తళతళలు
హేమంతంలో ఘనీభవించిన జ్ఞాపకాల తుషారం
నిషా కనుల నిశీధి విడిదిని ఖాళీ చేస్తుంది!
వేడుకై ప్రభాతం
మనసుకు ముచ్చట్ల చద్దిమూట విప్పుతుంది!
బాసలుచేసిన వెచ్చని వెలుగుల చెలికాడు
వెంటే ఉండి ఆశల ఆశ్వాసాల ఊపిరిలద్దుతుంటాడు!
ఊరుకోని పాదాలు ఊరికి ప్రదక్షిణ చేస్తూ
ఉత్తరాయణ అర్చన చేస్తుంటాయి!
కాలం కొమ్మమీద వర్తమాన కోయిల రొదచేస్తూ ఉంటుంది
కలం పొదిగిన అక్షరాలన్నీ నీరెండలా తళతళమంటాయి
– సి. యస్ .రాంబాబు