తల్లిదండ్రులను గౌరవించాలి
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి! వాడు గిట్టనేమి!
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ !
కన్నవారికి విలువ ఇవ్వని వాడు పుట్టిన ఒక్కటే చచ్చినా ఒకటే అని పై పద్యం యొక్క తాత్పర్యం.
పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ ఒకే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవీస్తూ వారి మాటలకు కట్టుబడి వారు చెప్పినట్టు చేయడమే తమ పనిగా భావిస్తూ వచ్చారు. ఏ పని చెయ్యాలన్నా తల్లిదండ్రులతో చర్చించి వారికి గౌరవమిచ్చి వారు చెప్పినట్టే చేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు అంటే ప్రత్యేక గుర్తింపు దైవంలా భావించేవారు. వారు చూసిన అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుని, వారికి అత్యంత గౌరవం ఇచ్చేవారు.
వారిలో ఏమైనా గొడవలు, అలకలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని వారిలో వారు సర్దుబాటు చేసుకునేవారు. తప్ప ఇంటి గడప కూడా దాటనిచ్చేవారు కాదు. ఇళ్లలో అన్నదమ్ముల గొడవలు, తోటి కోడళ్ళ గొడవలు ఏవైనా తమ చెయ్యి జరుపుతున్నట్టు అనిపిస్తే తల్లిదండ్రులు వారిని కూర్చోబెట్టి అసలు సమస్య ఏమిటి ఎందుకు వచ్చాయి అని ఆరాలు తీసి గొడవల వల్ల నష్టం, కలిసి ఉండడం వలన లాభం గురించి చెప్పీ సర్దుబాటు చేసేవారు. ఇలా ప్రతి ఒక్క ఉమ్మడి కుటుంబం లోనూ జరిగేవి. గొడవ ఇల్లు దాటిందంటే ఊరి పెద్ద దగ్గర వారికి పరిష్కారం దొరికేది. దాంతో గొడవ సద్దుమణిగేది.
తర్వాత తరం వారు వచ్చారు. అప్పుడు తల్లిదండ్రుల విలువ ఏమి తగ్గలేదు. వారు కూడా తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్తే, మరికొన్ని అంటే స్వార్థ విషయాలు చాలా వరకు దాచేవారు. ఎవరో వేరే వారి వల్ల విషయం తెలిస్తే అప్పుడు ఇంట్లో వారిని అడిగితే అప్పుడు అవును మిమల్ని అడిగితే చేయనిచ్చెవారు కాదు అంటూ అసంతృప్తిని వెల్లడించడం మొదలు పెట్టారు.
తర్వాత తరాల వారు తమ చదువుల కోసం బయట ప్రపంచానికి వచ్చి తమ కొడుకులు చదువుకుని బాగావ్వాలని కోరుకున్న తల్లిదండ్రుల్ని పట్టించుకోక, చదువుకునే రోజుల్లో ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోని వెళ్లి చూపించేవారు. ఇక గతి లేక తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లల ఇష్టాలను కాదనకుండా వారి ఇష్ట ప్రకారం చేయాల్సి వచ్చింది.
తర్వాత తర్వాత అసలు పిల్లలు తమదైన లోకంలో తాము ఉండాలని, తమకు ప్రైవసీ లేదని అంటూ తల్లిదండ్రులకు దూరంగా ఉండడం మొదలు పెట్టారు. తమకు పిల్లలు పుట్టినప్పుడు మాత్రమే సహాయం కోసం తల్లిని తీసుకొని వచ్చి పనులు చేయించుకుని తిరిగి పంపించేవారు. అసలు తల్లిదండ్రులు తమని కన్నారు ఎంతో కష్టానికి ఓర్చి పెంచారు. తమను పస్తులు పెట్టకుండా వారు పస్తులు ఉంటూ తమకోసం ఎన్నో త్యాగాలు చేశారనేది ఈ తరం మర్చిపోయింది.
తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ తీసుకుని, వారి బాధ్యత మాత్రం తీసుకోకుండా ఆశ్రమాల్లో వదిలి వెళ్లేవారు ఎక్కువ అయ్యారు. తండ్రి తను పుట్టడానికి కారణం అయితే ఆ పిండాన్ని తొమ్మిది నెలలు మోసి ప్రాణాలు పోతాయని తెలిసినా కని, ఎన్నో త్యాగాలు, ఎంతో కష్టపడి, దయ్యం, భూతం కొట్టకుండా కాపాడి, కాలకృత్యాలు తీరుస్తూ, ఎండనకా, వాననకా కాపాడి, పెద్ద చదువులు చదివి తమను బాగా చూసుకుంటాడు అనుకున్న ఆ తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక తమ స్వంత నిర్ణయాలు తీసుకుంటూ ఇక మీతో పని లేదంటూ తమకు భారమని అనుకుంటూ ఇక్కడ ఆశ్రమాలలో వదిలేస్తే కడుపారా కనుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు, కూతుర్లు ఇలా చేయడం చూసి ఆ వృద్దులు చచ్చినా శవాల వలె బ్రతుకుతూ చావు కోసం ఎదురు చూస్తూ, తమ పిల్లల గురించి ఇతరులకు గొప్పగా చెప్తూ, ఎప్పటికైనా మళ్లీ వస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే…
అక్కడ ఈ కొడుకులు, కూతుర్లు మాత్రం తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఏ రోజైనా తమకు కూడా అదే పరిస్థితి వస్తుందని, ఆ రోజు కూడా తొందర్లోనే ఉందని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అనే చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. పైన వేమన చెప్పినట్టు కన్నవారిని చూడలేని వారు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అని ఏనాడో చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయి తమ సంతోషానికి అడ్డుగా వస్తున్నారు అని పది, వంద రూపాయల కోసం ఇప్పటి తరం వారు తల్లిదండ్రుల్ని చంపడం కూడా చేస్తూ పాపాలూ చేస్తున్నారు. వారంతా ఉన్నా లేనట్టే..
– భవ్య చారు