తారా చరణీయం రెండో భాగం

తారా చరణీయం రెండో భాగం

ఈ సీరియల్ మొదటి భాగం తారా చరణియం పరిచయం చదవండి తర్వాత ఇది చదవండి అప్పుడే మీకు అర్థమవుతుంది.

అమ్మాయ్ జ్యోతి నువ్వు బడికెళ్ళే ముందు నాన్నగారికి కొట్టులో టిఫిన్ బాక్స్ ఇచ్చి వెళ్ళమ్మా పొద్దుననగా వెళ్ళారు ఏమీ తినలేదు. పాపం ఎంత ఆకలిగా ఉన్నారో….

అసలే అంతంత మాత్రం ఆరోగ్యం అంటూ బాక్స్ పట్టుకుని అద్దం ముందు తయారవుతున్న కూతురి దగ్గరికి వచ్చింది జయమ్మ. అబ్బా అమ్మా నేను వెళ్లనే నాకు అక్కడికి వెళ్లాలి అంటే అదోలా అనిపిస్తుంది.

అందరూ పిచ్చి చూపులు చూస్తారు అంది జ్యోతి కొంచం నీరసంగా…. అయ్యో అలా అనుకుంటే ఎలా తల్లి… నువ్వు వెళ్ళేది మీ నాన్న కోసం కదా, అవ్వన్నీ పట్టించుకుంటే మనం వ్యాపారం చేయలేం చూసి చూడనట్టు వదిలేయాలి.

అక్కడే ఉండవు కదా బాక్స్ ఇచ్చి తొందరగా వెళ్ళిపో…. మనం బతికేది అదే వ్యాపారంతో కదమ్మా మనం అవన్నీ పట్టించుకుంటే మనుగడ కష్టం అంది జయమ్మ జ్యోతికి జీవిత పాఠాలు బోధిస్తూ..

అవునమ్మా కానీ వాళ్ళు మాట్లాడే మాటలు నాకు బాధ కలిగిస్తాయి. నిజంగా చాలా గలీజు మాటలు మాట్లాడతారు అంది జ్యోతి. మాట్లాడతారు అమ్మా మత్తు ఎక్కితే మనిషి ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియని పరిస్థితిలో ఉంటాడు.

ఏదో మనం బతకడానికి మన కుల వృత్తి అని చేస్తున్నాం. కానీ ఇది మనకు ఇష్టం లేదు. ఉన్న పొలాన్ని చూసుకుంటే చాలు కానీ కుల వృత్తిని మనెయ్యకూడదు కదా అందుకే ఇలా మీ నాన్నగారు తన చేతనైనంత కాలం చేయకాయక తప్పదు. అంది జయమ్మ.

అదేదో మానేసి ఆ చెట్లు అమ్మేసి ఇంక వేరే ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా అమ్మ జ్యోతి. లేదమ్మా ఇది తరతరాలుగా వస్తున్నది మీ నాన్నకు తెలిసింది ఇది ఒక్కటే…

ఆయన ఉన్నంత కాలం చేయక తప్పదు కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు కానీ మాకు ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా. చూద్దాం కాలం ఎలా సాగి పోతుందో… సరే అయితే నాన్నగారికి ఈ బాక్స్ ఇవ్వు బడికి వేళయింది అంటూ చేతిలో పెట్టింది జయమ్మ.

సరే అమ్మా కానీ ఈ ఒక్కసారి ఇస్తాను ఇంకొకసారి నన్ను వెళ్ళమంటే మాత్రం నేను వెళ్లను. నువ్వే  నాన్న వెళ్లేటప్పుడు బాక్స్ ఇచ్చేసేయ్ నన్ను కూడా అందరూ వెక్కిరిస్తున్నారు అంది జ్యోతి.

అలాగే తల్లి… రేపట్నుంచి కాస్త పొద్దున్నే లేచి వంట చేస్తాను. మా అమ్మ కదూ ఈ ఒక్కసారికి తీసుకెళ్ళు అంటూ కవర్ బాక్స్ పెట్టి ఇచ్చింది భుజానికి వేసుకుని చేతిలో పట్టుకొని వెళ్తున్నా అంటూ బయటకు వెళ్లి పోయింది.

ఏంటో జీతాలు వద్దు అనుకున్న పని చేయాల్సి వస్తుంది అంటూ తన పని లోకి వెళ్లి పోయింది జయమ్మ.

********

బాబు చరణ్ మన దుకాణానికి రమ్మని నాన్న చెప్పి వెళ్ళారు. నువ్వు వెళ్తావా అంటూ వంటగది లో నుండి చాయి గ్లాసు తెచ్చి కొడుక్కు ఇస్తూ అడిగింది లక్ష్మి.

ఏ ఎవడు పోతాడు అక్కడికి… ఏముంది అక్కడ, ఉన్నవి గీస్తూ, సాపు చేస్తూ, కడిగినవే కడుగుతూ, గీక్కోడమే పని నేను పోను తమ్ముణ్ణి పంపు నాకు వేరే పనుంది అన్నాడు చరణ్ విసుగ్గా….

అరె ఇంటికి పెద్దోనివి పని నేర్సుకోవాలే మీ నాన్న తర్వాత నువ్వే గదా ఇంటిని చూడాలి. పోక పోతే పని ఎవరు చేస్తారు? ఇల్లెట్ల గడుస్తుంది?

ఉన్నది నలుగురం చేసేది ఒక్కడు అంటే సాల్తాయా పైసల్? జర నువ్వు ఆసరా అయితే మంచిగా ఉంటదిరా పో పోయి పని నేర్చుకో అంది లక్ష్మి.

ఏ పో అమ్మా ఎవడు చేస్తాడు గా పని నాకు వద్దు నేను నేర్సుకోను ఏమైతే గది అయితది అన్నాడు చరణ్. అరేయ్ బిడ్డ గట్ల అనకు పని నేర్సుకుంటే నువ్వూ నీ పిల్లలు బతుకుతారు అంది లక్ష్మి. పోవే నేను నేర్చుకొను ఏదన్నా బిజినెస్ పెడతా అన్నాడు చరణ్.

చదువుకో అంటే చదువుకోలేదు ఇప్పుడేమో బిజినెస్ పెడ్తా అంటున్నావ్ ఏం బిజినెస్ లు పెడతావ్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి వెళ్లి పని నేర్చుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి చెప్పినట్టు విను.

నీకు బిజినెస్ కావాలంటే పెట్టుకోవాలంటే నువ్వే సంపాదించుకో 24 గంటలు దోస్తులు అంటూ తిరుగుతావ్ మా దగ్గర అయితే ఏం లేవు ఆ దోస్తులే నీకు సాయం చేస్తారేమో పోయి అడుగు.

ఎవరు నీకు సాయం చేయడు మంచి మాట విని నాన్న చెప్పిన పని నేర్చుకో నువ్వే కాకుండా ఇంకో నలుగురికి పని కూడా నేర్చుకుంటే చదివిన ఆ తెలివి తోటి నా మాట విను అంది లక్ష్మి.

అమ్మా అది కాదే నేను చెప్పేది నువ్వు ఎప్పుడూ నీ పని చేసుకుంటూ కూర్చుంటే ఇక మనం మంచి దారులకి ఎప్పుడు వస్తావు పైసలు ఎప్పుడు సంపాదిస్తాం ఉన్నప్పుడే పని ఉంటది లేకపోతే మనకు పని ఉండదు ఏముండదు పొలం కూడా లేదు.

చదువుకునే నిఘా పని చేయమంటే నా దోస్తుల ముందట నా ఇజ్జత్ పోదా అందరూ నవ్వుతారు. నేను చెప్పేది నీకు అర్థం అయితలేదు నువ్వేనా నాకు చెప్పి ఎట్లా అన్నా పైసలు చూడు నీ కాళ్ళు మొక్కుతానే అన్నాడు చరణ్ తల్లిని బ్రతిమి లాడుతూ….

ఏమో బిడ్డ ఏం మాట్లాడుతున్నావో ఏమో కుల వృత్తిని వదిలేసి ఏదో అంటున్నావ్ అవన్నీ మనకు అచ్చిరావు బిడ్డా అవన్నీ నాకు తెలుసు అయినా మీ నాయనకు ఏం చెప్తావో నువ్వే చెప్పుకో ఆ బంగారం పని చేసుకో బంగారం లాగా ఉంటుంది నీ బతుకు కూడా చెప్పింది విను అంది లక్ష్మి.

ఏ పోవే నేను చెప్పింది ఇననే ఇనవు… ఎప్పుడు నీ మాట నీదే నేను చెప్పేదినే మనం మంచిగా అయితే మీ బిజినెస్ పెట్టుకుంటే పైసలు ఇయ్యుమని చెప్పే నాన్నను.

నువ్వు చెప్తే కచ్చితంగా ఇస్తాడు. ఇదిగో మీరు పైసలు ఇయ్యకపోతే నేను ఇంట్లో నుంచి పోత మల్ల తర్వాత మీ ఇష్టం అన్నాడు చరణ్ బెదిరిస్తూ….

ఏంరో ఊరుకుంటే నెత్తిమీదకేక్కుతున్నావ్ పోత అంటున్నావ్ ఎవర్ని బెదిరిస్తున్నవ్. ఏమైనా చేసుకో నాకు తెలువది మంచి మాట చెప్తే ఎవడు వినడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో బాగా దోస్తుల సోపతి పట్టి నాశనం అవుతున్నావ్. బయటకు పోతే నీకు ఈ ఒక్క పూట తిండి కూడా దొరకడం కష్టమే. పోయి సూడు తెలుస్తది అన్నది లక్ష్మి.

సరే అంటున్నవ్ లే పోతా అంటూ ఛాయ్ గిలాస అక్కడ ఎత్తేసి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు చరణ్. అప్పుడే పని నుంచి ఇంటికి వచ్చిన పద్మయ్య ఏందే లక్ష్మి వాడు అట్లా పోతుండు ఏమన్నావ్ మల్ల అంటూ అడిగాడు.

ఆ ఆ మీ ఇద్దరి వల్ల నాకు నెత్తి నొప్పి వస్తుంది పోయి పని చూసుకో రా అంటే నేర్చుకోడు అంట అదేదో బిజినెస్ చేస్తా పైసలు కావాలట నా నెత్తి మీద ఎక్కుతుండు.

నువ్వు నీ కొడుకు ఏమన్నా చేసుకోండి నాకేం తెల్వదు మధ్యలో నేను సస్తున్న అంటూ తను కూడా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. విషయం కొంచెం అర్థం అయిన పద్మయ్య ఆలోచిస్తూ వుండిపోయాడు. 

 

*********

 

భుజానికి వేసుకున్న బ్యాగు తో రెండు జడలతో స్కూల్ డ్రెస్ లో ముద్దమందారంలా నడిచి వస్తున్న జ్యోతిని చూస్తున్న ఆ ఊరి వాళ్ళ కళ్ళు తలుక్కున మెరుస్తూ ఉన్నాయి.

నిన్న మొన్నటి వరకు మొగ్గ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు విచ్చుకున్న పువ్వులా అందంగా కనబడుతుంటే చూసే కళ్ళకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది.

బడికి పోతున్నావా జ్యోతి అంటూ అడిగాడు సాంబయ్య లేదు సాంబయ్య తాత మా నాన్నకు టిఫిన్  ఇయ్యనీకి పోతున్న అంటూ చెప్పింది జ్యోతి.

అవునా దూరం నుంచి చక్కగా కనిపిస్త లేవు దగ్గరికి రా బిడ్డ అని పిలిచాడు సాంబయ్య. అతను ఏదో చెప్పబోతున్నాడు అని ఏందీ తాత అంటూ అమాయకంగా ముందుకు వెళ్ళింది జ్యోతి.

ఎంత ముద్దొస్తున్నావే జ్యోతి అంటూ ఆమె రెండు బుగ్గలు పట్టుకొని గట్టిగా నలిపేసాడు సాంబయ్య. తూ నీ బతుకు పాడుగాను నా బుగ్గలు పిండుతున్నావ్ అంటూ అతన్ని విదిలించుకుని ముందుకు పరుగెత్తింది జ్యోతి.

ఆమెకు జరిగిన అవమానం తో మొహం ఎర్రబడింది. దుఃఖం రాసాగింది వాడిని కొట్టాలని ఉన్నా పెద్దోడు అనే భావంతో ఏమీ చేయలేక పోయింది కంట్లో నుంచి కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ గబగబా తండ్రి ఉన్న దుకాణం దగ్గరికి వెళ్ళింది.

జ్యోతి తండ్రి దాసు గౌడ్. కుల వృత్తి కాబట్టి చిన్నగా రేకుల షెడ్డు వేసుకొని తాను గీసిన కళ్ళను అందులో అందరికీ అమ్ముతూ ఉంటాడు. దూరం నుంచి జ్యోతి రావడం గమనించిన దాసు గబగబా ఆమెకు ఎదురు వెళ్ళాడు.

నువ్వెందుకు వచ్చినవు బిడ్డా ఈడికి అంటూ అడిగాడు. అమ్మ నీకు అన్నం ఇచ్చి రమ్మంది ఆకలికి ఆగలేవు కదా అంటూ బాక్స్ చేతిలో పెట్టింది.

వెనకనుంచి రామరాజు వస్తూ, దాసు నీ బిడ్డ పెద్ద అయినట్టు ఉంది పప్పన్నం ఎప్పుడు పెడతావ్ అంటూ అడిగాడు. దానికి దాసు ఏం సమాధానం ఇవ్వకుండా జ్యోతి నువ్ వెళ్ళిపో అని చెప్పి ఆమెను పంపించాడు.

జ్యోతి నాలుగు అడుగులు వేయగానే దాసు రామరాజు తో పెడితా అన్నా అది ఇంకా చదువుకుంటుంది పిల్ల చదువుకుని ఏదో ఒక దారి చూసుకుంటుంది అన్నాడు.

దానికి రామరాజు ఎం చదువులో ఏమో కానీ ఎవరినీ ఎత్తుకొని పోకుండా ఉండేలా చూసుకో సాలు అంటూ వంకరగా నవ్వాడు.

అతనికి గట్టిగా సమాధానం ఇవ్వాలనుకున్న దాసు ఇస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తలుచుకుని ఏమీ అనలేక పోయాడు. ఊర్లో ఉండాలంటే ఇవన్నీ భరించాలి.

ఎవరికైనా ఎదురు వెళితే ఊర్లో ఉండనివ్వరు నోరు జారితే ఎదురయ్యే సమస్యల గురించి తెలుసు కాబట్టి మొహం మీదికి నవ్వు పులుముకుని అట్లనే అన్నా అంటూ వడివడిగా అక్కడినుంచి లోపలికి వెళ్ళిపోయాడు.

రామరాజు తండ్రితో అంటున్న మాటలు గాలిలో తేలి వచ్చి జ్యోతి వినబడుతూనే ఉన్నాయి. ఆమెలో ఉక్రోషం పొంగుకొచ్చింది ఆడపిల్ల అంటే అందరికీ ఆలుసా అందుకే నాన్నని వృత్తి మానేయమని అన్నాను.

కానీ నాన్న అసలు వినిపించుకోరు. ఈ పెద్దవాళ్ళు వాళ్ళు పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనుకుంటారు. కానీ మా చిన్నవాళ్ళ మనసును అర్థం చేసుకోరు ఆ వెధవ కి నాలుగు తగిలించి చెప్తే ఏమయ్యేది అని మనసులో బాధపడుతూ బడి వైపు అడుగులు వేసింది జ్యోతి.

ఇలా ఇద్దరు కులవృత్తులు మానేయాలని అనుకున్నా జ్యోతి చరణ్ లు ఒకటయ్యారా, వారి అభిప్రాయం సరైనదేనా? వీరిద్దరికీ ఎలా పరిచయం అయింది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *