సింగినాదం – జీలకర్ర

సింగినాదం – జీలకర్ర

అందరికీ కొన్ని చాదస్తాలున్నట్టుసీతారాముడికీ కొన్ని చాదస్తాలున్నాయి.ఏదైనా విషయం తనకి నచ్చకపోతే మొహమాటం లేకుండా మొహం మీద చెప్పగలడు.
దాని పర్యవసానాలతో అతనికి నిమిత్తం లేదు.
మొన్నామధ్య ఎర్రటి ఎండలో మెట్రోదిగి ఆటోలో వస్తున్నాడు.ఒక పెద్దమనిషి మోటార్ సైకిల్ మీదొస్తూ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద అడ్డంగా వెళుతున్నాడు.లక్కీగా ట్రాఫిక్ లేదా రోజున.సీతారాముడికి కోపం ఛర్రుమంది.ఆటోని మోటార్ సైకిల్ పక్కగా వెళ్ళమన్నాడు.దగ్గరకు రాగానే ఇలా అందుకున్నాడు

“ఏమయ్యా నీకు మతుందా..ఓ పక్క ఎండ మండుతుంటే ఫోన్లో తాపీగా మాట్లాడుతూ వెళుతున్నావు..నీ హెల్త్ గురించి,నీ కుటుంబం గురించి ఏమి ఆలోచించవా… ఫోనే నీ సర్వస్వమా”
అంటూ నాలుగు చివాట్లేశాడు.

ఆ పెద్దమనిషి ఏమిటీ అకాల వర్షం అని అనుకునేలోపలే ఆటోవాడిని ఇక పోనీయ్ అన్నాడు.ఇలా ఉంటుంది సీతారాముడి తంతు.ఎవరివంతు ఎపుడొస్తుందో తెలీదు.సీతారాముడిని మార్చటానికో, కంట్రోల్ చేయటానికి సీతారాముడి సీనియర్ సిటిజన్ అయి కూచున్నాడు.ఇంట్లోవాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు.కొడుకులు,భార్యా,అన్నలు, అక్కలు ఎవరి వలన కాలేదు.అలా అని సీతారాముడు విలనేమీ కాదు.అందరిలా అతనుండడు..అదే అతని సమస్య.కానీ సీతారాముడు హీరో అయే సందర్భం ఒకటొచ్చింది.

మనవాడికి మన మెట్రో అంటే మహాప్రేమ.ఛాన్స్ వచ్చినా రాకపోయినా మెట్రోని వదలడు.ఈమధ్య ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు మెట్రో లో ఒక ఆడియో ప్రకటన సీతారాముడికి కంపరం పుట్టించింది.”అమెరికా… అమెరికా.. అమెరికా వెళదామనుకుంటున్నారా..అక్కడ చదువుదామనుకుంటున్నారా.. అయితే మమ్మల్ని సంప్రదించండి..మానెంబర్ కు వెంఠనే కాల్ చేయండి..”ఇలా ఆ ‘స్టోన్'(రాయి లాంటి గొంతు) పూర్తయిందో లేదో”మీరు యూ.కె.వెళదామనుకుంటున్నారా..అక్కడ చదువుదామనుకుంటున్నారా.. అయితే మమ్మల్నే సంప్రదించండి.

మీ కలను నిజం చేసుకోండి..”అంటూ మరోసారి మెట్రో మొత్తాన్ని గడగడలాడించిందా గొంతు.ఏదో ఒకసారంటే సర్దుకుపోయేవాడేమో సీతారాముడు..అలా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ ప్రయాణం లోఐదు నిమిషాల కొకసారి షాక్ కొట్టినట్టు వినిపించే ఆ ప్రకటనలకు విసుగెత్తిన సీతారాముడు ఇంకా లాభం లేదనుకున్నాడు.
స్టేషన్ లో దిగగానే సదరు నెంబర్ కు కాల్ చేశాడు.

“చెప్పండి సర్.. ఎవరు వెళుతున్నారు..మీ అబ్బాయా..అమ్మాయా..ఎపుడు వెళ్తారు..ఏ కోర్సు చేస్తారు..”ఇలా ప్రశ్నల పరంపర కురిపించింది అవతలి గొంతు..

“చూడమ్మా.. మావాళ్ళు ఎవరూ వెళటం లేదు..మీకో సలహా చెబుదామని కాల్ చేశాను.మీ ప్రకటన విన్నాను మెట్రోలో.. అయితే మీరు ఆ స్టోన్ తో మా చెవులు బద్దలు కొట్టే బదులు చక్కగా వీడియో చేసి పెట్టండి.కాస్త ఖర్చయినా అది వర్కవుట్ అవుతుంది.మీరు ఇదే ఆడియోతో జనాలను విసిగిస్తే వచ్చేవాళ్ళు కూడా రారు అర్థమయిందా.”

నెమ్మదిగా చెబుదామనుకున్నా విసుగు ఆగలేదు సీతారాముడికి.తను చెప్పదలుచుకున్నది చెప్పేసి ఫోన్ పెట్టేశాడు.సీతారాముడి అభిప్రాయానికి కళ్ళు తిరిగిపోయాయి అవతలి వ్యక్తికి.ఈకథ ఇక్కడితో అయిపోలేదు.ఇంకా కొనసాగింది.

——-

తమ సంస్థ కు వచ్చిన ఫోన్ నెంబర్లను లిస్టుగా చేసి బాస్ ముందుంచింది సౌమ్య.

“గుడ్..మెట్రో ఫీడ్ బ్యాక్ బావుందన్నమాట”

“లేదు సార్.. చాలా మందివిసుక్కున్నారు.. కొంతమంది కోపంగా మాట్లాడారు..
ఒక పెద్దాయన మాత్రం వీడియో చేసి జస్ట్ మ్యూజిక్ పెట్టండి.
ముందు ఈ సౌండ్ పొల్యూషన్ తగ్గించండని చెప్పాడు సర్.
అదే కరెక్టేమో సర్”

“మన టీంలో ఒక్కళ్ళయినా పబ్లిక్ రియాక్షన్ గమనించారా.”
మీ అందరికీ జీతాలు వేస్ట్
అని తనలో తాను గొణుక్కున్నాడు బాస్ సింగినాదం.ఆ తర్వాత ఆలోచనలో పడ్డాడు.

—–

ఆ తర్వాత కొన్నాళ్ళు మెట్రో ప్రయాణాలు చేయలేదు సీతారాముడు.ఒకరోజు తప్పనిసరై భార్యతో బయల్దేరాల్సి వచ్చింది.భార్య చూడకుండా దేవుడి దగ్గర వత్తులు చేయటం కోసం ఉంచిన దూది కొంచెం తీసుకుని జేబులో పెట్టుకున్నాడు ఎందుకయినా మంచిదని

దైవస్మరణతో మెట్రో ఎక్కాడు.దూది చెవిలో పెట్టుకోబోతుంటే భార్య అదోలా చూసింది. వెంటనే తీసి దాచేశాడు.ఆశ్చర్యం మెట్రోలో మామూలుగా వచ్చే అనౌన్స్మెంట్ లు తప్పితే ఇంకేమీ రావటం లేదు.

“మా దగ్గర ఫాంల్యాండ్ కొనండి..పళ్ళ చెట్లను మేం పెంచుతాం అని రకరకాల విన్యాసాలు చేసే ఓవ్యక్తి యాడ్ తో పాటు ఇప్పుడు అమెరికా వెళతారా యు.కె.వెళతారా అని ఊదరగొట్టిన యాడ్ నిశ్శబ్దంగా ప్లే అవుతోంది.అందులో చక్కగా స్లైడ్స్ కనిపిస్తున్నాయిప్పుడు.

ఫోన్లో వాట్సప్ మెసేజ్ బీప్ రావటంతో ఆ మెసేజ్ చూసిన సీతారాముడి మొహంలో నవ్వు చోటుచేసుకుంది. భర్త దేనికి నవ్వుతున్నాడో అర్థం కాని ఇల్లాలు మాత్రం ఈయనకేదో కొత్త పిచ్చి పట్టుకుందనుకుని తొలి పట్టుకుంది.

“ఏమిటి నవ్వుతున్నారు.నాకూ చెప్పొచ్చుగా” ఏమీలేదు..’సింగినాదం-జీలకర్ర’ అని మళ్ళీ నవ్వాడు. ఇంతకీ ఆ మెసేజ్ పంపిన వ్యక్తి పేరు సింగినాదం.

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *