స్వార్ధానికి తొలిమెట్టు
ఓటుకు నోటు తీసుకోవటం అనేది ప్రజల స్వార్ధానికి తొలి మెట్టు. అందరూ తమ ఓటు వేయటానికి నోట్లు తీసుకుని ఓటు వేస్తున్నారు అని అనటం లేదు కానీ మెజార్టీ ప్రజలు మాత్రం డబ్బులు తీసుకునే ఓటు వేస్తున్నారు. చాలామంది చదువుకున్న వారు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు.
ఇదే అవకాశంగా తీసుకుని కొందరు రాజకీయ నాయకులు ప్రజలకు డబ్బులు ఇచ్చి తమకే ఓట్లన్నీ వేయాలని ప్రలోభ పెడుతూ ఉన్నారు. డబ్బులే కాకుండా బట్టలు,బంగారు ఆభరణాలే కాకుండా ఇతర తాయిలాలు కూడా ఇవ్వజూపుతుంటే కొందరు ఓటర్లు బహుమతులకు ఆశపడి తమ ఓట్లు అమ్మేస్తున్నారు.
గెలిచిన నాయకులైతే ఎలక్షన్లో తాము పెట్టిన పెట్టుబడి రాబట్టుకునేందుకు అవినీతి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. వీలైనంత ప్రజాధనం దోచేందుకే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు చాలా విలువైనది అనేది ఓటరుకు అర్ధం అయిన నాడు దేశం బాగుపడుతుంది. ఏదో కొద్ది మొత్తానికి తమ ఓటు
అమ్మేసి మిగతా ఐదేళ్లు ఈసురోమంటూ కాలం గడిపేస్తున్నారు. కష్టాలపాలు అవుతున్నారు.
పూర్వం ఎలక్షన్లో ఇంత ఖర్చు అయ్యేది కాదు. ఇప్పుడు వందల కోట్లు ఖర్చు అయిపోతోంది. సామాన్య మానవుడు ఎలక్షన్లో నుంచుని గెలిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి మారాలంటే సామాన్యుని ఆలోచన మారాల్సిందే.
– వెంకట భానుప్రసాద్ చలసాని