“సిరివెన్నెల” జయంతి సందర్భంగా…!!

“సిరివెన్నెల” జయంతి సందర్భంగా…!!

సాంప్రదాయ పునాదులపై
అభ్యుదయ కవితావిపంచి!

సిరివెన్నెల కురిపిస్తాడు…
🔥అగ్గితో కిలుం వదిలిస్తాడు!

*వెన్నెల, వేడే కాదు….
ఆయన వాక్కూ వాడే…!

ప్రణయమైనా,.. ప్రళయమైనా..
ఆయన కలానికి తిరుగులేదు

ఆయన పలుకు బంగారం..
ఆయన కులుకు సింగారం..!

ఆయన స్థితి ‘మతుడు’ …
ఆయన అక్షర ‘సంపన్నుడు’

అమావాస నిశిలో సైతం….
నిండుగా కురిసే సిరివెన్నెల..!!

నా ఉఛ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం..అన్న కవి
సరసస్వరసుర ఝరీ గమనమౌ
సామవేద సారాన్ని తెలిపిన..కవి సిరివెన్నెల

జగమంత కుటుంబమును
పాటగా చేసుకుని

జనమంత నాడిని పాటగా పట్టుకుని
ఎదగాయం గేయంగా మలచుకుని

ఆదిభిక్షువు నేది అడిగేదంటూ
ఏమీ తీసికెళ్లకుండానే వెళ్లిపోయావా
సీతారామశాస్త్రీ.. సినీ సాహిత్య మేస్త్రీ!!

అనవరతం అనర్ఘరత్నం వెండితెరహారం
నీ గీతమని ఇన్నాళ్లూ
గుండెల మీద చెయ్యేసుకుని
శ్వాసమీద విశ్వాసం ఉంచుకుని
అక్షరధ్యాస మళ్లని ధ్యానమై
ఎంతధీమాగా ఉన్నామో!

బలపం పట్టి భామ ఒళ్లో
సినీ శృంగారానికి నీవుపట్టిన హారతి పళ్లెం
నిండుగా పేరుకున్న అ ఆ ఇ ఈ ఉ ఊ లే!

ఇంక శలవంటూ
పాటకేనాడైనా ఆగావా?!
పాటకోసం పుట్టిన వాడివా
పాటకోసం బతికిన వాడివా
పాటకోసమే జీవించిన వాడివి కదూ!!

పాట తపనగానే
తరించి పరమపదమైన మహానుభావుడా!

మా కలాల మీద
కవితాలతల వరాల సిరివెన్నెల పూలజల్లులై
అలా కురుస్తూనే వుంటావు కదూ!

వెండితెర మీద మెండుగానే
సిరివెన్నెల కురిసి వెళ్లిందిలే…

సిరివెన్నెల గారి అక్షర నివాళి 🙏🙏🙏

 

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *