స్నేహ ధర్మం

స్నేహ ధర్మం
( చిన్న కథ )

తెల్లవారు ఝాము నే నరసాపురం నుండి రాజమండ్రి పోవు రైలు లో భీమవరం నుంచి భీమారావు బయలుదేరాడు. తణుకు స్టేషన్ లో తాతారావు వెతుక్కుంటూ భీమారావు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కొంచం స్థిమిత పడ్డాక…

” ఏరా భీమా..నీ అభిప్రాయం ఏమిటి…? నాకయితే వాడిని కలిశాక పరిస్థితి ఎలా దారి తీస్తుందోనని గాబరాగా ఉంది. మొన్ననే అమ్మాయి పెళ్లికి తాంబూలాలు కూడా తీసుకున్నాం. పెళ్లి ముహూర్తం దగ్గిర పడుతొంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను.” అన్నాడు తాతారావు.

” ఒరే.. వాడు మనకు చిన్నప్పటి నుంచి తెలుసుగా. నువ్వేమి ఖంగారు పడకు. వాడు ఏమంటాడో విని నిర్ణయం తీసుకుందాం. అయినా మనం ఇష్టపడేగా చేయి కలిపింది. నా ఉద్దేశ్యంలో అసలు వస్తే చాలు, అదే పదివేలు అనుకుంటున్నాను. మరి నువ్వు ఏమంటావు..?” అన్నాడు భీమారావు. తాతారావు అంతేలే అన్నట్టు తలూపేడు.

రాజమండ్రిలో రైలు దిగి భీమారావు, తాతారావులు ఇద్దరు తిన్నగా రామారావు ఇంటికి ఉదయం 8 గంటల సమయానికి చేరారు. ఇద్దరిని చూడగానే ” రండిరా.. మీకోసమే ఎదురు చూస్తున్నాను. తెల్లవారు ఝామునే బయలుదేరి వచ్చారు. ముందు టిఫిన్ తినండి. తరువాత మాట్లాడుకుందాం. నేను కూడా ఇంకా తినలేదు.” అన్నాడు రామారావు. టిఫిన్లు అయ్యాక ముగ్గురు రామారావు ఆఫీస్ రూము లోకి వెళ్ళేరు.

ముందుగా రామారావు మాట్లాడం ప్రారంభించేడు. ” ఎలా మొదెలెట్టాలో ఎక్కడ మొదలెట్టాలో అర్ధం కావటం లేదు. అంచేత డైరెక్ట్ గా పాయింట్ లోకి వస్తా. మీరిద్దరూ నా మీద నమ్మకంతో నాతో చేయి కలిపి నేను భాగస్వాముడుగా ఉన్న వ్యాపారంలో ఇండైరెక్టుగా చేయి కలిపారు.

నేను నా వ్యాపార మిత్రునితో డైరెక్టుగా చెయ్యి కలిపా. మేమిద్దరం కలసి ఢిల్లీలో ఉండే మాకు ఇదివరకటి నుంచి బాగా తెలుసున్న ఒక నార్త్ ఇండియన్ తో కలిపి మన నలుగురి మొత్తాన్ని సగం వాటాగా రెండు కోట్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. మొదటి ఏడాది వ్యాపారంతో కొంత నిలతొక్కుకున్నాము అనే భావం కలిగింది.

కానీ మరుసటి ఏడాదికి వ్యాపారం పూర్తిగా స్తంభించి పోయింది. తరువాత దేశంలో వ్యాపారరంగంలో ఎన్నెన్ని మార్పులు వచ్చాయో మీకు తెలుసు. ఎంత కృషి చేసినా వ్యాపారం పునరుద్దరించే పరిస్థితి కనపడ లేదు. ఆ నార్త్ ఇండియన్ భాగస్తుడు ” ఇప్పుడు వెంటనే మనం ఎదో ఒక నిర్ణయానికి రాకపోతే మొత్తం అసలుకే మోసం రావచ్చు. కనుక నా దృష్టిలో మన కాంపిటీటర్ మన కన్నా వ్యాపారంలో పెద్ద వాడు.

అతను మన వ్యాపారాన్ని కొనుక్కుందుకు రెడీగా ఉన్నాడు. ఎంతిస్తానంటాడో చూసి మనం మన వ్యాపారాన్ని వదులుకోవడం మంచిది” అన్నాడు. నేను, నా మిత్రుడు కూడా ఆలోచించుకుని సరే అన్నాము. మొన్ననే వ్యాపారం చేయి మారి మా ఇద్దరి వాటాగా కోటి నష్టంతో కోటి రూపాయలు తిరిగి దక్కాయి.

అందులో నా చేతికి 50 లక్షలు వచ్చాయి. నా దగ్గర అడుగు బొడుగు అంతా కలిపి మొత్తం 62 లక్షలు సమకూరాయి. మీరిద్దరూ ఇచ్చిన చెరో పాతిక లక్షలకు ఏడాదికి 12% వడ్డీ చొప్పున రెండు సంవత్సరాలకు మీ ఇద్దరికీ కలిపి ఈ 62 లక్షలు తీసుకోండి.

ఇంతకన్నా నా దగ్గర ఏమి లేవు. గత 20 ఏళ్లుగా సంపాదించినది, కూడపెట్టినది అంతా పోయింది. మళ్ళీ జీవితాన్ని తిరిగి కొత్తగా ఆరంభించాలి. చూద్దాం ఏం రాసిపెట్టి ఉందొ. మీరు ఊహించిన ఆశలు నెరవేరనందుకు నన్ను క్షమించండి ” అని రామారావు అన్నాడు.

ఇంతవరకు మౌనంగా రామారావు చెప్పినది విన్న భీమారావు, తాతారావు లకు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భీమారావు రైలులో అన్న మాటను గుర్తు చేసుకుంటూ ” ఒరే రామా… మన ముగ్గురం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే.

ఎదో ఊహిస్తే ఇంకేదో జరిగింది. అలాగని మాకు మేముగా చేతులు కాల్చుకోలేముగా. నిజం చెప్పాలంటే మాకు అసలు తిరిగి వస్తే చాలు అని ఇద్దరమూ అనుకున్నాము. ఏరా..భీమా అంతేగా.

అందుచేత మాకు వడ్డీ వద్దు. అసలు ఇచ్చేయ్. చాలు. మిగిలిన 12 లక్షలతో మళ్ళీ నీ కొత్త జీవితాన్ని ప్రారంభించు.

ఏదైనా అవసరం వస్తే మళ్లీ అప్పుడు చూద్దాం. నువ్వు దిగులు చెందకు. మా అమ్మాయి పెళ్ళి శుభలేఖ పంపుతాను. తప్పకూండా ఫామిలీతో రా” అన్నాడు తాతారావు. భీమారావు, తాతారావు లు ఇద్దరు చెరో పాతిక లక్షలు తీసుకుని తిరుగు ప్రయాణం మొదలెట్టారు.

-గురువర్థన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *