స్టార్ హోటల్!!

స్టార్ హోటల్!!

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే ఘట్టం అది. సుమారుగా రాత్రి 8 గంటలకి స్నేహితులందరూ ఒక్కరొక్కరుగా మెల్లగా రావడం పూర్తయింది.

అది ఒక హైవే పక్కన ఉన్న చిన్న గుడిసె. అదే ఆ రోజు రాత్రికి మా మకాం. దాన్ని ఒక ముసలాయన నడుపుతున్నాడు. మేము తాత అని పిలుస్తాం.

ఆయన ఉదయం పూట ఛాయ్ దుకాణం నడుపుతాడు అందులో. ఆ పెద్దాయనతో మా అందరికీ చక్కటి బంధం ఉంది. జానపద గేయాలు పాడుతూ ఈలలు వేస్తూ నవయవ్వన యువకుడిలా ఉంటాడు ఆ పెద్దాయన.

ఇక మమ్మల్నందర్నీ చూడగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. తనకి మంచి నేస్తాలు దొరికాయి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అని తబ్బి ఉబ్బి పోయాడు ఆ పెద్దాయన.

ఇంకా చల్లారని ఆ బొగ్గు పొయ్యి పై శనగలు ఉడక పెట్టేశాడు, మమ్మల్ని చూసి. ఇక రాత్రంతా మజా మరి. ఆ రాత్రి చలికి గొంగళి కప్పుకుని పడుకునే అవసరం రాదు పాపం ఆయనకి.

పక్కనే ఇంకో పొయ్యి పై బాణలి పెట్టి నూనె పోశాడు. మసాలా దట్టించిన మిరపకాయలను శనగ పిండిలో ముంచి నూనెలో వేశాడు. మిరపకాయ బజ్జీలు రెడీ.

ఆ పెద్దాయనని చూస్తుంటే ఆయనకు జీవితం పట్ల నూతన ఆశలు చిగురించినట్లుగా అనిపించింది.

” ఏమే, నాయనా, సుక్క ఎయ్యాలె ఇయాల, నువ్వు” అన్నాను నేను.

“గదేంది బిడ్డ….. నేను సుక్కయ్య కుంటే, పాట ఎవడు పాడ్తడు? గంతులు ఎవడు ఎగుర్తరు? బాజాప్తా, సుక్కేంది ఒక పవ్వ ఏస్త తీ” అన్నాడు.

” గట్లనే నాయనా, పవ్వేంది, ఫుల్లు కొట్టవే తాక్కుంట మజా చేద్దాం నాతిరికి ” అన్నాను.

“గట్లనే కొడకా. జీవి పై ఆశ పోజిక్కె నాకు. నన్ను సాకని నా కొడుకుల జాగల మిమ్ములను పంపిండు ఆ భగవంతుడు. మీరు గిట్లనే నా కాడికి వచ్చి పోతూ ఉండుర్రి నా చివరి ఆశ ఇదే నాయనలారా.” అన్నాడు పెద్దమనిషి.

“గదేం, పెద్ద ముచ్చట కాదు నాయనా. ప్రతి ఆరం వొత్తం నిన్ను సూత్తం. నిబ్బరంగా ఉండే. నా మీద నమ్మిక ఉంచు.” అన్నాను నేను.

*******

చలికాలం. పైగా రాత్రి. చుట్టూరా చెట్లు, బొత్తిగా ఇళ్లు లేని ప్రాంతం అది. మధ్య మధ్యలో హైవే కావడంతో, లారీల మరియు ఇతర వాహనాల లైట్లు వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి.

వాటి సంఖ్య కూడా చాలా పల్చగా ఉంది. ఎందుకంటే మరి అది ప్రత్యేకమైన రాత్రి. చల్లని గాలి రివ్వున వీస్తోంది. కీచురాళ్ళు, ‘కానీయుండ్రి’ మీ పని అన్ని స్వాగత గీతాలు ఆలపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తోంది.

గుడిసె లో ఒక చిన్న దీపం. మధ్యలో టేబులు. కుర్చీలు లేవు కాబట్టి మూడు వైపులా బెంచీలు వేశాము. గుడాలు, మిరపకాయ బజ్జీలు టేబుల్ పైన మధ్యలో పెట్టాను. కార్యక్రమం ఇక షురూ.

*******

“నాయనా ఏ పాట ఎయ్యాలే ?” అడిగాడు ఆనంద్.

” కొడిబాయె లచ్చమ్మా దీ” పాట ఏయ్” అన్నాడా పెద్దాయన.

“ఏత్త” అన్నాడు ఆనంద్.

” ఆగు బిడ్డ ఆగు ఒక సుక్కేసినంక, ఏత్తువు తీయ్. ” అన్నాడు.

“గట్లనే నాయన తాత్పరంగా లాగించు.” అన్నాడు ఆనంద్.

“బిడ్డ ఒక గుక్క మింగిన. పాట ఏయ్” అన్నాడు పెద్దాయన.

పాట ప్రారంభం. ముసలాయన ఎగురుడు ప్రారంభం. ఆయనతో పాటు మేము కూడా గుంతులే, గంతులు.

*******

ఇలా జీవితం పట్ల ఆశ పోయిన ఆ పెద్దమనిషికి మా ప్రేమ ఆప్యాయతలతో కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇలా ఆనందంగా గడిచి పోయింది ఆ రాత్రి.

శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇక్కడే ఓ గమ్మత్తైన విషయం జరిగింది. మా ఫ్రెండ్స్ లో ఒకడు నేను వెళ్తాను నన్ను పంపించండి అన్నాడు.

సరే అని అందరం రోడ్డు మీదకి వచ్చాము. లారీని ఆపి వాడిని ఉప్పు బస్తా పడేసినట్టు డ్రైవర్ క్యాబిన్ లో పడేసి మళ్ళీ వచ్చి తాతతో కూర్చున్నాం.

మళ్లీ మస్తీ షురూ.

ఆ లారీ ఎక్కిన మా ఫ్రెండ్ దాన్ని కొంత దూరం పోయాక ఆపించి దిగిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు.

“ఏమైంది రా మళ్లీ వచ్చినవ్” అన్నాను నేను.

“ఏమోరా భయం అయింది.” అన్నాడు వాడు.

” నీకు భయం ఏందిరా ఫుల్లు కొట్టినవ్ కదా? ” అన్నాను నేను.

“నేనే అయితే ఓకే రా, కానీ వాడు కూడా ఏసిండు.”

“గాడు అంటే ఎవర్రా?”

“గాడే లారీ నడిపే టోడు.”

“అయితే ఏంది?”

” నేను నడుపుతా లారీ”, అన్నాను వానితో.

“నేనొక్కన్నే తాగిన్నా.. నువ్వు మాత్రం తాగలే…? నువ్వు నడుపుతే నేను సల్లగ కూసుండాలినా” అని నన్ను లారీ దించిండు.

వీడి మాటలు విన్న పెద్దాయన ఇక పెద్ద ఈల వేశాడు అందరం గొల్లుమని నవ్వుకున్నాం. మరి దీన్ని ఏమనాలండి? జీవితం మీద ఆశ.

– వాసు

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *