తల్లీ! చెల్లీ! మల్లీ!
అమ్మా! నీవు స్త్రీ అనే
ఏకాక్షర పదానివి
ఆదికి మూల పదార్ధానివి
సమాజానికి ముడి పదార్థానివి.
అందమైన యదార్ధానివి
కవిత్వాన్ని నడిపించే
అలంకార శాస్త్రానివి
కావ్య పదబంధ సూత్రానివి.
నీవు లేకపోతే
ఆద్యంతాలు లేవు.
కవి, రవి నీతోనే ప్రయాణం
కుంచెకూ నీవే ఆధారం.
గర్వ పడుతున్నావా?
సిగ్గు పడుతున్నావా?
రెండూ నీకే అందం.
కానీ!
ఇప్పుడు నీవు
నడి బజారులో షోకేసు బొమ్మవు
ప్రతిరోజు కన్నీటి చెమ్మవు
శవత్వపు మర బొమ్మవు.
నీతో కోట్లు నోట్లు
రాజకీయపు ఫీట్లు
చీకటి సామ్రాజ్యం పాట్లు
సమాజానికి తూట్లు.
ఇక మిగిలింది
రంగులు వెలిసి పోయిన
నీ ముఖ చిత్రం
మాకు కనిపించని
నీవు రాసిన ఒప్పంద పత్రం.
-గురువర్ధన్ రెడ్డి