స్త్రీ
ఎన్నో ఊసులు చెప్పాలనుకుంటా..
కానీ వినేతీరిక నీకెక్కడిది..
నీతో మాట్లడాలని ప్రయత్నించిన
ప్రతిసారీ మాటలు శిశిరపత్రాలవుతాయి..
నీ మాటలకైనా హాయిగా
నవ్వాలనుకుంటాను
కంటిచూపు తోనే
కసురులాజ్ఞతో కట్టడిచేస్తావు
నువ్వేలోకమంటావు
నా శ్వాస నువ్వేనంటావు
అంతలోనే ఎన్నో హద్దులు పెడతావు
ఏవో ఆంక్షలు విధిస్తావు
నీ మాటల మురళీగానానికి
రాసలీలలాడిన రాధలా
మైమరిచిపోయిన ప్రతిసారి
మనసుకు సంప్రదాయల
సంకెల వేస్తావు
ఆకాశమే హద్దుగా విహరించాలనుకుంటాను
నా స్వేచ్ఛా విహంగాన్ని
విరిచి పరిధి విధిస్తావు..
నా దేవత నువ్వంటావు
నీకోసం ఎన్నో మ్రొక్కులు
మ్రొక్కుకున్నానంటావు
నా ఉత్సవ విగ్రహానికి
వత్సరానికి ఒకసారి అయినా ఊరేగింపు నిషేధిస్తావు
హద్దుల పంజరంలో
బంధీనైన నా ఊసులు
చిలుకపలుకలే మరి…
నాలో నేనై నాతోనేను
మాట్లాడుకుంటూ…
ఊసుల ఉనికికి
భాష కూడా
అడుగంటి పోయింది
నా మనసు మృగతృష్ణలో
మాటల చెలమను
వెతకడానికి ప్రయత్నించిన ప్రతిసారి
మౌనరాగలే వినిపిస్తున్నాయి..
– సలాది భాగ్యలక్ష్మి