శ్వేత పరిమళ గంధం
మునుపెన్నడు ఎరుగను ఈ కలవరము ..
చేరలేదు కనులకు ప్రకృతి
సోయగమైన వర్ణాల సౌదర్యం .
ఎదురుపడే ప్రతి చెట్టూ
ఇప్పుడే పలకరిస్తున్నట్లు ఉందేమిటి.
నా జత నీవు చేరగనే
నాకు త్రినేత్రం తెరుచుకుందేమో
!కడుపడుతుంది
ప్రతిదీ మనోహర దృశ్యంగా.
చక్కిలి గింతలు పెడుతున్నాయి
కొత్త అందాలు నన్ను చేరి మురిపిస్తూ.
కనులకు ఇంద్రధనస్సు వర్ణాలు
వర్ణించలేని అందాలు కలల
కౌముదిలో రాగవీణలు
మీటుతున్నాయి నీ జతలో ..
ఈ ఊహల ప్రపంచంలో
గగనంచేరి మబ్బుల
పరదాల వెనుక చుక్కల
పూలతోటలో తీసుకుందాము
జాబిలి,పంచభూతల దీవెనలు ..
అల్లిబిల్లి ఆటల జిలిబిలి పాటలతో
శిరి భూలచ్చిమి
మురవంగ పాడుకుందాము !.
తడిపొడి తపనల
శశిశేఖరుడి వన్నెల
వెన్నెల వసంతమే చల్లుకుందాము
మధువనిలో తలపుల
అడుగులతో కులుకుల
పరుగులు తీద్దాము .
ముసిముసి నవ్వులతో
ముచ్చటల కోలాటం ఆడుకుందాము..
రావోయి ఈ రంగుల
లోకంలో శ్వేతపు పరిమళాల
భావ గంధాలు
అద్దుకుందాము …
మధురమైన భావ ప్రపంచంలో
హద్దులు లేని చిలకలమై
ఎగిరిపోదాము రావోయి…
-ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి