తలపుల అలజడి
నా మనసంతా ఆక్రమించావనుకున్నా…
ఆవిరులు రేపే తలపులతో రగిలిపోతుంటే..
తనువంతా అల్లరులు రేపుతుంటే అర్ధమైంది…
నాలోనే దాగున్నావని
నీవే నేనయ్యానని…
పిండారపోసినట్లున్న ఆ నిండు జాబిలి వెన్నెల కుమ్మరిస్తూంటే….
పెరట్లోని మల్లె పందిరి గుబాళించే పరిమళిస్తూంటే….
నిశీధిలా కమ్ముకున్న నల్లని నీ కురుల సంపెంగ నూనె మత్తెక్కిస్తూంటే…
నీకెలా ఎడంగా ఉండగలను సఖియా …
నీ సౌందర్యాన్ని ఆరాధిస్తూ కాలమంతా గడిపేయనా…
నాజూకైన నడుఒంపులో పుట్టుమచ్చనై దాగుండిపోనా…
నుదుట సింధూరమై కలకాలం అలరారనా…
ముంగురులలో చేరి నీ బుగ్గల నిగ్గులని తాకనా….
పెదవంచున దాగిన చిరునవ్వునై మెరిసిపోనా…
కర్ణాభరణమై నీ చెక్కిలి మీటి సరసమాడనా….
మెడలో తాళినై మెరిసిపోతూ పైయ్యెదని తాకనా…
వేడి నిట్టూర్పుల ఉచ్ఛ్వాస నిశ్వాసనవ్వనా…
చేతుల స్పర్శలోని అనురాగాన్ని పొందుతూ…
చుంబనాల మధురిమల అనుభవంలో…
అలరించే నీ సౌకుమార్యపు హక్కుదారునై దాగుతూ..
నీవు నేనైపోయిన తలపుల అలజడినై మురియనా….
– ఉమామహేశ్వరి యాళ్ళ