శత్రు స్నేహితుడు
ఛీ దీనమ్మ జీవితం ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు అని ఇప్పుడే అర్థం అయ్యింది రా, మా నాన్న అందర్నీ నమ్మి మోసపోయాడు,తర్వాత అమ్మ కూడా అలాగే నమ్మి మోసపోయింది.
ఆ ఖాతాలో ఇప్పుడు నేను కూడా చేరాను అంటూ తన గోడు వెళ్లబోసుకున్నారు శ్రీ. మధు అంత విని అసలు ఏమైందీ రా అంటూ అడిగాడు. ఏమి లేదురా నేను సిమెంట్ వ్యాపారం పెట్టాను కదా అవును పెట్టావు అయితే ఇప్పుడు ఏమైంది అన్నాడు మధు.
అదే నా కొంప ముంచింది రా అన్నాడు తల పై చేతులు పెట్టుకుంటు, ఏమైంది అన్నాడు మళ్లీ మధు. అరె వాడు ఆ లతీఫ్ గాడు గడికి నా షాప్ కి వచ్చి వ్యాపారం ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటే అరె దోస్తు కదా అని అన్ని వివరాలు చెప్పాను.
ఆ తర్వాత వాడు వెళ్లి ఈ విషయాలన్నీ లక్ష్మణ్ గాడికి చెప్పాడు అంట. ఆ లక్ష్మణ్ గాడు వీడు చెప్పిన విషయాలన్నీ విని పైసల్ ఎక్కువ ఉన్నాయని వాడు కూడా నాకు పోటీ కి అదే వ్యాపారం పెట్టాడు.
పైగా సగం ధర కు అమ్ముతున్నాడు అంట . దాంతో నా వ్యాపారం దెబ్బతిని , నాకు వ్యాపారం లో నష్టం వచ్చింది అంటూ బోరుమని తిరిగి మధు ను చూస్తూ అవును రా మనం నలుగురం దొస్తులం కదా ఇందులో నీ హస్తం కూడా ఉండే ఉంటుంది.
ఇప్పుడు నేను అన్న మాటకు కూడా నువ్వెళ్ళి వారికి చెప్పవని గ్యారంటీ లేదు రా , ఏం కాలం రా ఇది. నమ్మి అన్ని చెప్తే ఇలా ద్రోహం చేస్తే ఎంత బాధగా ఉంటుంది రా, వ్యాపారం లో ఉన్న కిటుకులు అన్ని వాడికి చెప్పి తప్పు చేశాను అన్నాడు శ్రీనివాస్.
అవునురా నిజమే నువ్వు తప్పు చేశానని బాధపడుతూ ఉన్నావు. అలాగే నువ్వు నన్నొక మాట కూడా అన్నావు. నేను కూడా అందులో భాగమే అని,కానీ నేను అందులో భాగం అయితే నువ్వు ఆ మాట అన్న తర్వాత కూడా ఇంకా ఇక్కడ ఉండను.వెళ్ళిపోతాను.
నేను అలా అటువి ఇటూ ఇటువి అటూ చేరవేసే రకాన్ని కాదు, అలాగే వెన్నుపోటు పొడిచే రకాన్ని కూడా కాదు. అందుకే నీ బాధంతా విన్నాక నీకొక సలహా ఇవ్వలని అనుకుంటున్నాను అన్నాడు మధు.
అవునా అయ్యో నన్ను క్షమించు రా ,నా ఆలోచన వల్ల ఏదో పిచ్చిగా మాట్లాడాను అవేవీ మనసులో పెట్టుకోకుండా ఆ సలహా ఏమిటో చెప్పారా అన్నాడు శ్రీనివాస్.
నీ వ్యాపారం సిమెంటు వ్యాపారం,నీ దగ్గర నుండి అన్ని తెలుసుకుని తక్కువ ధరకు అమ్ముతున్నాడు అంటే అతను నాసిరకం అమ్ముతున్నాడు అని అర్థం. అందువల్ల అతనికి ఎలా చూసినా నష్టమే తప్ప లాభం లేదు. ఇన్నాళ్లు అని తక్కువ ధరకు ఇవ్వగలడు.
అతను తక్కువ ధరకు ఇవ్వలేడు, అలాగే అతని దగ్గర తీసుకున్న వారు అది నాసిరకం అని గ్రహించిన తర్వాత ఎవరూ అతని షాప్ కి రారు. ఇప్పుడు నువ్వు నష్టాల్లో ఉండొచ్చు.
కానీ తర్వాత నువ్వే మంచి లాభాలు సంపదిస్తా వు.ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది కాబట్టి నువ్వు బాధ పడకు. నీకు మంచిరోజులు వస్తాయి. ఎవరికైనా కొన్నాళ్ళు వెలుతురు ,కొన్నాళ్ళు చీకటి సహజమే.ఇక వారి స్నేహం వదిలిపెట్టు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు చాలు అన్నాడు. అలాగే
అయితే ఒకటి మాత్రం బాగా గుర్తు పెట్టుకో ఇక నుండి అయినా ఎవరైనా ఏదైనా అడిగితే నిర్మొహమాటంగా నాకు తెలియదు అని చెప్పు, ఇంత వ్యాపారం చేస్తున్నావు ఇది కూడా తెలియదా అని అంటారు.
నాకేమీ తెలియదు, మా మామనో,ఇంకెవరో చేయమంటే చేస్తున్నాను. అని మాత్రమే చెప్పు ,అలాగే గుడ్డిగా ఎవర్ని పడితే వారిని నమ్మకు, నీ బలహీనతలు, బలాలు ఎవరికీ చెప్పుకోకు.
ఎందుకంటే వాటితోనే నిన్ను ఆడుకునే, అణచివేసే ప్రయత్నం జరగవచ్చు అంటూ హిత బోధ చేశాడు మధు అనబడే మధుకర్.
అవునురా ఇక నుండి ఎవర్ని నమ్మను.నా నీడను కూడా నమ్మను.ఇంత నమ్మక ద్రోహం చేస్తూ నా షాప్ లోకి వచ్చి నాతో కూల్ డ్రింకులు తెప్పించుకుని మరి తాగారు. అన్నాడు శ్రీనివాస్.
మనతో ప్రయాణం చేస్తూనే మనకు వెన్నుపోటు పొడిచే వారుంటారు. అని చెప్పడమే కథ ఉద్దేశ్యం. అది చుట్టాలో, స్నేహితులో, ఇంట్లోవారా, ఇంకెవరైనా నా అనేది ఎవరూ చెప్పలేరు.తెలుసుకోలేరు.
-భవ్యచారు