంది అని.. అంతే నాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది, దీనికోసం నా నిద్ర చెడగొట్టావా? నువ్వు అని అమ్మ మీద అరుపులతో నోర్మూసుకుని పడుకో అంటూ కేకలు వేసి అలాగే పడుకున్నానేనూ…
అమ్మ ఏడుస్తూ ఇంకొంచెం సేపు అయ్యాక బాబు… బాబు…. అంటూ మళ్ళీ లేపింది, ఏమిటే నీ గోల అంటూ ఆవేశంతో నేను కేకలు వేసాను ఫ్యాన్ అయితే ఆఫ్ చేయక పోయావు కొంచెమైన స్పీడ్ తగ్గించరా అంటూ ఏడుస్తూ ఆవేదన.. తగ్గించేది లేదు ఏమీ లేదు పడుకో అంటూ అరుపులు, ఏమి చేయలేని దుస్థితి పరిస్థితిలో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ సమయం గడిపింది..
మళ్ళీ కొంచంసేపుకి నాన్న… నాన్న అంటూ లేపి కొంచం గొంతు తడారి పోతుందిరా కొంచం మంచి నీళ్లు తెస్తావా?? అంటూ విన్నపము, ఉలుకు, పలుకు లేక నిద్ర నటిస్తూ నేను… తడారుతున్న గొంతుతో అమ్మ ఏడుపు వినిపిస్తున్నా కరగని నా మనసుతో అలాగే నిద్రలోకి…
ఇంకొంచెం సమయం అయ్యాక మరోసారి తట్టుకోలేక అమ్మ మళ్ళీ నన్ను లేపుతుంది, రేయ్ నాన్న.. నాన్న కొన్ని నీళ్లు ఇప్పించరా నీకు దండం పెడతాను, పోయేలా వున్నాను నేను అని అరుపులు… నేను ఆవేశంగా లేచి చచ్చిపో పీడ పోతుంది అంటూ అరుపులు, ఎందుకు నన్ను చంపుకొని తింటున్నావ్?? నీళ్లు ఎక్కువ తాగితే పాస్ వస్తాయి ఎవడు తీసుకొని పోతాడు నిన్ను అంటూ అమ్మపై నేను కేకలు ఆ మాటలకు అమ్మ గుండె పగిలింది…
ఇంక తెల్లవారేలోగా ఒక్కసారి కూడా నన్ను లేపలేదు…. ఎంత పొద్దేక్కినా అమ్మ లేవకుంటే దగ్గరికి పోయి అరిచాను, ఏంటి ఇంక మొద్దు నిద్ర అంటూ కేకలు వానికి తెలీదు అది తాత్కాలిక నిద్ర కాదు, శాశ్వత నిద్ర అని…
😭అమ్మ లేదు😭
అసలు తల్లితండ్రులు నీకు జన్మ ఇవ్వకుంటే నువ్వే లేవు, నీ సుఖాలు లేవు..
పెళ్ళైయి కొన్ని ఏళ్ళు అయినా పిల్లలు లేరని సమాజం ఎన్ని నిందలు, అవమానాలు వేసినా తట్టుకుని, నీకోసం లేనిపోనీ మాత్రలు వేసుకొని, ఆ డాక్టర్, ఈ డాక్టర్ అంటూ తిరుగుతూ ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కుంటూ ఎన్నో వందల రోజుల నిద్ర లేని రాత్రుళ్ళు గడిపిందో అమ్మ…
నువ్వు కడుపున పడ్డావో లేదో ఎంత సంతోషమో తల్లితండ్రులకు, నువ్వు గర్భంలో పడ్డ క్షణం నుండీ నువ్వు బూమ్మీద పడేంతవరకూ క్షణం ఒక యుగంలా గడుపుతూ ఎన్నో ఆవేదనలు పడుతూ, ఎన్నో నిద్ర లేని రాత్రుళ్ళు గడుపుతూ నీ ఆలోచనతోనే ప్రతీ క్షణం ఆలోచన చేస్తూ ఏదీ చేసిన నువ్వే, నువ్వే అంటూ అనుకుంటూ తమ సర్వస్వం నువ్వేగా నీమీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతారు తల్లితండ్రులు…
పుడుతూనే అయిపోతుందా ఆ తల్లితండ్రుల ఆవేదన? అంటే లేదు, పిల్లలు లేకముందు ఒక ఎత్తు అయితే పిల్లలు పుట్టాక ఒక ఎత్తు అన్నట్టుగా ఎంతో జాగ్రత్తగా వారు తింటారో, తిన్నారో, వారి సర్వ సుఖాలు వదులుకుని నీకోసం బ్రతుకుతూ, నీ ఆరోగ్యం కోసం వారు అనారోగ్యo ను కొని తెచ్చుకుని నిన్ను ఆరోగ్యంగా ఉంచుతూ, నీకు ఆరోగ్యం బాగాలేకపోతే వారు ఎన్ని రోజులైనా మేల్కొని నీకు సేవలు చేస్తూ నిన్ను బ్రతికిన్చుకుంటారు..
ఈరోజు నీవు పుట్టి బుద్దెరిగిన తరువాత తల్లితండ్రులు వృద్ధాప్య, అవసాన, అనారోగ్య దశలో ఎప్పుడోకరోజు నిద్ర మేలుకోవడానికి విసుకుంటున్నావా??
ఎంత విచిత్రమెంత విడ్డురం??
అసలు నీ జీవితమే తల్లితండ్రులు పెట్టిన బిక్ష. బిక్షగా జీవితాన్ని స్వీకరించి గడుపుతున్న నీవు ఈరోజు వారి బాగోగులు చూడ్డానికి విసుక్కుంటూ అసహించుకుకుంటున్నావా??
నీకు బుద్ధి రానంతవరకూ నీవు మల, మూత్రాలను పూసుకొని అందరూ నిన్ను అసహయించుకుంటుంటే నా కొడుకు, నా బంగారు కొండా, రత్నాల మూట అంటూ ముద్దులాడుతూ నీ మలినాల్ని కడిగి నిన్ను ఈరోజు అందరిలో శబ్బాస్ అనేలా తయారు చేసి నిలబెట్టింది నిన్ను నీ తల్లితండ్రులు…
అటువంటి ప్రత్యక్ష దైవాలకు చేతకాని పరిస్థితిలో, ముసలితనంలో వారి పనులు వారు చూసుకోలేని పరిస్థితిలో నీవు ఆసరా ఉండక పైగా వారి బలహీన పరిస్థితిని వారికి చూపుతూ బట్టలంతా మల, మూత్రాలు, అంతా వాసన, రోత అంటూ చీదరించుకుంటూ ఈ బ్రతుకు బ్రతికేకంటే చావడం నయం, ఈ వయసులో బ్రతికి ఎవరిని ఉద్దరిస్తారు??
మా ప్రాణాలు తీయడం తప్పా అంటూ పనికిరాని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ వారు మా ఇంట్లో ఉంటే మా, మా పిల్లల ఆనందాలకు అడ్డు అని అనాథ ఆశ్రమంలోకి వదిలి వేస్తున్నారు!!
ఇది నిజంగా ఎంత బాధాకర విషయం??? అదే తల్లితండ్రులు నిన్ను వారి సుఖాలకు, ఆనందాలకు నీవు అడ్డు అనుకునింటే ఇప్పుడు నీవు ఉందువా?? కానీ వారు అలా అనుకోలేదు, వారి సర్వస్వం నీవుగా వారి ఆశలన్ని, ధ్యాసలాన్ని నీపైనే పెట్టుకొని నిన్ను పెంచితే ఈరోజు నువ్వు వారికిచ్చే బహుమతి, బహుమానం, ప్రతిఫలం ఏంటి??
దేవుడిని పూజించకున్నా పర్లేదు.. కానీ కని పెంచిన తల్లితండ్రులను చూసుకోలేని పిల్లల జీవితం వ్యర్థం అని పురాణ, శాస్త్ర, ఇతిహాస, భారత, రామాయణ, వేదాల, ఉపనిషత్తుల సారం!! ముల్లోకాలు తిరిగినా సాధించలేని పుణ్య ఫలం ఒక్క తల్లితండ్రుల సేవలో వస్తుంది అని వినాయక, కుమార స్వామి కథ!!
సర్వ రాజ్యాన్ని వదలి తండ్రి మాటకై అడవులు పట్టిన రామయ్య చరిత్ర ఈరోజు మనకు నెత్తిన పెట్టుకొని పూజించే విధానం!! ఇంతటి కోటాను కోట్లు విలువ చేసే శరీరంను, ఎన్నో ఎన్నెన్నో గొప్ప ఘనకార్యాలను సాధించే తెలివితేటలను ప్రసాదించిన తల్లితండ్రులనే చూసుకోలేని మానవుడు నిజంగా మానవుడా????
ఇదే బిలియన్ మార్కుల ప్రశ్న!!!!!!!
– గురువర్ధన్ రెడ్డి