శూన్య హస్తాలు
మనిషి జీవితం విలక్షణమైనది. కోటానుకోట్ల జీవరాశులన్నింటిలోనూ అత్యున్నతమైనది. భగవంతుడు ఏ మనిషిని రిక్త హస్తాలతో పంపించడు అంటే అర్థం ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఏదో ఒక కళ నిబిడీకృతమై ఉంటుంది.
దానిని గుర్తించి పదిమందికి ఉపయోగపడేలా పదును పెట్టుకొని జన్మ సార్ధకత దిశగా అడుగులెయ్యడంలోనే మనిషి విచక్షణ చూపించాలి. ముందుగా గుర్తించాల్సింది భగవంతుడు ఏ సామర్థ్యం లేని వారిని సృష్టించడు.
కానీ నూటికి ఎనభై శాతం మంది తమలో ఉన్న నైపుణ్యాలను ప్రతిభను గుర్తించకుండా దురదృష్టవశాత్తు ఎవరి చేత కూడా వెలికి తీయబడకుండా నిస్సారమైన జీవితాలను గడుపుతూ అనామకుల్లాగా జీవితాలనుంచి నిష్క్రమిస్తూ ఉంటారు.
పుట్టామా, బతికామా, వెళ్ళిపోయామా అన్నట్లుగా నూతిలో కప్పల జీవిస్తూ ఉంటారు. ఇది ఎంత బాధాకరమో ఇంకెంత దురదృష్టకరమో తమలోని అంతర్గతమైన కలలను తమతోపాటే సమాధుల్లోకి తీసుకెళ్లడం అనేది?
దీనికి పూర్తిగా వాళ్లను నిందించలేము. చుట్టూ ఉన్న నిరాశమయ, నిర్లిప్త ధోరణి ఉన్న వాతావరణం వారిలోని టాలెంట్ను బయటికి రాకుండా అణచివేసి నాలుగు గోడల బంధాలు, బాధ్యతలకు జీవితాంతం బందీలను చేసి కొండకచో తమలోని ప్రతిభను నిరూపించుకోవాలని, తమను తాము ప్రపంచానికి ప్రదర్శించుకోవాలని ఉన్నప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం కానరాక జీవితాలను అతి భారంగా నెట్టుకొస్తూ ఉంటూ ఉంటారు.
కొందరిలో అంతర్లీనంగా అక్షర కళ దాగుంటే మరికొందరిలో సంగీత కళ, చిత్రకళ, నాట్య కళ, నాయకత్వ ప్రతిభ ఇలా వివిధ రకాల సామర్ధ్యాలు ఉంటాయి. కానీ లేనిది అక్కడ ప్రోత్సహించే వాతావరణం.
ఈ సువిశాల సృష్టి ప్రపంచంలో మానవ జన్మ మహాద్భుతం అది ఒక్కసారి మాత్రమే వచ్చే వరం. ప్రతి వారిలోనూ తప్పక ఏదో ఒక విశేషం ఉండే తీరుతుందని గట్టిగా విశ్వసించండి.
అంతర్లీనమైన సృజనను ఆటంకాలకు జడవకుండా అడ్డంకులకు బెదరకుండా వెలికి తీసి సద్వినియోగం చేయండి. ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శించండి. ఆ వాటిని మీతో పాటే సమాధుల్లోకి శాశ్వతంగా నిద్రించడానికి తీసుకెళ్లద్దు.
లోక కళ్యాణానికి ఉపయోగించకుండా వృధా చేయవద్దు. ఈ ఘోరమైన మేధస్సులను జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచి కేవలం రిక్త హస్తాలతో బయల్దేరి వెళ్ళండి.
భగవంతుడు ప్రియమారా ఇచ్చిన దానిని తిరిగి తన దగ్గరికి తీసుకెళ్లకుండా సార్ధకం చేసుకోండి. శూన్య హస్తాలతో వెళ్ళండి.
-మామిడాల శైలజ