తల్లి మనసు.!
అప్పుడు సమయం రాత్రి 11.35 నిమిషాలు.. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.. ఆఫీస్ పనిలో పడి ఎప్పట్లాగే తినడం మర్చిపోయాడు సంతోష్.. వర్షం కాస్త తగ్గడంతో బైక్ తీసుకుని బయటకు వచ్చాడు..
అప్పుడు ఆకలి గుర్తురావడంతో బయట ఏదైనా దొరుకుతుందేమో చూద్దామని బయలుదేరాడు. వీధి చివరకు వచ్చే సరికి ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు సంతోష్..
ఓ పెద్దావిడ.. అప్పటికే వర్షంలో బాగా తడిసిపోయింది.. బాబూ అంటూ తన వద్దకు రమ్మని పిలుస్తోంది.. కాసేపు సంతోష్ కి ఏమీ అర్ధం కాలేదు.. అయినా, బైక్ యూ టర్న్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు.
ఆ అమ్మ చాలా ఆందోళనగా కనిపిస్తోంది.. ఎందుకో కంగారు పడుతోంది. “ఎవరమ్మా మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడున్నారేంటి?” అని అడిగాడు సంతోష్..” మా బాబు సినిమాకు వెళ్ళాడయ్యా, ఫోన్ చేస్తున్నా తీయడం లేదు..
ఈ వర్షంలో ఇంటికి ఎలా వస్తాడోనని భయంగా ఉంది.. నన్ను కాస్త థియేటర్ దగ్గర వరకూ తీసుకెళ్తావా.!” అని అడిగింది ఆ పెద్దావిడ.. దానికేముందమ్మా ఎక్కండి అని, బైక్ మీద జాగ్రత్తగా కూర్చోమని ముందుకు కదిలాడు సంతోష్ తన ఆకలిని పక్కనపెట్టి.
బైక్ మీద కూర్చున్న ఆ తల్లి..”బాబు ఒక్కసారి ఫోన్ తీసుంటే కంగారు ఉండేదికాదయ్యా.. నిన్ను ఇబ్బంది పెట్టాను”.. అంటుంటే.. అమ్మ ఎవరినైనా అమ్మేకదా.. అందరినీ తన బిడ్డలానే చూస్తుందికదా.. అనుకుంటున్నాడు సంతోష్..
“అంకుల్ హార్ట్ పేషెంట్.. వర్షంలో ఏమొస్తారు.. అలా అని ఇంట్లోనే ఉంటే..అమ్మో ఉండలేం.. వర్షానికి చెట్లు పడిపోయాయ్.. కరెంట్ వైర్లు తెగుంటాయ్.. బాబు ఎలా వస్తాడోనని చాలా కంగారుగా ఉందయ్యా.. ఏం కాకూడదని ఎంత మంది దేవుళ్ళకు మొక్కానో..” అంటూ తన ఆందోళనను వివరిస్తూనే ఉంది ఆ తల్లి జోరువానలో తడుస్తున్నాననే సంగతే మర్చిపోయి..
“అమ్మా మీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా.. ఈ వర్షంలో ఒక్కరే ఏ వాహనం లేకుండా ఇలా మీ అబ్బాయిని వెదుక్కుంటూ వచ్చేశారు.. కష్టం అనిపించలేదా” అని అడిగాడు సంతోష్..
“పిల్లలకంటే తల్లికి ఏదీ ఎక్కువకాదుగా బాబూ.. వారిపై ఉన్న ప్రేమపాశమే మా చేత ఏదైనా చేయిస్తుందయ్యా.” అంటూ ఆ తల్లి బదులిస్తుండగానే థియేటర్ దగ్గరకు చేరుకున్నారిద్దరూ..
పరుగు పరుగున వెళ్లి పార్కింగ్ ప్లేస్ లో తన కుమారుడి బైక్ ఉందో లేదో చూసుకుంది.. అది కనపడగానే.. హమ్మయ్య బైక్ ఉందంటూ ఆ అమ్మ కుదుటపడింది.. ఆమె మనసులో అలజడి కొంత తగ్గింది. సినిమా వదలడానికి ఇంకా అరగంట సమయం ఉండడంతో.. బాబుతోనే ఇంటికి వెళతానని అక్కడే కూర్చుంది.. సంతోష్ కూడా ఆమెతో పాటే ఉండిపోయాడు.
ఆమెతో ఉన్నంత సేపూ సంతోష్ కు తన తల్లే ఆమెలో కనిపించింది.. ఆ తల్లిని బిడ్డ దగ్గరకు చేర్చి.. అమ్మలంతా ఇంతే.. అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.. మనసులోనే ఆ తల్లికి నమస్కరిస్తూ.. తన తల్లిని స్మరించుకుంటూ.!
– ది పెన్