స్త్రీ హృదయం
ఈ సృష్టిలో స్త్రీల యొక్క మనస్తత్వం తెలుసుకోవడానికి, ఎక్కడో విజయం సాధించిన వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే ఉండే తల్లి,చెల్లి,భార్య వీళ్ళని చూస్తే చాలు.
ఒక ఇంట్లో కేవలం నలుగురు సరిపడా అన్నం ఎవరో ఐదో వ్యక్తి వచ్చినాసరే సరిపోతుందంటే, ఏమని చెప్పగలం, ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎవరి ఆకలి ఆగిపోతుంది?
ఎప్పుడో ఆదివారము లేదా నెలకొకసారి వండుకున్న ప్రత్యేక వంటకం, మీరు తినండి అని భర్త,పిల్లలకే పెట్టేస్తున్న ఆమెది స్వార్థం అని ఎలా చెప్పగలం.
పిల్లవాడు చదువుల కోసం పట్నం వెళుతున్నప్పుడు,భర్తకు తెలియకుండా పోపుల డబ్బాలో దాచుకున్న కొంచం డబ్బులు, తన అవసరాన్ని కూడా లెక్కచేయకుండా, పిల్లవాడి జోబులో పెట్టే ప్రేమని ఎంతని వెలకట్టగలం.
చీకటి కావస్తున్నా భర్త ఇంకా ఇంటికి రాలేదని,తెలిసిన వాళ్లందరినీ అడుగుతూ,భర్త వచ్చేవరకు గుమ్మం దగ్గరే పడిగాపులు కాస్తున్న ఆమె ప్రేమని ఎంతని వర్ణించగలం.
తను ఎన్ని కష్టాలు పడుతున్నా, తన వలన ఎవరు బాధపడకూడదు అని తనలోనే దాచుకున్న తత్వాన్ని
నిస్సహాయత అని చెప్పగలమా?
ఆడపిల్లకు ఎందుకు పెద్దపెద్ద చదువులు,పెళ్లి చేసి పంపొచ్చు కదా అనే మాటలు విన్న ఆమె బాధని ఎవరు అర్థం చేసుకోగలరు.
సగ జీవితం కూడా గడవకుండానేపుట్టినింటికి,తల్లిదండ్రులకి దూరమవుతున్న తన వేదనని ఎవరు ఓదార్చగలరు?
గంగ, యమునా,నర్మదా, తపతి,గోదావరి, కృష్ణ, ఇలాంటి ఎన్నో నదులకు స్త్రీ పేర్లే పెట్టారంటే
స్త్రీ యొక్క పవిత్రతని,శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ నదులన్నీ కలిసి ఉప్పొంగితే దేశం ఎంత ప్రమాదంలో పడుతుందో,అలాగే స్త్రీ యొక్క కోపం వల్ల కూడా ప్రపంచమే తగలబడిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమేలేదు.
– కోటేశ్వరరావు