శివరాత్రి ఎలా జరుపుకోవాలి ?

శివరాత్రి ఎలా జరుపుకోవాలి ?

శివాభిషేకం – విశిష్టత – ఫలితాలు

*సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది.

ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.*

*శివరాత్రే యోగరాత్రి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.*

*1.ఉపవాసం:-*

*శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి.

చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.*

*ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు.

ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు.

ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.*

*ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం.

ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది.

మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.*

*2. జీవారాధాన:-*

*అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి.

అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది.*

*అందుకే స్వామి వివేకానంద ‘జీవారాధానే శివారాధాన’ అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.*

*శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.*

*3. మౌనవ్రతం:-*

*శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు.

వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది.

అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు.

రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర – నమక చమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.*

*ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు.

మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి.

ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.*

*4.అభిషేకం:-*

*శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.*

*5.జాగరణ:-*

*శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది.

సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.*

*6.మంత్ర జపం:-*

*శివరాత్రి మొత్తం శివనామంతో…. ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.*

*శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి.*

*అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.*

*శివుడు అభిషేక ప్రియుడు!* 

*శివో అభిషేక ప్రియః* అంటే శివుడు అభిషేక ప్రియుడు.

“శివుడు అభిషేక ప్రియుడు” కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట!

‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట!! శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు.

హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి.

అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం…

*అభిషేక ద్రవ్యాలు,ఫలితాలు:*

ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు.
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం.
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి.
చెఱకురసం (పంచదార) …. దుఃఖ నాశనం, ఆకర్షణ.
తేనె .. తేజో వృద్ధి.
భస్మ జలం.. మహా పాప హరణం.
సుగంధోదకం … పుత్ర లాభం.
పుష్పోదకం… భూలాభం.
బిల్వ జలం … భోగ భాగ్యాలు.
నువ్వుల నూనె… అపమృత్యు హరణం.
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం.
సువర్ణ జలం … దరిద్ర నాశనం.
అన్నాభిషేకం .. సుఖ జీవనం.
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి.
నారికేళ జలం … సర్వ సంపద వృద్ధి.
ఖర్జూర రసం …. శత్రు నాశనం.
దూర్వోదకం (గరిక జలం)… ద్రవ్య ప్రాప్తి.
ధవళొదకమ్ … శివ సాన్నిధ్యం.
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి.
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం.
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి.
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి.
మామిడి పండు రసం… దీర్ఘ వ్యాధి నాశనం.
పసుపు, కుంకుమ… మంగళ ప్రదం.
వీబూది …. కోటి రెట్ల ఫలితం.

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు.

శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు.

కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు. ఆయన శిరస్సు పై గంగ వుంటుంది.

అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి.

*”అప ఏవ ససర్జాదౌ”* అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని…

*”యోపా మాయతనంవేద”* ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది.

భగవంతుని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

*”ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్”* అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పఠిస్తూ అభిషేకం చేయాలి.

*”పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్”*

పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

– సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *